హోమియో కౌన్సెలింగ్
మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి.
- రాజేశ్వరి, కర్నూలు
మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటానికి హోర్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండం ఏర్పడినప్పట్నుంచీ జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం కలిగి ఉంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లే శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇవి సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి.
నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేస్తే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
నా వయసు 49 ఏళ్లు. గత ఐదేళ్లుగా నేను డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. చక్కెర రోగులకు వ్యాయామం అవసరమని డాక్టర్లు చెప్పారు. డయాబెటిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
- వి. రాము, నూతనకల్లు
డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల మరింత మెరుగైన జీవనాన్ని సాగించగలచు.అయితే దీనికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వ్యాయామానికి మీ శరీరం సంసిద్ధంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా స్థూలకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. గుండెజబ్బులు ఏవైనా ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోవాలి. శరీరానికి ఏ మేరకు వ్యాయామం కావాలో, ఏ మేరకు సురక్షితమో కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు.
వ్యాయామానికి ముందుగా మీ ఒంట్లోని చక్కెర పాళ్లు తెలుసుకోవాలి. అవి మరీ ఎక్కువగా ఉన్నా, లేదా మరీ తక్కువగా ఉన్నా, రక్తంలోనూ, మూత్రంలోనూ కీటోన్స్ ఉన్నా శరీరకంగా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయకూడదు.
ఒకవేళ రక్తంలోని చక్కెరపాల్లు 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే వ్యాయామానికి ముందు కాస్త ఉపాహారం తీసుకోవాలి. ఒకవేళ చక్కెర పాళ్లు త్వరత్వరగా పడిపోతుంటే తక్షణం చాక్లెట్ లాంటిది ఏదైనా తీసుకోవాలి.
మన శరీరానికి, మెదడుకు అవసరమైనంత ద్రవాహారం అందేలా చేసుకోవాలి. ఇందుకోసం వ్యాయామానికి ముందర, వ్యాయామం తర్వాత తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాయమాన్ని మొదలుపెట్టడానికి తక్షణం ముందుగానూ, వెంటనే ఆ తర్వాత నీళ్లు తాగకూడదు.
వాతావరణంలో చాలా ఎక్కువగా వేడి ఉన్నప్పుడు శరీరం వెంటనే అలసిపోయే వ్యాయామాలు చేయకూడదు. ఎందుకంటే కొందరిలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధంగా ఉంచేంత సామర్థ్యం ఉండదు. అలాంటి సందర్భాల్లో చెమటను, రక్తప్రసరణను నియంత్రించే అటనామిక్ నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే బాగా వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయవద్దు.
డయాబెటిస్ వల్ల ఒక్కోసారి పాదాలకు జరిగే రక్తప్రసరణ తగ్గి వాటిని అయ్యే గాయాలు తెలియకపోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు (పెరిఫెరల్ న్యూరోపతి) రావచ్చు. మీ పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైనా వెంటనే దగ్గరివారికి తెలియజేసేలా మీ మొబైల్‌ఫోన్‌ను వెంటే ఉంచుకోండి.
మీ వ్యాయామం ప్లానింగ్‌లో మీ కుటుంబ సభ్యులనూ భాగం చేసుకోండి. ప్రతిరోజూ ఒకేలాంటి వ్యాయామాలు రిపీట్ కానివ్వకండి. ఒకరోజు బాగా శారీరక శ్రమ ఉన్నవి చేస్తే మరో రోజు తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇలా రోజువిడిచి రోజు వ్యాయామాలను మార్చుకోండి.
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. ఇటీవల ఎక్కువగా కీళ్లనొప్పులతో బాధపడుతున్నాను. సాధారణ కీళ్లనొప్పులే అని అంతగా పట్టించుకోలేదు. గత నాలుగు రోజులుగా కీళ్లనొప్పులతో పాటు వాపు, జ్వరం కూడా ఉంటోంది. నడుస్తున్నప్పుడు నొప్పితో సరిగా నడవలేకపోతున్నాను. రోజూ చేసుకునే పనులూ చేసుకోలేకపోతున్నాను. విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గినట్లు అనిపిస్తోంది. తర్వాత మళ్లీ కీళ్లనొప్పులు వస్తున్నాయి. నేను ఇదివరకెప్పుడూ ఇలాంటి లక్షణాలతో అనారోగ్యానికి గురికాలేదు. మొదటిసారి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పులు తగ్గిపోతాయని తెలిసినవారు చెబుతున్నారు. ఈ సమస్య ఎందుకు వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- అనసూయ, ఏలూరు
మీరు తెలిపిన వివరాలను బట్టి మీకు ఆర్థరైటిస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్లనొప్పులతో పాటు జ్వరం, వాపు కూడా ఉంటోంది. వయసు పైబడిన వారిలోనే ఆర్థరైటిస్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసులో కూడా ఆర్థరైటిస్ బారిన పడుతున్నవారు ఉన్నారు. విశ్రాంతి తీసుకోవడం వల్ల అన్ని రకాల కీళ్ల నొప్పులు తగ్గవు. కీళ్లనప్పుల్లో చాలా రకాలు ఉంటాయి. కీళ్లనొప్పి రకాన్ని బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ మీకు ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం ఆర్థరైటిస్‌కు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆర్థరైటిస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే దానిని సులువుగా నివారించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉంటాయి. ఆర్థరైటిస్ రకాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మీరు తెలిపిన లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కనిపిస్తాయి. దీనికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా కీళ్లనొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందడంతో పాటు మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు.
చక్కెర వ్యాధిగ్రస్తుల వ్యాయామంలో జాగ్రత్తలు...
Published Mon, Oct 12 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM
Advertisement
Advertisement