సర్జరీ తర్వాత మాట సరిగా రావడం లేదు | ENT Counselling Special Story | Sakshi
Sakshi News home page

సర్జరీ తర్వాత మాట సరిగా రావడం లేదు

Published Wed, Aug 14 2019 10:05 AM | Last Updated on Wed, Aug 14 2019 10:05 AM

ENT Counselling Special Story - Sakshi

నాకు ఈమధ్యే గుండెకు సంబంధించిన సర్జరీ అయ్యింది. ఆ తర్వాత నుంచి ఎంత ప్రయత్నించినా మాట సరిగా రావడం లేదు. ఆ మాట కూడా గాలిలా వస్తోంది. అంతకముందు నాకు ఎప్పుడూ గొంతుకు సంబంధించిన సమస్యలు లేవు. ఇదేగాక... తినేటప్పుడు, తాగేటప్పుడు, మింగే సమయంలో ఇబ్బందిగా ఉంది. గొంతుకు ఏదో అడ్డు పడినట్లుగా ఉంది. నాకు తగిన పరిష్కారం చూపండి.– కె.వి.జె. రాజు, గుంటూరు

మీ సమస్యకు సంబంధించిన వివరాలు పరిశీలించాక మీకు స్వరపేటికలోని ఒక భాగం అయిన ‘వోకల్‌ ఫోల్డ్‌’లో సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ), ట్రకియాస్టమీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్స్‌లో కొన్నిసార్లు వోకల్‌ఫోల్డ్‌కు ఒత్తిడి తగలడం లేదా అది దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువ. మీకు కూడా అలాగే జరిగినట్లుగా అనిపిస్తోంది. దీనివల్ల మీరు చెప్పిన విధంగానే మింగడం, మాట్లాడటంలో సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు వోకల్‌ ఫోల్డ్‌ పెరాలసిస్‌ రావడానికి అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి మొదట మీరు అనుభవజ్ఞులైన ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించండి. మీకు అవసరాన్ని బట్టి లారింగోస్కోపీ, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అంతేకాదు... మీరొకసారి స్పీచ్‌ థెరపిస్ట్‌ను సంప్రదించి అవసరమైన ఎక్సర్‌సైజ్‌లు కూడా ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది.

మాట్లాడుతుంటే నత్తి వస్తోంది... పరిష్కారంచూపండి
నేను బీటెక్‌ చదువుతున్నాను. నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడుతుంటే  నాకు నత్తిలా వస్తోంది. వేగంగా మాట్లాడటం కష్టమవుతోంది. నా చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది. భవిష్యత్తులో ఉద్యోగం, కెరియర్‌ గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉంటోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా బాధపడుతున్నాను. నాకు తగిన పరిష్కారం చూపండి.– డి. విశాల్, సికింద్రాబాద్‌

మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్‌ అంటారు. దీనికి గల ముఖ్యకారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీరు మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి మొదట అనుభవజ్ఞులైన స్పీచ్‌ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. కొన్ని సార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య ఎక్కువవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. స్పీచ్‌ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్‌ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్‌ చేస్తే ఈ సమస్యను  చాలావరకు అధిగమించవచ్చు.

ముక్కులోఏదో అడ్డంపడినట్లుగాఉంటోంది...
నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా ఈ సమస్య వదలడం లేదు. చాలా రకాల మందులతో పాటు డాక్టర్‌ సలహా మేరకు ముక్కులోకి చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు.– డి. శివరామ్, నేలకొండపల్లి

ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్‌ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్‌ (పీఎన్‌ఎస్‌) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.
మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్‌ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్నిరకాల నేసల్‌ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు.

తరచూ జలుబు చేస్తోంది... తగ్గేదెలా?
నాకు తరచూ జలుబు చేస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. రోజువారీ పనులు చేసుకోలేక పోతున్నాను. టాబ్లెట్‌ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికితోడు ఈ మధ్య చాలా నీరసంగా కూడా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.– కె.ఆర్‌. శ్రీనివాసమూర్తి, అమలాపురం

మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్‌ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది అన్నారు కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండుభాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్‌ టాబ్లెట్‌ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్‌ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. డాక్టర్‌ ఇ.సి. వినయ కుమార్‌హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్,అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement