చుట్టరికాలు | Forget the World History | Sakshi
Sakshi News home page

చుట్టరికాలు

Published Thu, Jan 29 2015 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

చుట్టరికాలు

చుట్టరికాలు

టూకీగా ప్రపంచ చరిత్ర- 18
 
జావా ద్వీపంలో డుబోయ్‌కి ఒక పుర్రె పైభాగం, ఒక తునక దవడఎముక, ఒక తొడ ఎముక లభించాయి. పుర్రె పైభాగం ఆధారంగా ఆ ఎముకల సొంతదారుకు మెదడు పరిమాణం వాలిడికి ఉండేకంటే పెద్దదనీ, తొడఎముక ఆధారంగా అది ఇంచుమించు నిటారుగా నడిచిందనీ, మనిషి పరిణామక్రమంలో అది ముందు తరానిదనీ ప్రకటించాడు. దానికి ‘పితికాంత్రోపస్ ఎరెక్టస్’ అని పేరుగూడా పెట్టాడు. కానీ, తన దగ్గరున్న చాలీచాలని సాక్ష్యంతో శాస్త్రజ్ఞుల ప్రపంచాన్ని ఒప్పించేందుకు వీలుపడకపోవడంతో, ఆయన పరిశోధన మరుగున పడిపోయింది.

 ఆ తరువాత ముప్ఫై సంవత్సరాలకు పరిశోధనారంగం చైనాకు మారింది. పీకింగ్ (ఇప్పుడు బీజింగ్ అనే నగరం) నగరానికి సమీపంలో ‘చౌకూటియన్’ అనే గ్రామం దగ్గరి గుహలో ఏవేవో ఎముకలు దొరుకుతున్నాయని విని, అక్కడి అనాటమీ ప్రొఫెసర్ డేవిడ్‌సన్ బ్లాక్ ఆ గుహలో పరిశోధనలు ప్రారంభించాడు. జావాలో దొరికిన పుర్రెలాంటిది ఆయనకు చెక్కు చెదరకుండా దొరికింది. ఆయన 1934లో మరణించగా, వీడెన్‌రీచ్ అనే మరో శాస్త్రజ్ఞుడు అదే స్థలంలో పరిశోధనకు పూనుకున్నాడు. ఎంతో ప్రయాసతోనూ, జాగరూకతతోనూ ఆయన పొరలుపొరలుగా నేలను పరిశీలిస్తూ త్రవ్వకాలు సాగించగా, ఆశించిన అవశేషాలు పరిపూర్ణంగా దొరికాయి. అవి నిటారుగా నడిచిన పూర్వీకునివి. వాటితోపాటు వేరు వేరు పొరల్లో ఎన్నో రకాల జంతువుల అస్థికలు దొరికాయి. వాటిల్లో ‘సేబర్ టీత్’ పులివంటి అంతరించిపోయిన జాతి క్రూరమృగాల ఎముకలు ఎన్నో ఉన్నాయి. అదే పొరలో ఆ సగంనరుడు ఉపయోగించిన రాతి పనిముట్లు కూడా దొరికాయి. అవి ఆస్ట్రలోపిథికస్ వాడిన పనిముట్లకంటే బాగా మెరుగైనవి.

పై ఆధారాలను బట్టి, మనిషి అప్పటికి ఆరుబయటి జీవితాన్ని చాలించి తన నివాసాన్ని గుహల్లోకి మార్చుకుంటున్నాడని అర్థమౌతుంది. అంతకు ముందు ఆ గుహను ఆక్రమించిన క్రూరమృగాలను చంపో, లేదా అవి చనిపోయిన తరువాతనో అతడు ఆ గుహను ఆక్రమించివుండాలి. అతడు ఆహారంగా ఉపయోగించిన జంతువుల ఎముకలు కూడా చాలా దొరికాయి. వాటిల్లో జింక ఎముకలు చాలా ఎక్కువగా ఉండడంతో, అప్పటి మనుషులకు జింక మాసం అత్యంత ప్రీతికరమని తెలుస్తుంది. ఎముకలను బట్టి అతని ఆకారం ఊహిస్తే - నుదురు ఇప్పటి మనిషికున్నట్టు నిటారుగా కాక, ఏటవాలుగా పడుకోనుంటుంది. దవడలూ దంతాలు కాస్త పెద్దవి. చుబుకం లేదు. దవడలు ముందుకు పొడుచుకురావడం, చుబుకం లేకపోవడం, నుదురు నిటారుగా లేకపోవడం కారణంగా చూసేందుకు అతని ముఖం వాలిడికి మల్లే కనిపిస్తుంది. కానీ, వెడల్పాటి తుంటితో అతడు నిటారుగా నడవడమేగాక, మిగతా ఏ లక్షణం తీసుకున్నా మనిషికి చేరువగానే ఉంటుంది. అందువల్ల, అతనికి ‘హోమో’ తెగ కేటాయించారు. ‘హోమో’ అంటే ‘ఒకేలాటి’ అని అర్థం. పీకింగ్ అవశేషాలు ‘హోమో ఎరెక్టస్’వి కాగా, మనిషిది ‘హోమో సెపియన్’ తెగ.

ఆ దశలో మనిషి వేసిన ముందడుగు నిప్పును ఉపయోగించడం. నిప్పును నియంత్రించడం నేర్చుకున్న దశ మానవుని చరిత్రలో అత్యంత విశిష్టమైందేకాక ఎంతో కీలకమైంది కూడా. ఇది మానవుని తొట్టతొలి పరిశోధనకు అమూల్యమైన ఫలితం; ఇది మిగతా జంతుజాలం నుండి మానవుణ్ణి సంపూర్ణంగా విడదీసిన మలుపు. కాల్చిన ఎముకలు దొరికినదాన్ని బట్టి, అతడు మాంసాన్ని నిప్పులమీద కాల్చి తినేవాడని తెలుస్తుంది. బహుశా, దావానలంలో చిక్కుబడి ఉడికిన జంతువుల మాంసాన్ని రుచిచూసిన తరువాత అతనికి వంటమీద ధ్యాస ఏర్పడి ఉండవచ్చు. నిప్పును స్వయంగా తయారుచేసుకునేవాడో లేక కాలిపోయిన అడవుల నుండి నిప్పులు సేకరించేవాడో చెప్పలేంగానీ, అదే పొరలో బొగ్గులు కనిపించడంతో కనీసం 4 లక్షల ఏళ్ళనాడే మనిషి నిప్పును సాధించాడని కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఆ నేలపొరలు నాలుగు లక్షల సంవత్సరాలనాటివి అయివున్నాయి కాబట్టి.

ఆ తరువాతి పరిశోధనల్లో ‘హోమో ఎరెక్టస్’ అవశేషాలు ఆసియాలోనే కాక, ఆఫ్రికాలోనూ బయటపడ్డాయి. టాంగ్యానికా సరోవరతీరంలోని ఆల్డువాయ్‌గార్డ్ కోనలో ఇరవైలక్షల ఏళ్ళనాటి పొరల్లో ఆస్ట్రిలోపిథికస్, ఆ తరువాతి పొరల్లో పితికాంత్రోపస్, ఐదు లక్షల ఏళ్ళనాటి పొరల్లో హోమోఎరెక్టస్ అవశేషాలు అంచెలంచెలుగా దొరికాయి. నేల పైపొరకూ అడుగుపొరకూ నడుమ దశలవారి పరిణామం సూచించే అనేక అవశేషాలు, ఈ శాస్త్రానికి జీవితాలను అంకితం చేసిన డా. లీకీ దంపతులకు పురస్కారంగా లభించాయి.
 ఇలా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలకు చెందిన ప్రాంతాలన్నిట్లో ‘హోమో ఎరెక్టస్’ అవశేషాలు దొరకడంతో, ‘మానవుని మొదటి నివాసం ఏదైవుండొచ్చు?’ అనే వివాదం తారాస్థాయికి చేరింది. నీగ్రోలూ, యూరోపియన్లూ, ఇండియన్లూ, చైనీయులూ వంటి జాతుల మనుషులు వేరు వేరు జంతువుల నుండి పురోగమించారని కొందరు వాదించారుగానీ, వాళ్ళ వాదనకు శాస్త్రీయ విజ్ఞానం దన్నుగా నిలువలేదు. ఇవి ఏ వంద సంవత్సరాల్లోనో వేల సంవత్సరాల్లోనో జరిగిన వలసలు కావు. లేదా, ఒకే దశ పరిణామంలోనూ జరిగినవిగావు. ఆహారం కోసం అన్వేషణలో లక్షల సంవత్సరాల పర్యంతం తన బ్రతుకుతెరువు ఆశలతో ఏ పరిణామదశలో జీవి ఏ దిశగా తారాడిందో ఊహించడం కష్టం. పైగా, అప్పట్లో భూఖండాలు ఇప్పటిలాగా లేవు. ఉదాహరణకు ఆసియాఖండంతో అమెరికా ఖండాన్ని విడదీసే ‘బేరింగ్ జలసంధి’ అప్పట్లో లేదు. ఈ రెండు ఖండాలూ రాకపోకలకు అనుకూలంగా కలిసే ఉండేవి. ఆ కారణంగానే, ఒంటెలూ లామాలూ ఒకే తరహా జంతువులైగూడా, మొదటి ‘హిమానీశకం’లో చలిని ఓర్చుకోగల ‘లామా’లు అమెరికాఖండానికి నివాసం మార్చుకోగా, ఒంటెలు ఉష్ణదేశంలో మిగిలిపోయాయి.

రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement