నా వయసు 38 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో చాలా మంటగా ఉంటోంది. ఇలా మాటిమాటికీ జ్వరం, మూత్రంలో మంట రాకుండా ఉండేందుకు తగిన సలహా ఇవ్వండి. – సుభద్ర, ఖమ్మం
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి.
ఈ వయసునుంచే బీపీ మందులు వాడాల్సిందేనా?
నా వయసు 27 ఏళ్లు. నాకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలూ లేవు. అయితే జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 ఉన్నట్లు తెలిసింది. ఇంత చిన్న వయసు నుంచే బీపీ మందులు వాడాల్సిందేనా? దయచేసి సలహా ఇవ్వండి.– సుకుమార్, చౌటుప్పల్
ఇంత చిన్న వయసులో ఏ కారణం లేకుండా మీరు చెప్పిన బీపీ రీడింగ్స్ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు చాలా తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. మీరు ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయండి.
బాబు కళ్లు, కాళ్లు వాచినట్లుగా ఉంటున్నాయి...
మా అబ్బాయికి ఆరేళ్లు. పొద్దున్నే లేచినప్పుడు కళ్ల మీద రెప్పలు ఉబ్బి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాళ్లలో కూడా వాపు కనిపిస్తోంది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ 3 ప్లస్ ఉందని చెప్పారు. ఈ సమస్య ఏమిటి? దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?– నవీన్‌కుమార్, చిత్తూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు నెఫ్రొటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారికి మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదటగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటల్లో మూత్రంలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకునే పరీక్ష చేయించండి. దానితో పాటు ఆల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష కూడా చేయించండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లో సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న పిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్ వాడాలి. అవి వాడే ముందు మీ బాబుకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి పదిహేనేళ్ల వయసు వరకు మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అయితే మొదటిసారే పూర్తి చికిత్స చేయించుకుంటే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ పేషెంట్స్ ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించి వాడాలి. ఇన్ఫెక్షన్ వస్తే వ్యాధి తిరగబెట్టవచ్చు. అలాంటప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించుకోవాలి.
మూత్రంలోఎరుపు కనిపిస్తోంది!
నాకు 37 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? – రవిప్రసాద్, ఎచ్చర్ల
మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ý కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment