ది క్వీన్‌ | First woman to swimming in Vembanad | Sakshi
Sakshi News home page

ది క్వీన్‌

Published Tue, Sep 11 2018 12:16 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

First woman to  swimming in  Vembanad - Sakshi

షయిఖా

భారతదేశంలోని అతిపొడవైన సరస్సు, కేరళలో అతి పెద్దదైన సరస్సు – ‘వెంబనాడ్‌’ను ఈదిన తొలి మహిళగా మాలు వార్తలకెక్కింది.  ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అమ్మాయి విజేతగా నిలవడమే ఈ కథ.

చిన్నప్పుడు ఆ అమ్మాయిని వాళ్ల నాన్న ‘షయిఖా’ అని పిలిచేవాడు. అంటే అరబిక్‌లో యువరాణి అని అర్థం. అమ్మ ‘మాలు’ అని పిలుచుకునేది ముద్దుగా. బాల్యం అంటే ఆ పిల్లకు ఉన్న ఇష్టమైన జ్ఞాపకం ఆ పేరే... ‘మాలు షయిఖా’!ఆ తర్వాత ఆ జంట పదం విడిపోయింది. ఎందుకంటే అమ్మానాన్న భార్యాభర్తలుగా విడిపోయి మాలు షయిఖాను వదిలించుకుని వేరు వేరు పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడ్డారు. ఫలితంగా ‘మాలు షయిఖా’ జీవితం అనామకంగా గడిచిపోవాల్సింది. కాని ఆ అమ్మాయి ఇవాళ దేశానికి తెలిసింది. తొమ్మిది కిలోమీటర్ల వెడల్పు‘వెంబనాడ్‌’ సరస్సు చుట్టూ ఈది వెంబనాడ్‌ను చుట్టిన మొదటి మహిళగా వార్తల్లో నిలిచింది.  

ఆత్మహత్య చేసుకోబోయి...
మాలూకి ఎనిమిదేళ్లు వచ్చేదాకా ఆమె బాల్యం ఆనందంగానే గడిచింది. వాళ్ల నాన్న అన్నట్లు ఆ పిల్ల ఆ ఇంటికి యువరాణిలాగే ఉంది. కాని ఆ వయసులోనే ఆమె అమ్మా నాన్న విడిపోయారు. వెంటనే నాన్న ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు.  అప్పటి నుంచి తన పదహారవ యేట వరకూ తల్లితోనే ఉంది మాలూ. తర్వాత తల్లీ తనను వదిలేసి మరో పెళ్లితో ఇంకో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంది. అప్పటికి మాలూ బెంగుళూరులో పదకొండో తరగతి చదువుతోంది. తల్లి పెళ్లితో మాలూ బాధ్యతను ఆమె అమ్మమ్మ వాళ్లు తీసుకున్నారు. అంతే వేగంగా ఆ భారాన్ని వదిలించుకోవాలనుకున్నారు. సొంతూరైన అలువా (కేరళ)కి తీసుకెళ్లి ఆ పెళ్లికి ఏర్పాట్లు చేశారు. బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం చేయాలనేది మాలూ కల. దాంతో అమ్మ వాళ్ల బంధువులు చేస్తున్న తతంగానికి బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ రాత్రే తమ ఊరి పొలిమేరల్లోని నది ఒడ్డుకు వెళ్లింది. చుట్టూ చూసింది.. ఆ  చీకట్లో ఎవరూ లేరని నిర్థారించుకొని నదిలోకి దూకబోయింది. ‘‘ఆగు’’ అంటూ వెనక నుంచి భుజం పట్టుకొని లాగాడు ఓ వ్యక్తి. తిరిగి చూసింది. ఎవరో అపరిచితుడు. ‘‘నీకే సమస్యలున్నాయో నాకు తెలీదు.కాని వాటికి పరిష్కారం ఆత్మహత్య మాత్రం కాదు. ఈ థైర్యమేదో బతుకులో చూపించు. పది మందికి సహాయపడు’’అని చెప్పాడు.  ఆ మాటలకు వెక్కి వెక్కి ఏడ్చింది. భుజం తట్టి వెళ్లిపోయాడు అతను. ఏదో శక్తి వచ్చినట్టు ఫీలైంది మాలూ. అతను చెప్పినట్టుగా బతికి చూపించాలని నిర్ణయించుకుంది. 

ఎవరికీ భారం కాకుండా...
అమ్మమ్మ వాళ్ల మీద ఆధారపడకుండా బతకడమెలాగో ఆలోచించసాగింది. చిన్నప్పటి నుంచీ తనకు డ్రైవింగ్‌ అంటే ఇష్టం. ఆ ఇంట్రెస్ట్‌తోనే డ్రైవింగ్‌ నేర్చుకుంది. అది చాలు కాస్తంత ఆర్థిక వెసులుబాటుకు అని ముందడుగేసింది. అలువాలోని క్వీన్స్‌ మదర్స్‌ కాలేజ్‌లో బీకాంలో చేరింది.  పార్ట్‌టైమ్‌ డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా కొలువు చూసుకుంది. అమ్మమ్మ వాళ్లింట్లోంచి విమెన్స్‌ హాస్టల్‌కు మారింది. హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుంది. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా కూడా పని చేయడం మొదలుపెట్టింది. తన చదువుకు సరిపడే సంపాదనకు చేరుకుంది. 

టర్నింగ్‌ పాయింట్‌...
జీవితం సాగిపోతోంది.. కాని మాలూ మనసులో ఓ కోరిక.. స్విమ్మింగ్‌ నేర్చుకోవాలని. ఏ నీళ్లలో మునిగి లైఫ్‌కు ఎండ్‌ పలకాలనుకుందో ఆ నీళ్లనే చాలెంజ్‌ చేయాలని ఆశ. వాళ్లుండే ప్రాంతంలో స్విమ్మింగ్‌ కోచ్‌ అయిన సాజీ వలస్సేర్రీని కలిసింది. పేరెంట్స్‌ కూడా వస్తేనే చేర్చుకుంటా అన్నాడు. అప్పుడు తన గురించి చెప్పింది. మారుమాట్లాడకుండా మాలూని స్టూడెంట్‌గా తీసుకున్నాడు. పధ్నాలుగు రోజులయ్యేటప్పటికీ మాలూలో ఏదో కాన్ఫిడెన్స్‌. పదిహేనో రోజు నాలున్నర గంటల్లో తమ ఊళ్లోని నదిని ఈదేసింది.  ‘‘సర్‌.. ఇప్పుడు నేను ఏ రివర్‌నైనా అవలీలగా ఈదేయగలను’’అంది పెరిగిన ఆత్మవిశ్వాసంతో. ఆ మాటను సాజీ తేలిగ్గా తీసుకోలేదు. ఆమె ఆత్మవిశ్వాసానికి పరీక్ష పెట్టాడు. వెంబనాడ్‌ ఈదమని చెప్పి. ‘‘అయ్యో... మాట వరసకు అన్న మాటలను సీరియస్‌గా తీసుకుంటారేంటి సర్‌?’’ అని వెనకడుగు వేయబోయింది మాలూ. ‘‘చేతల్లో ఉంటేనే మాట్లాడాలి’’ మాట్లాడాలి అన్నాడు సాజీ. ఈసారి తను సీరియస్‌గా తీసుకుంది. చాలెంజ్‌కు ఓకే అంది. సాజీకి తెలుసు.. మాలూ ఈజీగా ఈదగలదని. ఆమె టాలెంట్‌ను ప్రపంచానికి చెప్పడానికే మాలూని ఆ చాలెంజ్‌కు సిద్ధం చేశాడు. ఆ రోజు రానే వచ్చింది. వెంబనాడ్‌ చుట్టూ తొమ్మిది కిలోమీటలర్లను ఈది  వెంబనాడ్‌ను చుట్టొచ్చిన తొలి మహిళగా రికార్డ్‌ సృష్టించింది. పడ్డ కష్టాలను కసిగా వెనక్కి నెట్టి బతుకు మీదున్న ఆసక్తిని చాటుకుంది.

ఐఏఎస్‌ కావాలని...
మాలూ గెలుపు ఇంకెదరికో కూడా స్ఫూర్తి అయింది. ఆమె గురించి వార్తా పత్రికల్లో చూసి నటుడు  మమ్మూట్టీ అబ్బురపడ్డాడు. ‘‘క్వీన్‌’’ అంటూ ప్రశంసించడమే కాక తర్వాత చదువు కోసం లక్షరూపాయల బహుమానాన్ని ఇచ్చాడు. ఐఏఎస్‌ కావాలని మాలూ ఆశయం. కోచింగ్‌లో చేరింది. సివిల్స్‌నూ సవాలుగా తీసుకుంది. సాధించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ‘‘మా నాన్న నన్ను ప్రిన్సెస్‌ అని పిలిచేవాడు. Mమమ్మూట్టి సర్‌ నన్ను క్వీన్‌ అంటే మా నాన్నే గుర్తొచ్చాడు. ఆ క్షణానికి మమ్మూట్టీ సర్‌లోనే మా నాన్నను చూసుకున్నాను. నన్ను ఇప్పుడు ఏ హార్డిల్స్‌ ఆపలేవు. వెంబనాడ్‌ అలలు అంతటి శక్తినిచ్చాయి’’ అంటుంది మాలూ షయిఖా.. ది క్వీన్‌!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement