రాజుల్లో నెం. 1 ఎవరు? ఇంకెవరు రాజారాముడే. అందుకే లంకాధిపు వైరి వంటి రాజు లేనేలేడన్నారు. మరి మహిళామణుల్లో నెం. 1 ఎవరు? మరింకెవరు... పంకజముఖి సీతే! రుచి ‘సింహాసనం’పై కూర్చోబెట్టగల కాయగూర ఏదంటూ అప్పట్లోఓ సార్వత్రిక ఎన్నిక జరిగిందట. దాంట్లో మన వంకాయదే ఏకగ్రీవ ఎంపికట. అందుకే అది కాస్తా నెం. ‘వన్’ కాయ అయ్యింది. మనం తినడానికి వీలుగా ‘వన్’టకమై వచ్చింది. రుచుల ‘బ్రింజాల’ మాయాజాలంలో పడదాం రండి.
బేబీ బ్రింజాల్ స్టఫ్డ్ కర్రీ
కావలసినవి
చిన్న వంకాయలు – పావు కేజీ; ఆవాలు – అర టీ స్పూన్; కొత్తిమీర – కొద్దిగా; నూనె – 3 టేబుల్ స్పూన్లు
స్టఫింగ్ కోసం
జీడి పప్పులు – 5; వేయించిన నువ్వులు – ఒక టేబుల్ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూన్; టొమాటో – 1 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్; వేయించిన గసగసాలు – పావు టీ స్పూన్; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూన్; ఉప్పు – తగినంత; వేయించిన ఎండు మిర్చి – 10
తయారీ
∙ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి మధ్యకి నాలుగు భాగాలుగా కట్ చేసి (గుత్తివంకాయ కూరకు తరిగే మాదిరిగా) ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి.
స్టఫింగ్ తయారీ
∙స్టఫింగ్ కోసం చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. వంకాయల మధ్యలో తగినంత మిశ్రమం ఉంచాలి. ఇలా అన్ని వంకాయలలో స్టఫ్ చేసి పక్కన ఉంచాలి. స్టౌమీద బాణలిలో నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఇందులో స్టఫ్ చేసిన వంకాయలను వేసి ఒకసారి కలిపి, కొద్దిసేపు మూత ఉంచాలి. వంకాయలు కొద్దిగా మెత్తబడిన తరవాత మూత తీసేసి, గరిటెతో జాగ్రత్తగా కలపాలి. వంకాయలు బాగా ఉడికి, మెత్తబడ్డాక, కొత్తిమీర చల్లి దింపేయాలి. వేడి వేడి అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.
బ్రింజాల్ గ్రిల్డ్ పార్సెల్స్
కావలసినవి:
పెద్ద వంకాయలు – 2; మోజరిల్లా చీజ్ – 50 గ్రా.; టొమాటోలు – 4; బచ్చలి ఆకులు – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – కొద్దిగా;
సాస్ కోసం
ఆలివ్ ఆయిల్ – 4 టేబుల్ స్పూన్లు; వెనిగర్ – ఒక టీ స్పూన్; ఎండబెట్టిన టొమాటో పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూన్;
తయారీ
వంకాయలను శుభ్రంగా కడిగి తొడిమలు తీసేయాలి. పల్చగా, పొడవుగా, నిలువుగా తరగాలి. (ముక్కలు నల్లబడకుండా ఉప్పు నీళ్లలోకి తరగాలి)ఒక పెద్ద పాత్రలో నీళ్లు, తగినంత ఉప్పు వేసి స్టౌమీద ఉంచి మరిగించాలి. తరిగి ఉంచుకున్న వంకాయ ముక్కలను అందులో వేసి, రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. నీళ్లను పూర్తిగా ఒంపేసి, ముక్కలను పొడి వస్త్రంలో వేసి తడిపోయేవరకు ఆరబెట్టాలి. రెండు వంకాయ ముక్కలను తీసుకుని ఒకదానికి ఒకటి క్రాస్‌గా ఒక ప్లేట్‌లో అమర్చాలి. వాటి మధ్యలో టొమాటో చక్రాలు ఉంచి, వాటి మీద ఉప్పు, మిరియాల పొడి, బచ్చలి ఆకులు, కొద్దిగా మోజరిల్లా చీజ్ వేసి, ఆ పైన మళ్లీ బచ్చలి ఆకులు, టొమాటో ముక్క ఉంచాలి. రెండు చివరలను వంకాయతో మడతలు వేసి బ్రింజాల్ పార్సెల్స్‌ను మూసేయాలి. వీటిని ఫ్రిజ్‌లో సుమారు అరగంటసేపు ఉంచాలి.
సాస్ తయారీ
ఒక పాత్రలో ఆలివ్ ఆయిల్, వెనిగర్, టొమాటో పేస్టు, నిమ్మరసం వేసి బాగా కలిపాక, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
బ్రింజాల్ పార్సెల్స్‌ను ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, వాటి నిండా సాస్ వేయాలి. పెనం మీద చీజ్ వేసి కరిగాక, ఈ పార్సెల్స్‌ను ఉంచి, రెండు వైపులా కాల్చి తీసేయాలి.
(గ్రిల్ చేసుకునేవారు పది నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి)
హైదరాబాదీ దమ్ కీ బైగన్
కావలసినవి
నూనె – 4 టేబుల్ స్పూన్లు; వంకాయలు – అర కేజీ; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; నూనె – ఒక టేబుల్ స్పూన్ (మసాలా వేయించడానికి)
మసాలా పేస్ట్ కోసం
కాశ్మీరీ మిర్చి – 8; జీలకర్ర – ఒక టీ స్పూన్; మిరియాలు – ఒక టీ స్పూన్; ఏలకులు – 3; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; బిరియానీ ఆకు – ఒక; వెనిగర్ – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ – 1 (పెద్దది) + 2 (మీడియం సైజువి) ; ఉల్లి తరుగు – ముప్పావు కప్పు; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6
గార్నిషింగ్ కోసం: కొత్తిమీర తరుగు – పావు కప్పు
తయారీ
∙వంకాయలను చిన్న సైజు ముక్కలుగా తరగాలి. (చిన్న వంకాయలను వాడుతుంటే గుత్తి వంకాయ మాదిరిగా తరగాలి). ∙స్టౌ మీద బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, వంకాయ ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించి, తీసి పక్కన ఉంచాలి. ∙మిక్సీలో ముప్పావు కప్పు ఉల్లి తరుగు, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, కాశ్మీరీ ఎండు మిర్చి, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఏలకులు, బిరియానీ ఆకు వేసి మెత్తగా చేయాలి. ఆ తరవాత వెనిగర్, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు జతచేసి మెత్తగా పేస్ట్‌లా చే సి బయటకు తీయాలి. ∙స్టౌమీద బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక, మసాలా ముద్ద వేసి వేయించాలి. పసుపు జత చేసి మసాలా మిశ్రమాన్ని సుమారు పది నిమిషాల పాటు వేయించాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక కప్పుడు నీళ్లు పోసి బాగా కలిపాక, తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను జత చేసి, మసాలా ముద్ద పట్టేలా మృదువుగా కలిపి, మూత పెట్టి, ఏడెనిమిది నిమిషాలు ఉడికించి దింపేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. వేడి వేyì అన్నంలోకి రుచిగా ఉంటుంది.
వంకాయ కాల్చిన పచ్చడి
కావలసినవి
గుండ్రంగా, పెద్దగా ఉండే వంకాయ వంకాయ – 1; చింతపండు – 50 గ్రా. (తగినన్ని నీళ్లలో నానబెట్టి, చిక్కగా గుజ్జు తీసుకోవాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్; బెల్లం తురుము – ఒక టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – 2 టేబుల్ స్పూన్లు
పోపు కోసం
ఎండు మిర్చి – 6; ఆవాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూన్; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టేబుల్ స్పూన్
తయారీ
∙వంకాయను శుభ్రంగా కడిగి, తడి తుడిచి, వంకాయకు నూనె పూసి, స్టౌమీద ఉంచి కాల్చాలి. కాయ మొత్తం కాలి, మెత్తగా అయిన తరవాత దింపేయాలి. చల్లారాక తొక్క తీసి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకుని చేతితో మెత్తగా చేయాలి. ఉప్పు, పసుపు జత చేసి బాగా కలపాలి. స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాక, వంకాయ గుజ్జులో వేసి కలపాలి. చింతపండు రసం, బెల్లం తురుము జత చేసి చేతితో బాగా కలపాలి. టొమాటో తరుగు వేసి మరోమారు కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి మంచిది.
వంకాయ మసాలా బోండా
కావలసినవి
చిన్న వంకాయలు – పావు కేజీ; సెనగపిండి – పావు కేజీ; బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూన్; ధనియాల పొడి – ఒక టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూను; కారం – ఒక టీ స్పూన్; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; నువ్వుల పొడి – ఒక టేబుల్ స్పూన్; పల్లీల పొడి – ఒక టేబుల్ స్పూన్; వంట సోడా – చిటికెడు; కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్; వాము – అర టీ స్పూన్; ఉల్లి తరుగు – ఒక కప్పు; పల్చగా తీసిన చింతపండు పులుసు – 2 కప్పులు
తయారీ
∙వంకాయలను శుభ్రంగా కడిగి, గుత్తి వంకాయ మాదిరిగా మధ్యలోకి నాలుగు చెక్కలుగా చీల్చాలి. అలా అన్ని వంకాయలను తరిగి పక్కన ఉంచాలి. స్టౌ మీద గిన్నెలో ఉప్పు, చింతపండు పులుసు పోసి, అందులో తరిగిన వంకాయలను వేసి ఉడికించాలి. పక్కన స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, తీసేయాలి. అందులో కొబ్బరి తురుము, ధనియాల పొడి, గరం మసాలా, మిరప కారం, కొబ్బరి తురుము, నువ్వుల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చింతపండు రసంలో ఉడికిన వంకాయలను బయటకు తీసి చల్లారనివ్వాలి. కొబ్బరి తురుము మిశ్రమాన్ని వంకాయలలో స్టఫ్ చేయాలి. ఒక గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, వాము, వంట సోడా, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండి మాదిరిగా కలపాలి. స్టౌమీద బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. స్టఫ్ చేసిన వంకాయలను సెనగపిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో బోండాలు వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. నూనెలో వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకుతో గార్నిష్ చేసి వేడివేడిగా అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment