సబ్ లెఫ్ట్‌నెంట్ శివాంగి
ఈరోజు నేవీ డే. భారత నౌకాదళ దినోత్సవం. ఈ సందర్భంగా సబ్ లెఫ్ట్‌నెంట్ శివాంగి గురించి చెప్పుకోవాలి. నిన్నంతా చెప్పుకున్నాం కదా.. శివాంగి శిక్షణ ముగించుకుని సోమవారం కొచ్చిలో పైలట్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారని, దాంతో భారత నౌకాదళంలో తొలి మహిళా పైలెట్‌గా గుర్తింపు పొందారని! అది నిజమే, ఇప్పుడేమిటంటే.. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఒక ఆసక్తికరమైన సంగతిని వెల్లడించారు. తన పదవయేటే శివాంగి ఆకాశంలో ఎగరాలని అనుకున్నారట. అయితే ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసో, కళ్లకు మాత్రమే అందుతూ గగన విహారం చేస్తుంటే విమానాలను చూసో కాదు! శివాంగి స్వస్థలం బిహార్ లోని ముజఫర్‌పూర్.
ఆమె చిన్నతనంలో అక్కడికి తరచు రాజకీయ నాయకులు హెలికాప్టర్‌లో వచ్చి ఆ చుట్టుపక్కల బహిరంగ సభల కోసం కిందికి దిగేవారు. తండ్రితో పాటు ఆ సభలకు వెళ్లినప్పుడు పెద్దవాళ్లంతా నాయకుల ప్రసంగాలపై ధ్యాస పెడితే, శివాంగి మాత్రం నాయకులు ఎగిరొచ్చిన హెలికాప్టర్‌ను చూస్తూ కలలు కనేవారట. ఆమె ఆశల కలలకు ఆమె తండ్రి రెక్కలు తొడిగారు. ఆ విధంగా శివాంగి స్వప్నమూ సాకారమయింది, తొలిసారి ఒక మహిళ పైలట్‌గా చేరడంతో భారత నౌకాదళానికి గౌరవమూ చేకూరింది. ఏమైనా ఈసారి నేవీడే శివాంగి వల్ల స్పెషల్ అయింది!
Comments
Please login to add a commentAdd a comment