అధికారం చలాయించొద్దు అభిమానంతో మెలగండి!
‘‘అమ్మ మంచిది కాదు. కొడుతుంది’’ ఆఫీసు నుంచి వచ్చిన తండ్రికి ఫిర్యాదు చేశాడు చిన్నూ. ‘‘నేను అమ్మని కొడతాలే’’ అన్నాడు సుధీర్ కొడుకుని బుజ్జగిస్తూ. లతకి కోపం వచ్చింది. ‘‘అల్లరి చేస్తే అమ్మ కొట్టదా! అనడం మానేసి, నన్ను కొడతానంటారేంటి’’ అంటూ విరుచుకుపడింది. దాంతో మరీ భయపడ్డాడు చిన్నూ. బల్లిలా తండ్రికి అతుక్కుపోయాడు. అమ్మ ఎందుకు చెయ్యి ఎత్తుతుందో అర్థం కాదు. ఏం చేస్తే కొడుతుందో తెలీదు. అందుకే అబద్ధాలు చెబుతుంటాడు. దాంతో మరో రెండు తగిలిస్తుంది లత. అలా ప్రతిదానికీ చెయ్యెత్తడం వల్ల అమ్మ అన్నిటికీ కొడుతుందని వాడి మనసులో ముద్ర పడిపోయింది.
పిల్లల పెంపకం తెలియని తల్లిదండ్రులు ఉండరు. కాకపోతే పెంచే విధానంలోనే తేడా. కొందరు తిట్టి పెంచితే, కొందరు ప్రేమతోనే వారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఈ రెండిటిలో ఏది కరెక్ట్ అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. కొన్నిదేశాల్లో పిల్లలను కొట్టడం నేరం. అందుకుగాను శిక్షలు అనుభవించిన పేరెంట్స్ గురించి మనం విని ఉన్నాం. పిల్లల్ని కొట్టే హక్కు తల్లిదండ్రులకు లేదా అని అడగడం కంటే, అసలు కొట్టాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న వేసుకోవడం అవసరమేమో!
పిల్లలు అల్లరి చేస్తారు, విసిగిస్తారు. అయినా దెబ్బ వేయకపోవడమే మంచిదంటారు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ స్టెఫానీ జేమ్స్. పిల్లలను తప్పుదోవ పట్టించే మొదటి కారణం... భయమేనంటారు ఆమె. దండిస్తే తప్పు చేయడం మానేస్తారనుకోవడం పొరపాటు, దానిమూలంగా పిల్లలు తాము చేసిన తప్పును దాచిపెట్టే ప్రయత్నం చేస్తారని అంటారు. అది నిజమే కావచ్చు. మార్కులు తక్కువ వచ్చాయని తెలిస్తే అమ్మ తంతుందని, తండ్రి తిడతాడని భయమేసి ప్రోగ్రెస్ కార్డును దాచేస్తారు.
పిల్లలు కదా అని వారి మీద హక్కును, అధికారాన్ని చలాయించే బదులు... ఇది మంచి, ఇది చెడు అని విశ్లేషించి, ఇంకోసారి ఇలా చేయకూడదని చెబితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, ఆ పాజిటివ్ ఫీలింగ్ పిల్లలను పక్కదోవ పట్టకుండా కాపాడుతుందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే... పిల్లల మీద తల్లిదండ్రుల్లా పెత్తనం చేయకుండా, స్నేహితుడిలా అన్నిటినీ పంచుకోవాలి. ఏ తల్లిదండ్రులకైనా కావలసింది పిల్లల సంతోషం, క్షేమమే కదా!