
మెడిసిన్ పూర్తై, డాక్టరుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పేషెంట్లు రాక ఈగలు తోలుకునేవాడు సర్ ఆర్థర్ కోనన్ డాయిల్ (1859–1930). ఈ ఖాళీ సమయం ఆయనలోని రచయితకు కలిసొచ్చేది. ప్రిస్క్రిప్షన్స్ బదులు పాత్రల ట్రీట్‌మెంట్ రాసుకునేవాడు. కొంతకాలం కంటి డాక్టర్ అవుదామని ఆప్తాల్మాలజీ చదవాలని వియన్నా వెళ్లాడు. ఐస్ స్కేటింగ్, మద్యం సేవించడం మాత్రం నేర్చుకుని వచ్చాడు. ఈసారీ భూతద్దంలో చూసినా ఒక్క పేషెంటూ రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే భూతద్దం పట్టుకునే పాత్రే ఆయన మనసులో రూపొందింది. తనకు చదువు చెప్పిన యూనివర్సిటీ టీచర్‌ను ఊహిస్తూ దానికి ప్రాణం పోశాడు. అదే షెర్లాక్ హోమ్స్. ఫోరెన్సిక్ సైన్స్, లాజికల్ రీజనింగ్ బలాలుగా డిటెక్టివ్ సాహిత్యాన్ని మలుపు తిప్పిన పాత్ర. బ్రిటన్ సాంస్కృతిక వారసత్వంలో నిలిచిపోయిన పాత్ర. ఆయన ఒక మనిషే అని నమ్మేంత ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడిన పాత్ర. హోమ్స్, డాక్టర్ వాట్సన్ పాత్రలుగా రాసిన ‘ఎ స్టడీ ఇన్ స్కార్లెట్’ డాయిల్ కెరియర్‌ను మలుపు తిప్పింది. డాక్టర్ వాట్సన్ పాత్రే పాఠకుడికి కథ చెబుతుంది. ప్రచురణకర్తలు ఆయన రాతల కోసం ఎగబడటం మొదలైంది. అయితే, చరిత్రాధ్యయనం మీద ఇంతకంటే మెండైన ఆసక్తి ఉన్న డాయిల్‌కు పదే పదే హోమ్స్ పాత్రతో రాయాలంటే చిర్రెత్తేది. అందుకే ఎవరూ ముందుకురాకుండా పారితోషికం విపరీతంగా పెంచేశాడు. అయినా చెల్లించడానికి సిద్ధపడేవారు. ఆ కాలంలో అత్యధిక పారితోషికం అందుకున్న రచయితల్లో ఆయన ఒకడు.
వైద్యుడిగా ఆయన ఫెయిల్ అయివుండవచ్చుగానీ వైద్య రచయితగా ఫెయిల్ కాలేదు. మెడికల్ వ్యాసాలు రాశాడు. టీకాల మీద ఉన్న అపోహల్ని పోగొడుతూ వాటికి పూర్తి మద్దతు ప్రకటించాడు. తన మతవిశ్వాసాన్ని వదులుకొని సంశయవాదిగా మిగిలిపోయాడు. ఆయన ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడిన క్రికెటర్. ఫుట్‌బాల్, బాక్సింగ్, గోల్ఫ్‌లోనూ చెప్పుకోదగిన ప్రవేశం ఉంది. చారిత్రక నవలలు, లెక్కకు మిక్కిలి కథలు రాసి వాటికి కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ డాయిల్‌ను పాఠకలోకం ప్రధానంగా షెర్లాక్ హోమ్స్ సృష్టికర్తగానే గుర్తుంచుకుంది.