గుండెమ్మ కథ | special story to heart | Sakshi
Sakshi News home page

గుండెమ్మ కథ

Published Wed, Oct 4 2017 11:37 PM | Last Updated on Thu, Oct 5 2017 3:48 PM

 special  story to  heart

ఏ వయసుకు ఆ ముచ్చట ఉన్నట్టే  ఏ వయసు గుండెకు ఆ వయసు ముచ్చటుంటుంది.  ఈ కథలో ఉన్న సమస్యలకు కొన్నిసార్లు సర్దుకుపోవాలి.  కొన్నిసార్లు జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు పోరాడి గెలవాలి.  తెలుసుకున్నోళ్లే తెలివైనోళ్లు.  గుండెసవ్వడిలో విపినించే అపశ్రుతల కథే... ఈ ‘గుండె’మ్మ కథ.

పుట్టకముందే వెంటాడే గుండెజబ్బులు
పిండదశలో ఉన్న శిశువు గుండెకు సైతం కొన్ని సమస్యలు రావచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవి...
డక్టస్‌ ఆర్టీరియోసిస్‌: గుండె కుడివైపు నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే పల్మునరీ ట్రంక్, ఎడమవైపు నుంచి అయోర్టా అనే రక్తనాళాల మధ్య ఒక చిన్న పైప్‌ ద్వారా కనెక్షన్‌ ఉంటుంది. దీన్ని డక్టస్‌ ఆర్టీరియోసస్‌ అంటారు. బిడ్డ పుట్టగానే ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభమవుతుందన్న విషయం తెలిసిందే. బిడ్డ ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించిన 72 గంటల్లో ఈ డక్టస్‌ ఆర్టీరియోసస్‌ కనెక్షన్‌ కూడా మూసుకుపోవాలి. ఒకవేళ అలా మూసుకోకపోతే వచ్చే సమస్యను పేటెంట్‌ డక్టస్‌ ఆర్టీరియోసిస్‌ (పీడీఏ) అనే గుండెజబ్బు (కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌)గా పరిగణిస్తారు. ఇది గుండెజబ్బు నెలలు నిండకుండానే పుట్టే బిడ్డల్లో ఎక్కువ. సాధారణంగా దానంతట అదే సర్దుకుంటుంది. కొద్దిమందిలో ఆపరేషన్‌ అవసరం కావచ్చు. ఇప్పుడు ఆపరేషన్‌ అవసరం లేకుండా కేథెట్‌ ట్రీట్‌మెంట్, కాయిల్స్‌ లేదా అంబరెల్లా ద్వారా సరిచేయవచ్చు.

పిండ దశలోనే శిశువులో గుండె స్పందనల లయ (రిథమ్‌) సమస్యలు: పిండదశలో గర్భస్థ శిశువు గుండె స్పందనలను నార్మల్‌ అని చెప్పే సంఖ్యలు చాలా ఉన్నాయి. పిండం గుండె నిమిషానికి 120 నుంచి 160 వరకు కొట్టుకోవడం నార్మల్, కనిష్ఠంగా 90 సార్లు కొట్టుకున్నా అదీ నార్మలే. కొన్నిసార్లు తల్లికి అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష చేయించినప్పుడు గర్భస్థ పిండంలోని గుండె స్పందనలో మార్పులు ఉండవచ్చు. ఇలాంటి కండిషన్‌ను ఫీటల్‌ కార్డియాక్‌ అరిథ్మియా అంటారు. గుండె వేగం చాలా ఎక్కువగా ఉన్న కండిషన్‌ను ఫీటల్‌ టాకికార్డియా అనీ, గుండె వేగం మరీ తక్కువగా ఉంటే ఫీటల్‌ బ్రాడీకార్డియా అంటారు. ఇలాంటి సందర్భాల్లో కాబోయే తల్లికి మందులు ఇవ్వడం ద్వారా ఫీటల్‌ కార్డియాక్‌ అరిథ్మియా పరిస్థితిని అదుపులోకి తేవచ్చు.

కోఆర్కటేషన్‌ ఆఫ్‌ ఆర్టా: గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు మధ్యలో సన్నబడడం వల్ల వచ్చే రుగ్మత ఇది. అయితే ఈ రక్తనాళాలు సన్నబడిపోయినా చికిత్స చేయడం సాధ్యమే. కొందరిలో అసలు ఆ రక్తనాళాలే రూపొందవ#. అలాంటి సవుస్యను అట్రిసియా అంటారు. ఈ కండిషన్‌కు చికిత్స అందించడం ఇంకా ప్రయోగదశలోనే ఉంది.
ఇవేగాక ప్రధాన వాల్వ్‌లు సన్నబడటం (పల్మునరీ వాల్వ్‌ స్టెనోసిస్‌ /అయోర్టిక్‌ స్టెనోసిస్‌) లాంటివి ఎన్నో గుండె రుగ్మతలు ఉన్నాయి.

బిడ్డ పుట్టాక వచ్చే కొన్ని గుండెజబ్బులు...
ఇందులోనూ చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి...
ఏఎస్‌డీ : గుండె పై గదుల మధ్య గోడలో... అంటే ఏట్రియాల మధ్య ఒక రంధ్రం ఉంటుంది. దీన్నే ఫొరామెన్‌ ఒవేల్‌ అంటారు. ఇది ఇలా ఉండటం సహజం. సాధారణంగా బిడ్డ పుట్టాక 48 గంటల నుంచి 72 గంటల్లోపు ఈ ఫొరామెన్‌ ఒవేల్‌ మూసుకుపోతుంది. ఈ రంధ్రం మూసుకోకపోతేనే సమస్య. పుట్టుకతో వచ్చే ఈ సమస్య ఏట్రియల్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ (ఏఎస్‌డీ). అయితే దీన్ని పిండంలోనే వచ్చే సమస్య అంటూ చెప్పడానికి వీల్లేదు.  

వీఎస్‌డీ:  కింది గదుల వుధ్య ఉండే గోడలో చిల్లు ఉంటే దాన్ని వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ అనవచ్చు. నిజానికి ప్రతి చిన్నారిలోనూ పుట్టే వరకూ కింది గదుల వుధ్య గోడలో రంధ్రం ఉంటుంది. పుట్టిన 48–72 గంటల్లోపు అది దానంతట అదే పూడుకుపోతుంది. ఆ రంధ్రాన్నే స్మాల్‌ వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ (వీఎస్‌డీ) అంటారు. అందుకే దాన్ని ఆ దశలో డిఫెక్ట్‌గా పరిగణించరు. అప్పటికీ వుూసుకోకపోతేనే సవుస్య. చాలా మందిలో వీఎస్‌డీ లక్షణాలు కనిపించకపోవచ్చు. బిడ్డ 6 నుంచి 8 వారాల దశలో గుండె స్పందనల్లో తేడా కనిపించవచ్చు. వీఎస్‌డీ ఓ మోస్తరు నుంచి పెద్దగా (లార్జ్‌) ఉన్నప్పుడే హార్ట్‌ఫెయిల్యూర్‌ లక్షణాలు కనిపిస్తాయి.  ఇది చిన్న సర్జరీతో చక్కబడుతుంది.

టెట్రాలజీ ఆఫ్‌ ఫాలో: పుట్టుకతోనే నీలంగా పుడతారు. అందుకే వీళ్లను బ్లూబేబీస్‌ అంటారు. పిల్లలు నీలంగా వూరే ఈ జబ్బును మెుదట నీల్స్‌ (స్టెన్సన్‌) కనుక్కున్నారు. లూÄ ూస్‌ ఆర్థర్‌ ఫాలో అన్న ఫిజీషియన్‌ పేరుమీద ఫాలోస్‌ టెట్రాలజీ అని పేరు పెట్టారు.

బిడ్డల్లో కనిపించే లక్షణాలు : ∙ఛాతీలో నొప్పి ∙గుండె విఫలం కావడం ∙చిన్నారి నీలంగా మారడం ∙స్పృహతప్పి పడిపోవడం / కళ్లు తిరగడం ∙గుండె స్పందనల్లో మార్పు ∙గుండె దడ

యుక్తవయసులో గుండెజబ్బులు
చిన్నపిల్లల్లో నిద్రాణంగా ఉండే కొన్ని గుండెజబ్బులు పెద్దయ్యాక... అంటే యుక్తవయసులోనే వారిని గుండెజబ్బుల పేషెంట్స్‌గా మార్చివేస్తున్నాయి. ఉదాహరణకు రువూటిక్‌ హార్ట్‌ డిసీజెస్‌. ఇది రెండు దశాబ్దాల కిందట  ఎక్కువగా ఉండేది. అదృష్టవశాత్తు క్రమేపీ తగ్గుతోంది. తక్కువ ఆర్థిక–సావూజిక స్థాయి (లో సోషియో–ఎకనమిక్‌) కుటుంబాల్లో తక్కువ స్థాయి జీవన ప్రవూణాల వల్ల (లివింగ్‌ స్టాండర్డ్‌) వల్ల ఈ గుండెజబ్బులు వస్తాయి. స్టెప్టోకోకల్‌ బాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల గొంతునొప్పి, టాన్సిల్స్‌ వచ్చిన కేసుల్లో ఈ తరహా గుండెజబ్బులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీరిలో కీళ్లనొప్పులు కూడా ఉంటాయి. నిజానికి అది గొంతునొప్పే అయినా శరీరంలో వేరే చోట్ల దాని ప్రభావం పడుతుంది. ఇది వుుఖ్యంగా గుండె కవాటాలను (వాల్వ్స్‌ను) ప్రభావితం చేస్తుంది. చిన్న పిల్లలప్పుడు వచ్చే ఈ సవుస్య వాళ్లు యుక్తవయస్కులయ్యాక గుండెజబ్బులున్న వారిగా వూర్చేస్తుంది. తొలిదశలో వుందులతో చికిత్స చేసినా ఎప్పటికైనా సర్జరీ చేయాల్సిన పరిస్థితికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా కవాటాల (వాల్వ్స్‌) సర్జరీలు అవసరం పడతాయి.

యువతలో వచ్చే మరికొన్ని...
ఇటీవల హైస్కూళ్లు కాలేజీ దశలోనే... అథ్లెట్లు తమ సమస్యను గుర్తెరగక అధిక వ్యాయామాలతో అకస్మాత్తుగా మరణిస్తున్నారు. అందుకే ఎక్కువ శారీరక శ్రమ ఉండే ఆటల్లో పాల్గొనే పిల్లలు డాక్టరును సంప్రదించాకే కొనసాగించాలి.

యుక్తవయసులో...
 హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి (హెచ్‌సీఎమ్‌) : ఇది అనువంశీకంగా వచ్చే వ్యాధి. ఇందులో గుండె కండరం మందంగా మారిపోతుంది. దాంతో గుండెకు సంబంధించిన విద్యుత్‌ సరఫరాలో తేడా కారణంగా గుండెలయలో మార్పులు (అరిథ్మియా) వచ్చి, గుండె స్పందనలు లయబద్ధంగా సాగవు. దాంతో హెచ్‌సీఎమ్‌ కారణంగా 30 ఏళ్ల వారు అకస్మాత్తుగా మృతి చెందవచ్చు. ఇది అథ్లెట్లలో ఎక్కువ.

కరొనరీ ఆర్టరీ అబ్‌నార్మాలిటీస్‌ : గుండెకు రక్తాన్ని అందించే కరొనరీ ధమనుల్లో తేడా ఉంటుంది. వ్యాయామం సమయంలో ముడుచుకుపోవడం లేదా నొక్కుకుపోవడం జరుగుతుంది. దాంతో గుండెకు రక్తం అందక మృత్యువాత పడవచ్చు.

లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌  : ఈ సమస్యకూడా అనువంశీకంగానే వస్తుంది. ఇందులోనూ గుండె లయలో తేడాలు వచ్చి అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు.
ఇవే గాక గుండె కండరానికి వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌లు, గుండె విద్యుత్‌ వ్యవస్థకు సంబంధించిన బ్రుగాడా సిండ్రోమ్‌ వంటి సమస్యలు కూడా యువతలో అకస్మాత్తు మరణాలకు దారితీయవచ్చు. ఇక ఆటల్లో భాగంగా ఛాతీ భాగంలో అకస్మాత్తుగా తగిలే పెద్ద దెబ్బ వల్ల కొమోషియో కార్డిస్‌ అనే కాస్త అరుదైన గుండె సమస్య కూడా వచ్చి అది కూడా ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నాయి.

యువతలో ఎంత తరచుగా అంటే...
ఇది ఇటీవల ఎక్కువైంది. ప్రతి 50వేల గుండెపోటు మరణాల్లో ఒకటి స్కూలు లేదా కాలేజీ పిల్లలదే ఉంటోంది.  

వేర్వేరు వయసుల్లో వచ్చే గుండె సమస్యలు!
గుండె జబ్బులు అనగానే సాధారణంగా పెద్ద వయసు వారే కళ్ల ముందు మెదులుతారు. కానీ గుండెజబ్బులకు ఏ వయసువారూ అతీతం కాదు. పుట్టకముందు పిండ దశలో ఉన్న శిశువులు మొదలు... నూరేళ్ల వయసు వరకు అందరికీ వివిధ రకాల గుండెజబ్బులు వస్తుంటాయి. వివిధ వయసుల్లో ఉన్న మహిళలు–పురుషులు, పిల్లల్లో కనిపించే కొన్ని ప్రధానమైన గుండెజబ్బులను తెలుసుకోవడం, గుండెపోటు నివారణ, చికిత్సలపై తగిన అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం.

వేర్వేరు వయసుల మహిళల్లో
వేర్వేరు వయసులో ఉన్న మహిళల్లో వేర్వేరు కారణాల వల్ల గుండె సమస్యలు వస్తుంటాయి.
చిన్న వయసులోని యువతుల్లో... : జీవనశైలి సమస్యల వల్ల చిన్న వయసులో ఉన్న యువతుల్లో గుండెజబ్బులు పెరుగుతున్నాయి. 15 – 16 ఏళ్ల యువతుల్లో శారీరక శ్రమలోపించడంతో గుండె జబ్బులు వస్తున్నాయి. యువతుల్లో  6 నుంచి 19 ఏళ్ల వయసులోని 15 శాతం మంది స్థూలకాయులుగా మారుతున్నారు. ఇక విదేశీ పోకడలను అనుకరిస్తూ ఇటీవలే పట్టణ ప్రాంతాల్లోని యువతుల్లో పొగాకు వినియోగం పెరుగుతుండటం కూడా గుండెజబ్బులకు కారణమవుతోంది.

మధ్యవయస్కులైన మహిళల్లో : మెనోపాజ్‌ దశకు చేరుకోవడం అనే అంశం  మధ్యవయస్కులైన మహిళల్లో గుండె సమస్యలకు ఒక ప్రధానమైన ముప్పు (రిస్క్‌ ఫ్యాక్టర్‌)గా మారుతోంది. మెనోపాజ్‌ రానివాళ్లతో పోలిస్తే మెనోపాజ్‌ వచ్చిన మహిళల్లో గుండెజబ్బులు 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. మెనోపాజ్‌ రాకముందు రుతుక్రమం వచ్చే మహిళల్లోని ఈస్ట్రోజెన్‌ గుండెజబ్బులను రాకుండా నివారిస్తోంది.

►ప్రతి ఏటా మన దేశంలోని 45 – 64 ఏళ్ల మధ్య వయసు మహిళలు 88,000 మంది గుండెపోటుతో మరణిస్తున్నారు.
►65 ఏళ్ల వయసున్న మహిళల్లో దాదాపు సగం మంది ఎనిమిదేళ్ల వ్యవధిలో గుండెపోటు వచ్చి మృతిచెందుతున్నారు.
►మహిళల్లో 55 ఏళ్ల తర్వాత అధికరక్తపోటు సమస్య దాదాపు 90 శాతంమందిలో కనిపిస్తోంది. అది కూడా గుండెజబ్బులకు ఒక ప్రధాన కారణం.
►ఇక 45 ఏళ్లు దాటిన చాలామంది మహిళల్లో కొలెస్ట్రాల్‌ పాళ్లు 200 ఎంజీ/డీఎల్‌కు మించి ఉండటం కూడా ఒక కారణం.
వయసు పైబడిన మహిళల్లో : 65 ఏళ్లు దాటిన చాలామంది మహిళల్లో గుండె ధమనులు పెళుసుబారినట్లు మారిపోవడం వల్ల వచ్చే అధెరోస్కి›్లరోసిస్‌ సమస్య నిశ్శబ్దంగా గుండెజబ్బులకు కారణమవుతోంది.
►ప్రతిఏటా 65 ఏళ్లు పైబడిన 3,72,000 మంది మహిళలు దేశంలో గుండెపోటుకు లోనవుతున్నట్లు ఒక అంచనా. అలాగే 70 ఏళ్లు దాటాక గుండెపోటు వచ్చిన వాళ్లలో పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. గుండెపోటు వచ్చిన కొన్ని వారాల వ్యవధిలోనే గుండెపోటు వారిని కబళిస్తోంది.

మహిళల్లో గుండెజబ్బులు.. కొన్ని ఆందోళనకరమైన అంశాలు
►మొదటిసారి హార్ట్‌ఎటాక్‌ వచ్చిన మహిళలోఓ్ల దాదాపు 23 శాతం మంది ఏడాదికే మళ్లీ హార్ట్‌ఎటాక్‌తో చనిపోతున్నారు.
►మొదటిసారి హార్ట్‌ఎటాక్‌ వచ్చిన మహిళల్లోని దాదాపు 35 శాతం మందిలో మళ్లీ ఆరేళ్లలో రెండోసారి హార్ట్‌ ఎటాక్‌ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
►మొదటిసారి హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన మహిళల్లోని సగం మంది ఆరేళ్ల వ్యవధిలోనే మళ్లీ  హార్ట్‌ఫెయిల్యూర్స్‌తో ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు.
►సాధారణంగా మన పురుషాధిక్య సమాజంలో ఇంటి యజమాని పురుషుడే కావడం, మహిళ జీవనోపాధి లేకపోవడం (బ్రెడ్‌ విన్నింగ్‌ మెంబర్‌ కాకపోవడం)తో వివక్ష కారణంగా చికిత్స తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది.

పురుషుల గుండెపోట్లలో... ఒకింత వయసు పెరిగిన పురుషుల్లో సాధారణంగా గుండెకు రక్తాన్ని చేరవేసే కరొనరీ  రక్తనాళాలు మృదుత్వం కోల్పోయి పెళుసుబారడం, సన్నబారడం (అథెరోస్కి›్లరోసిస్‌), రక్తనాళాల్లో కొవ్వు చేరి, రక్తప్రవాహానికి అడ్డుపడటం వల్ల గుండెపోటు వస్తోంది. ఇటీవల యువతలోనూ ఇవి కనిపిస్తున్నాయి. యువతలో ఒకటి రెండు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడితే వయోవృద్ధుల్లో రెండు నుంచి మూడు ప్రధాన నాళాల్లో అడ్డంకులు రావడం కనిపిస్తుంటుంది.

►రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెకు రక్తం సరిగా అందని కండిషన్‌ను ‘కరొనరీ ఆర్టరీ డిసీజ్‌ (సీఏడీ) అంటారు. గుండెపోటుకు ఇది ప్రధాన కారణం. కొన్ని అధ్యయనాల ద్వారా... చిన్నప్పుడు కరొనరీ ధమనుల్లో తేడాలు (అబ్‌నార్మాలిటీస్‌) ఉన్నవారిలో 4% మందికి, ఇంకెక్కడో గడ్డకట్టిన రక్తపుముద్ద (క్లాట్‌) ప్రవాహంలో కొట్టుకుపోతూ కరొనరీ ధమనుల్లోకి చేరడంతో 5% మందిలోనూ... రక్తం గడ్డకట్టే వ్యవస్థలో లోపాల వల్ల ఇంకో 5% మందిలో చిన్న వయసులోనే గుండెపోటు వస్తోందని తేలింది.

►కరొనరీ ధమనుల ఇన్‌ఫ్లమేషన్, ఛాతీలోని గడ్డలకు రేడియేషన్‌ థెరపీ తీసుకోవడం, ఛాతీలో బలమైన గాయాలు కావడం, మాదకద్రవ్యాలు తీసుకోవడం వంటి అంశాలతో ఆరు శాతం మంది యువత చాలా చిన్నవయసులోనే గుండెపోటుకు గురికావడం జరుగుతోంది.

►యాభై ఏళ్లు పైబడిన వారిలో వాల్వ్‌ సమస్యల్లో ముఖ్యంగా మైట్రల్‌ వాల్వ్, అయోర్టిక్‌ వాల్వ్‌ సమస్యల్లో భాగంగా లీక్‌ కావడం, సన్నబడటం జరగవచ్చు. ఇలాంటి కొందరిలో సర్జరీ లేకుండా ట్రాన్స్‌కెథటర్‌ చికిత్స (రిపేర్‌ లేదా రీప్లేస్‌మెంట్‌) ద్వారా లీకేజీని సరిచేయడం సాధ్యం.

పురుషులు / మహిళల్లో గుండెపోటు లక్షణాలు
గుండెజబ్బుల విషయంలో అందరికీ తెలిసిన లక్షణం ఛాతీలో నొప్పి మాత్రమే. గుండెపోటు వచ్చినప్పుడు గుండెపై ఒత్తినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చి అది మెడ లేదా భుజం లేదా మెడవైపునకు పాకుతున్నట్లుగా వెళ్తుంది. చెమటలూ పడతాయి. ఊపిరితీసుకోవడమూ కష్టమవుతుంది. ఈ లక్షణాలన్నీ పురుషుల్లో చాలా సాధారణం. మహిళల్లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే 50 శాతం మంది మహిళల్లో మాత్రం ఇవి పురుషులతో పోలిస్తే కాస్త వేరుగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే... బాగా అలసటగా/నీరసంగా ఉన్నట్లుగా ఉండటం (ఫెటీగ్‌), ఊపిరి ఆడకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కానట్లుగా ఉండటం, పొట్ట పైభాగంలో ఇబ్బంది, దవడలో నొప్పి, గొంతులో నొప్పి, భుజంలో నొప్పి వంటి సాధారణ లక్షణాలకు భిన్నమైనవి కనిపించవచ్చు. 

నివారణకు సులువైన మార్గాలు...
►అత్యున్నత వైద్య సంస్థలలో జరిగిన అధ్యయనాలలో నమ్మకంగా తెలిసిన ఫలితాలివి. పైగా ఆచరించడం చాలా తేలిక. ఇష్టంగా, సంతోషంగా అనుసరించవచ్చు. మొక్కజొన్నల్లోని క్రోమియమ్‌ గుండెజబ్బులను తగ్గిస్తుంది. స్వీట్‌ కార్న్‌లోని క్రోమియమ్‌ ఎంత ఎక్కువైతే గుండెజబ్బు అవకాశాలు అంత తగ్గుతాయి. ఈ విషయాన్ని అమెరికా లోని హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలుసుకున్నారు.

►వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఓవర్‌కోట్‌ ధరించండి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు దానికి అనుగుణంగా శరీరాన్ని వెచ్చబరచడానికి రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది. అప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వాతావరణంలో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత తగ్గుదల హార్ట్‌ఎటాక్‌ వచ్చే అవకాశాలను రెండు శాతం పెంచుతుందని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ సంస్థ ఒక అధ్యయనంలో కనుగొన్నది.

►మీకు కీవీ ఫ్రూట్స్‌ అందుబాటులో ఉంటే తరచూ తినండి. కీవీ ఫ్రూట్స్‌ రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ పాళ్లను సమర్థంగా 15 శాతం తగ్గించగలదు. ఒక మందులా రక్తాన్ని పలచబార్చేందుకు ఆస్పిరిన్‌ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో... మందు కాకపోయినా కీవీ పండు కూడా అలాంటి ఫలితాలను ఇస్తుందని ఓస్లో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. (ఇప్పుడు భారత్‌లోని చాలా మార్కెట్స్‌లో కీవీ పండ్లు లభ్యమవుతున్నాయి).

►ఎముకలు ఆరోగ్యంగా ఉన్నవారిలో గుండె కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే... రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్న 60 శాతం మంది గుండెపోటుకు గురవుతుంటారు. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోడానికి క్యాల్షియమ్‌ పుష్కలంగా తీసుకోవడం అవసరమని జర్నల్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ పేర్కొంది. క్యాల్షియమ్‌ కోసం రోజూ కనీసం 200 ఎం.ఎల్‌. పాలు తాగడం ఒక తేలికైన మార్గం.

►ప్రతిరోజూ 60 ఎం.ఎల్‌. దానిమ్మ జ్యూస్‌ తాగేవారికి సిస్టోలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ తగ్గి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రతిరోజూ దానిమ్మ జ్యూస్‌ తాగేవారిలో ఒక ఏడాది తర్వాత రక్తనాళాల్లో అడ్డంకులు చాలావరకు తగ్గుతాయని ఇజ్రాయిల్‌లోని రామ్‌బమ్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

►రోజూ మనం మూడు పూటల్లో తీసుకునే ఆహార పరిమాణాన్నే ఆరుపూటలుగా  విభజించుకొని తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ గణనీయంగా తగ్గడానికి దోహదపడుతుందని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ చెబుతోంది.

►మీ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినడం మంచిదే. ఎందుకంటే... మన వైటమిన్‌ సప్లిమెంట్లను చల్లబరచి తినడం వల్ల దానిలోని ప్రభావం దీర్ఘకాలికమవు తుందట. అందువల్ల గుండెజబ్బులు తగ్గుతాయని యూఎస్‌కు చెందిన ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు.
ప్రతిరోజూ రెండుపూటలా బ్రష్‌ చేసుకోవడం వల్ల నోటిలో  బ్యాక్టీరియా 70 శాతం తగ్గుతుంది. దాంతో ఇన్‌ఫ్లమేషన్‌ కలిగించే బ్యాక్టీరియా వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కూడా అదేమేరకు తగ్గుతాయని లండన్‌ యూనివర్సిటీ కాలేజీ పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది.

►చికెన్‌ సలామీ (మన భాషలో చెప్పాలంటే చికెన్‌ షేర్వాతో గ్రేవీ ఎక్కువగా ఉండే కోడి కూర)లో కాస్తంత నిమ్మకాయ పిండుకుని తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు వెల్లడించారు. అంటే మాంసాహార ప్రియులు  రెడ్‌మీట్, వేట మాంసం కంటే తేలిగ్గా ఉండే చికెన్‌ను... అందునా షేర్వాతో ఉండేలా తినడం వల్ల మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు. (వాస్తవానికి చికెన్‌ సలామీ రెసిపీని అమెరికన్స్‌ మష్రూమ్స్, ఉల్లి పుష్కలంగా వేసి గ్రేవీగా అయ్యేలా చేసుకుంటారు.)

►అప్పుడప్పుడూ తీసుకునే డార్క్‌ చాక్లెట్స్‌ గుండెజబ్బుల రిస్క్‌ తగ్గించుకునే ఒక రుచికరమైన మార్గం. చాక్లెట్‌లోని కోకోలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం రక్తనాళాలు గరుకుగా మారి రక్తం గడ్డగట్టే గుణాన్ని (అథెరోస్కీ›్లరోసిస్‌ను) గణనీయంగా తగ్గిస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ బార్సెలోనా పరిశోధకులు చెబుతున్నారు.

►కొవ్వులేని పాలతో తోడేసిన పెరుగు తినడం మంచిది. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే వెనిల్లా ఫ్లేవర్‌తో లభ్యమయ్యే యోగర్ట్‌ తింటే... అందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ గుండెజబ్బులను నివారిస్తాయని యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మస్యూటికల్‌ సైన్సెస్‌ పేర్కొంటోంది.
ప్రతిరోజూ మధ్యాహ్నం పూట కనీసం అరగంట పడుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే రిస్క్‌ 30 శాతం తగ్గుతుందన్నది జర్నల్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ నివేదిక. దీర్ఘకాలంగా నిద్రను అణచుకుంటూ ఉంటే, గుండె స్పందనల్లో లయతప్పే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితినే ప్రీమెచ్యూర్‌ వెంట్రిక్యులర్‌ కాంట్రాక్షన్స్‌ (పీవీసీఎస్‌) అంటారు.

►ఒత్తిడిని, దాంతో కలిగే రక్తపోటును తగ్గించుకోవడం అన్నది గుండెజబ్బుల నివారణలో చాలా ప్రధానమైనదన్న విషయం తెలిసిందే. రోజూ కేవలం ఒక గ్లాసు పాలు తాగడం వల్ల కూడా ఒత్తిడి కారణంగా కలిగే హైపర్‌టెన్షన్‌ తగ్గుతుందని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ నివేదికలు చెబుతున్నాయి.

►ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు ఆరుబయట నడవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 26 శాతం తగ్గుడమే గాక... దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఒక సమర్థమైన మార్గమని జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చెబుతున్నారు.

►యోగా, ధాన్యం వంటి ప్రక్రియల ద్వారా ఒత్తిడిని అధిగమించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటాయి. దాంతో గుండెపై ఒత్తిడి తగ్గి గుండెజబ్బుల నుంచి నివారణ దొరుకుతుంది. అంతేకాదు... గుండెజబ్బులు ఉన్నవారు సైతం త్వరగా కోలుకోవడం జరుగుతుంది.
డా. సూర్యప్రకాష్‌ గుల్ల
సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ అండ్‌ మెడికల్‌ డైరెక్టర్, కేర్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement