మాట్లాడుతున్న డాక్టర్ సత్యశ్రీధర్
కరీంనగర్: హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స చేసి, ఓ మహిళకు కొత్త జీవితాన్ని అందించినట్లు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సత్యశ్రీధర్ తెలిపారు. బుధవారం కరీంనగర్‌లోని యశోద హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ పట్టణానికి చెందిన 54 ఏళ్ల చెన్నూరి లత గుండె దడ, నడిస్తే ఆయాసం, గట్టిగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఏడాది క్రితం సోమాజిగూడలోని తమ ఆస్పత్రికి వచ్చిందన్నారు.
ఆమెకు ఈసీజీ, 2డీ ఎకో, యాంజియోగ్రామ్ నిర్వహించగా పదే పదే గుండెపోటు వచ్చి, గుండె వ్యాకోచం చెందిందని గుర్తించినట్లు పేర్కొన్నారు. కార్డియాక్ రీమోడలింగ్ చికిత్స ద్వారా గుండె పరిమాణాన్ని తగ్గించామన్నారు. 6 గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో ఆమెకు బైపాస్ సర్జరీ, కార్డియాక్ అనాటమీ పునరుద్ధరణ, మిట్రల్ వాల్వ్ రిపేర్ తదితర ప్రక్రియలు జరిపినట్లు తెలిపారు.
ఆమె పూర్తిగా కోలుకొని, ఏడాదిగా ఆరోగ్యంగా జీవిస్తోందన్నారు. గుండె వైఫల్యం అనేది అతికొద్ది మందిలో మాత్రమే వస్తుందని, అప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. అన్ని రకాల వైద్యులు, అధునాతన వైద్య సదుపాయాలు యశోద ఆస్పత్రిలో ఉండటం వల్లే ఇలాంటి ఆపరేషన్లు విజయవంతం అవుతున్నాయని తెలిపారు.
అనంతరం లత మాట్లాడుతూ.. తాను బతుకుతానని అనుకోలేదని, యశోద ఆస్పత్రి వైద్యులు అందించిన వైద్యంతో ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడపడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment