తండ్రులు సో హ్యాపీ !
పెళ్లయ్యి పిల్లలు ఉన్న మగాళ్లు బాగా హ్యాపీగా ఉంటున్నారట. ఇది కొన్నివేల మందిపై జరిపిన సర్వే అనంతరం వెలువడిన ఫలితం. ఊరికే ఆషామాషీగా చెప్పిందేం కాదు.పెళ్లి అయితే మగాడు స్వేచ్ఛ కోల్పోతాడేమో (ఇది సెటైర్‌గా మాత్రమే ప్రచారమని తెలుసు కదా) గాని సంతోషాన్ని పొందుతాడని నిరూపితమైంది.
మీకు పెళ్లయ్యిందా? ఓకే! ఓ సారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి.. అరె... మీకు పిల్లలున్నారా? ‘‘ఫేస్ చూసి చెప్పడానికి నువ్వు ఏమైనా జాతకాలు చెబుతావా?’’ అని అడగబోతున్నారా... అసలు విషయం వేరే ఉంది. పెళ్లయ్యి పిల్లలు ఉన్న మగాళ్లు బాగా హ్యాపీగా ఉంటున్నారట. ఇది కొన్నివేల మందిపై జరిపిన సర్వే అనంతరం వెలువడిన ఫలితం.ఊరికే ఆషామాషీగా చెప్పిందేం కాదు. ఆస్ట్రేలియన్ యూనిటీ అనే సంస్థ వెల్‌బీయింగ్ ఇండెక్స్‌పైన ఓ పెద్ద అధ్యయనం చేసింది. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన మెల్‌బోర్న్‌లో ఉన్న డీకిన్ విశ్వవిద్యాయలంలో సెంటర్ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విభాగంతో కలిసి నిర్వహించిన ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
ఈ పరిశీలనలో పురుషులు (పెళ్లి అయిన వారు, కాని వారు), స్త్రీలు (పెళ్లయిన వారు, కాని వారు) ఇద్దరూ పాల్గొన్నారు. వీరందరిపై జరిపిన అధ్యయనం/సర్వేలో ఎవరెంత హ్యాపీగా ఉన్నారు అని పరిశీలిస్తే పెళ్లయ్యి పిల్లలున్న అంటే తండ్రులైన వారు మిగతా వారికంటే సంతోషంగా ఉన్నట్టు తేలింది.ఇందులోనూ ఇద్దరు పిల్లలున్న వారికంటే ముగ్గురు లేదా నలుగురున్న పిల్లలు ఎక్కువగా ఆనందంగా ఉండటం విశేషం. అంటే పెళ్లి అయితే మగాడు స్వేచ్ఛ కోల్పోతాడేమో (ఇది సెటైర్‌గా మాత్రమే ప్రచారమని తెలుసు కదా) గాని సంతోషాన్ని పొందుతాడని నిరూపితమైంది.
అయితే, ఇందులోనూ మరో కోణం బయటపడింది. సాధారణంగా మాతృత్వం గురించి చాలా గొప్పగా భావిస్తాం కదా. ఆ లెక్కన మాతృత్వం పొందిన ప్రతి స్త్రీ మిగతా అన్ని వర్గాల కంటే ఎక్కువ ఆనందంగా ఉండాలి. ఇది కొంతవరకు మాత్రమే నిజమేమో అని పరిశీలకులు అనుమానపడుతున్నారు. మాతృత్వం పొందిన తొలినాళ్లలో ఆ ఆనందం చాలా ఎక్కువగా ఉండొచ్చు గాని ఈ సర్వే ప్రకారం పెళ్లి కాని స్త్రీలు, పెళ్లయి పిల్లలున్న స్త్రీల సంతోష స్థాయిల్లో మాత్రం పెద్దగా తేడా లేదు.
పిల్లలున్న స్త్రీలు పిల్లలు లేని వారి కంటే భిన్నమైన అభిప్రాయాలను, సంతోషాలను వెలిబుచ్చలేదంటే దీన్నిబట్టి ఓ విషయం అర్థం చేసుకోవాలి. బయట పురుషుడి గురించి జరుగుతున్నవన్నీ ప్రచారాలే! నిజానికి పెళ్లి ద్వారా పురుషుడు మరింత మంచి జీవనాన్ని (కనీసం ఆనందం విషయంలో) పొందుతాడని భావించొచ్చు అన్నమాట. ఇంకేం... ఈ పెళ్లీ గిళ్లీ జాంతానై, ఆ పెళ్లాం పిల్లల లంపటం వద్దప్పా మాకు అనుకుని భయపడే పురుష పుంగవులు పునరాలోచించుకోవడం మంచిదని దీన్ని బట్టి అర్థమవుతోంది కదా!