నేలతల్లి ముద్దుబిడ్డల శిగలో పద్మశ్రీలు! | Female Farmers for Padma Shri Awards | Sakshi
Sakshi News home page

నేలతల్లి ముద్దుబిడ్డల శిగలో పద్మశ్రీలు!

Published Tue, Jan 29 2019 6:07 AM | Last Updated on Tue, Jan 29 2019 6:07 AM

Female Farmers for Padma Shri Awards - Sakshi

పద్మశ్రీకి ఎంపికైన రాజ్‌కుమార్‌ దేవి, పద్మశ్రీకి ఎంపికైన కమలా పూజారి

వ్యవసాయానికి మహిళల శ్రమే పట్టుగొమ్మ. అయినా, ఈ రంగం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకోవడం అరుదనే చెప్పాలి. ఈ ఏడాది వ్యవసాయ రంగం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన పది మందిలో ఇద్దరు మహిళా రైతులు ఉండటం విశేషం. ఒడిశాకు చెందిన గిరిజన సేంద్రియ మహిళా రైతు కమలా పూజారి ఒకరైతే, బిహార్‌కు చెందిన మహిళా రైతు రాజ్‌కుమార్‌ దేవి మరొకరు! విశేషమేమిటంటే.. కొద్ది నెలల క్రితమే ఈ ఇద్దరి గొప్పదనం గురించి ‘సాక్షి’ ప్రచురించింది. వీరిని పద్మశ్రీ పురస్కారం వెదుక్కుంటూ  వచ్చిన శుభసందర్భంలో ఈ అద్భుత మహిళా రైతులకు జేజేలు పలుకుదాం..

రైతు పెద్దమ్మ రాజ్‌కుమార్‌ దేవి!
బలమైన సంకల్పం ఉంటే రైతు కుటుంబంలోని సాధారణ గృహిణి కూడా ఇతరులకూ వెలుగుబాట చూపగలిగేంత ఎత్తుకు ఎదగగలరనడానికి రాజ్‌కుమార్‌ దేవి జీవితమే నిలువుటద్దం. తాజాగా ఆమె పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. బిహార్‌లోని ముజఫర్‌çపూర్‌ జిల్లాలోని కుగ్రామం ఆనంద్‌పూర్‌ వాస్తవ్యురాలు. వ్యవసాయం గురించి ఏ కాలేజీలోనూ ఆమె చదువుకోలేదు. తన అత్తింటి వారికి ఉన్న ఎకరం పొలంలో 1980లలో ఒక రోజు స్వయంగా పారను చేతబట్టి స్వేదాన్ని చిందించే క్రమంలోనే ఆ నేల స్వభావాన్ని, ఏయే పంటలు సాగు చేస్తే బతుకులు బాగుపడతాయో అధ్యయనం చేశారు.

30 ఏళ్ల క్రితం తొలిసారి ఆమె పొలంలో కాలు మోపే నాటికి వరి, గోధుమ, నాటు పొగాకు తప్ప వేరే పంటలు ఆ ప్రాంతీయులకు తెలియవు. పండించిన నాటు పొగాకును ఊరూరా తిరిగి అమ్మడానికి భర్త బయలుదేరడంతో ఆమె వ్యవసాయంపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. పొగాకు ఒక్కటే పండించడం ఎందుకు? కూరగాయలు, పండ్లు తదితర అనేక పంటలు కలిపి ఎందుకు పండించకూడదని ప్రశ్నించుకుంది. తమ ఎకరం పొలాన్ని మడులుగా విభజించి.. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు.. వేర్వేరు పంటలు సాగు చేయడం ప్రారంభించింది. కొన్నాళ్లు గడిచే సరికి రాజ్‌కుమార్‌ దేవి ఒకటికి నాలుగు పంటలు పండించడంలో ప్రయోజనాలను ఆ ఊళ్లో మహిళా రైతులంతా గమనించారు. ఒకరి వెనుక మరొకరు ఆమెను అనుసరించారు.

వ్యవసాయోత్పత్తులకు విలువను జోడించి పట్టణాలకు పంపడంపై ఆమె దృష్టి పెట్టింది. ఇందుకోసం పదేసి మంది మహిళలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వారు తయారు చేసిన ఉత్పత్తులను సేకరించి పట్టణాలకు తరలించి విక్రయించేందుకు తానే ఒక సంస్థను ప్రారంభించింది. ఇంటిపట్టున ఉండి నెలకు రూ. 3 వేల వరకు మహిళలు సంపాయించుకునే దారి చూపింది. తమ గ్రామంతోపాటు ఇరుగుపొరుగు గ్రామాలకు కూడా సైకిల్‌పైనే వెళ్లి మహిళా రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రాజ్‌కుమార్‌ దేవిని ‘రైతు పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు.


సేంద్రియ సేనాని కమలా పూజారి!
కమలా పూజారి వయసు 67 ఏళ్లు. గిరిజన మహిళా రైతు. ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా పత్రాపుట్‌ గ్రామం ఆమె స్వస్థలం. భుమియ గిరిజన తెగలో పుట్టిన కమలకు దేశీ వరి వంగడాలన్నా, సేంద్రియ వ్యవసాయమన్నా పంచప్రాణాలు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంతో ఆమెకు పేరు ఇప్పుడు దేశమంతటికీ తెలిసింది. అయితే, కొద్ది నెలల క్రితం కూడా ఆమె పేరు ఒడిశాలో మారుమోగింది. అందుకో బలమైన కారణమే ఉంది మరి. ఒడిశా రాష్ట్ర ప్రణాళికా మండలి సభ్యురాలిగా అప్పట్లో కమల నియమితులయ్యారు. అంతేకాదు, ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం మహిళా హాస్టల్‌ భవనానికి కమల పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని చాటుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

కమల నియామక ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరచినప్పటికీ.. ఈ పదవి ఆమెకు అంత అయాచితంగా ఏమీ రాలేదు. సుసంపన్నమైన వ్యవసాయ జీవవైవిధ్యానికి.. ముఖ్యంగా అపురూపమైన దేశీ వరి వంగడాలకు ఒడిశాలోని జేపూర్‌ పెట్టింది పేరు. జేపూర్‌ బ్లాక్‌లోనే ఉంది కమల స్వగ్రామం పత్రాపుట్‌. వేలాది ఏళ్లుగా తమవై విరాజిల్లుతున్న వందలాది దేశీ వరి వంగడాలు అంతరించిపోతుండటం ఆమెను కలవరపరచింది. రసాయనిక వ్యవసాయం పుణ్యమా అని అందుబాటులోకి వచ్చిన కొత్త వంగడాల వల్ల దేశీ వంగడాలు కాలగర్భంలో కలసిపోతుండటం ఆమెకు సుతరామూ నచ్చలేదు.

దేశీ వరి వంగడాలు అతివృష్టిని, కరువు కాటకాలను తట్టుకొని నిలబడి.. ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అంత విలువైన వంగడాల పరిరక్షణ సజావుగా సాగాలంటే సేంద్రియ వ్యవసాయం వ్యాప్తిలోకి తేవాలని కమలా పూజారి దశాబ్దాల క్రితమే గ్రహించారు. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌ నేర్పిన మెలకువలు ఆమె తన లక్ష్యంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు తోడ్పడ్డాయి. లక్ష్య సాధనకు రైతుగా తాను పాటుపడటంతోపాటు తమ గ్రామంలో గడపగడపకు, ఆ ప్రాంతంలోని గ్రామ గ్రామానికీ వెళ్లి ఇదే విషయాన్ని కమల ప్రచారం చేశారు. అవాంతరాలు ఎదురైనా దీక్షతో కదిలారు. ఫలితంగా పత్రాపుట్, ఆ పరిసర గ్రామాల్లో రైతులు రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా నిలిపివేశారు. ఆమె కృషికి గుర్తింపుగా 2004లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా రైతు పురస్కారంతో సత్కరించింది. జోహన్నెస్‌బెర్గ్‌(దక్షిణాఫ్రికా)లో 2002లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలోనూ ఆమె తన గళం వినిపించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement