పల్మనాలజీ కౌన్సెలింగ్
నా వయసు 55 ఏళ్లు. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడిదగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు. – కె. పద్మనాభరావు, విజయవాడ
మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వాట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్‌లో మూడు రకాలు ఉన్నాయి. అవి...
క్రానిక్ సిలికోసిస్: ఇది చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్‌పోజ్ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల కాస్త తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది.
యాక్సిలరేటెడ్ సిలికోసిస్ : సాధారణంగా కేవలం 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది.
అక్యూట్ సిలికోసిస్ : కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే చాలా ఎక్కువ మొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరితీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్ బయటపడుతుంది. సమయం పెరుగుతున్నకొద్దీ లక్షణాల తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు ఒకసారి మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్ లేదా ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి.
ఇంత చిన్న పిల్లాడికి ఎప్పుడూ పొడిదగ్గు... పరిష్కారం చెప్పండి
మా అబ్బాయి వయసు 11 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం కూడా ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. – డి. విశ్వేశ్వరరావు, అనకాపల్లి
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్‌పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు.
డాక్టర్ రమణ ప్రసాద్
కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్
పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment