మాటలతోనే వెతికేయండి! | Google search engine is used to prove? | Sakshi
Sakshi News home page

మాటలతోనే వెతికేయండి!

Published Wed, Sep 3 2014 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

మాటలతోనే వెతికేయండి!

మాటలతోనే వెతికేయండి!

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను మీరెలా వాడుతున్నారు?
 ఏముంది... గూగుల్ వెబ్‌సైట్‌లో కీవర్డ్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కితే చాలంటున్నారా!
 అంత కష్టం కూడా పడాల్సిన అవసరం లేదిప్పుడు.
 గూగుల్ ‘నౌ’ ఫీచర్‌తో ఎంచక్కా మీ మాటలతోనే వెతికేయవచ్చు...
 ఇంకొన్ని పనులూ చక్కబెట్టుకోవచ్చు.

 
అదెలాగో చూడండి...

ఆపిల్ ఐఫోన్‌ను ఉపయోగించే వారందరికీ ‘సిరి’ వాయిస్ అసిస్టెంట్ గురించి తెలిసే ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్ మీ సహాయకుడిలా పనిచేస్తుంది. మీ మాటల్నే ఆదేశాలుగా నెట్‌లో సమాచారం వెతికి పెడుతుంది... నోట్స్ టైప్ చేసి పెడుతుంది. చెప్పినవాళ్లకు మెయిల్ కూడా చేసేస్తుంది. దీనికి పోటీగా గూగుల్ అభివద్ధి చేసిన వాయిస్ అసిస్టెంట్ పేరు గూగుల్ ‘నౌ’. డెస్క్‌టాప్ పీసీలతోపాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లతో పనిచేస్తుంది. చాలావరకూ స్మార్ట్‌ఫోన్లతోపాటు వచ్చే ఈ ఫీచర్‌ను ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చునంటే...
 
లెక్కలేస్తుంది...

ఎప్పటికప్పుడు మారిపోయే విదేశీ కరెన్సీ రేట్లను తెలుసుకునేందుకు, శాతాలు లెక్కకట్టేందుకు, కొలతలు తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు...
 "Ok Google, what's ten dollars in Japanese Yen?"
 "Ok Google, how many teaspoons in a liter liquid?"ఇలాగన్నమాట!
 
భాషల హద్దులు వద్దు...

మీరు విదేశాలకు వెళ్లారనుకుందాం. అక్కడి భాషలోనే సమాచారం తెలుసుకోవాలన్నా? మాట్లాడాలన్నా గూగుల్ నౌకు మించిన సహాయకుడు దొరకడు. మీకు ఏం కావాలో ఎంచక్కా ఈ అప్లికేషన్‌తో మాట్లాడేయండి. అంతేకాదు. మీ ప్రయాణపు టికెట్లను ఖరాదు చేసిన మెయిళ్లు జీమెయిల్ ద్వారా వచ్చి ఉంటే గూగుల్ నౌ మీకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందిస్తూ ఉంటుంది. ఆయా ప్రదేశాల వాతావరణం వంటివన్నమాట. మీరు స్పెయిన్ వెళ్లారనుకుంటే కింద చూపినట్లుగా గూగుల్ నౌను అడిగేయవచ్చు.
 "Ok Google, say in Spanish, 'Where is the bathroom?'"
 "Ok Google, say in Spanish, 'I'm sorry officer.'"
 "Ok Google, say in Spanish, 'I want to go to the Indian embassy.'"
 
కుతూహలంగా ఉంటే..

చాలా సందర్భాల్లో అకస్మాత్తుగా మనకు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా గూగుల్ సెర్చ్ చేసే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు గూగుల్ నౌ అక్కరకొస్తుంది. మీరు చేయాల్సిందల్లా నేరుగా ప్రశ్న అడిగేయడమే.
 
 ఉదాహరణకు...

 "Ok Google, who is Narendra Modi?"
 "Ok Google, what's FORTRAN?"ఈ ప్రశ్నలకు గూగుల్ నౌ వికీపీడియా వంటి ప్రముఖ వెబ్‌సైట్ల నుంచి సమాచారం సేకరించి మీకు అందిస్తుంది.
 
అంతేకాదు... ఈ అప్లికేషన్‌ను ఇప్పుడు ఎలాంటి సందర్భంలోనైనా ఉపయోగించుకోవచ్చు. అంటే... ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఓపెన్ చేసే పనిలేకుండా... మామూలుగా బ్రౌజ్ చేస్తున్నప్పుడు కూడా వాడుకోవచ్చునన్నమాట. అయితే దీనికోసం గూగుల్ ప్లే స్టోర్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్‌లో అప్లికేషన్‌ను వెతికిన తరువాత...  Settings >Language & Input >Voice Search >"Ok Google"లోకి వెళ్లండి. ఆ తరువాత ఏఏ సందర్భాల్లో ఈ అప్లికేషన్ పనిచేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. దీంతోపాటు మ్యూజిక్ ప్లేయర్‌ను మాటలతోనే నియంత్రించగలగడం, పాటల వివరాలు తెలుసుకోగలగడం కూడా గూగుల్ నౌలో ఉన్న కొన్ని ఇతర ఫీచర్లు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే స్మార్ట్‌ఫోన్ లేదా డెస్క్‌టాప్‌పై ఉన్న మీ గూగుల్ నౌను వాడటం మొదలుపెట్టండి. చేయాల్సిందల్లా గూగుల్ సెర్చ్‌బార్ పక్కనే కనిపించే చిన్న మైక్‌ను క్లిక్ చేయడం అంతే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement