జుట్టుపై పట్టు! | Grip on Hair ! | Sakshi
Sakshi News home page

జుట్టుపై పట్టు!

Published Wed, May 13 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

జుట్టుపై పట్టు!

జుట్టుపై పట్టు!

మనమేమీ పెద్దగా ప్రయాస పడకుండా, శ్రమపడకుండా, ఖర్చు పెట్టకుండా పెద్ద దాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉపయోగించే నానుడి ‘కొండకు వెంట్రుకను కట్టాం. వస్తే కొండ... పోతే వెంట్రుక’. ఈ మాట బట్టతల ఉన్నవారు రాసి ఉండరని మా సందేహం. అసలు వెంట్రుకలంటే ఆఫ్టరాల్ అని కొట్టిపారేసే విషయాలే కావు. వాటి కోసం ఒక్కొక్కరు ఎంత క్షోభపడుతుంటారో... అవి రాలిపోతున్నవారికే తెలుస్తుంది. అలాంటి జుట్టుకు హాని చేసే అంశాలు, వాటి నుంచి కురులను కాపాడుకునే పద్ధతులివి...
 
విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్, వాహనాల నుంచి పెద్ద ఎత్తున వెలువడుతున్న పొగ వంటి కాలుష్యాలతో పాటు గాలిలో చెల్లా చెదురై ఉండే ధూళి కణాలు (సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్)... ఇవన్నీ తొలుత చర్మానికి హాని చేస్తున్నాయి. దాంతో చర్మంపై నాటుకుని ఉండే వెంట్రుకలూ వీటి ప్రభావానికి గురవుతున్నాయి. ఈ కాలుష్యాలు మేనిచర్మాన్ని అలర్జీకి గురిచేస్తాయి. ఆ అలర్జీలు వెంట్రుకలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. మన చర్మంపై నిత్యం తేమ ఉంటుంది. కానీ కాలుష్యాల వల్ల ఆ తేమ కాస్తా పొడిబారిపోయి చర్మం ఎండిపోయినట్లుగా, పగుళ్లుబారినట్లుగా (స్కేలీ)గా అవుతుంది.

ఒక్కోసారి కాలుష్యాల ప్రభావం తీవ్రంగా ఉంటే చర్మం ఎర్రబారడం, దురదలు రావడం కూడా ఉంటుంది. ఈ కాలుష్య ప్రభావానికి చర్మం ఎంతగా గురవుతుందో, వెంట్రుకలూ అంతే గురవుతాయి. వెంట్రుకలు రాలిపోవడం అన్నది కాలుష్యం వల్ల జరిగే చాలా సాధారణ ప్రక్రియ. అందుకే ఇలా వెంట్రుకలు రాలిపోవడం అన్నది నగరీకరణ, పారీశ్రామికీకరణ ఎక్కువగా ఉన్నచోట్ల చాలా ఎక్కువగా కనిపిస్తుండటం మన అనుభవంలోకి వచ్చే విషయమే. కాలుష్యం వల్ల వెంట్రుక బలహీనపడుతుంది. ఫలితంగా అది తేలిగ్గా తెగిపోతుంది.

వెంట్రుకకు సహజంగా ఉండే మెరుపు తగ్గుతుంది. ఇక దీనికి ఈ వేసవి లాంటి సీజన్‌లలో వాతావరణంలోని ఉష్ణోగ్రత కూడా తోడైతే శరీరానికి అవసరమైన పోషకాలు అందడం తగ్గి ఆ ప్రభావం వెంట్రుక మీద కూడా పడుతుంది. పైగా ఈ వేసవికాలంలో శరీరంలోని లవణాలు, పోషకాలు  చెమటల రూపంలో బయటకు వెళ్లిపోతుంటాయి. దాంతో వెంట్రుకలకు అందాల్సిన పోషకాలు, ఖనిజలవణాలు వంటివి వెంట్రుకలకు అందడం తగ్గిపోతుంది. పోషకాలు అందకపోవడంతో కురుల మెరుపు, నిగారింపు తగ్గిపోతాయి. దాంతో జుట్టు చింపిరిగా మారుతుంది. తేలిగ్గా విరిగి (తెగి-ఫ్రాజైల్)పోయేలా వెంట్రుక నిర్మాణంలో మార్పులు వస్తాయి.
 
కాలుష్యాల వల్ల చుండ్రు పెరిగే అవకాశాలతో...
 దుమ్మూధూళి వల్ల జుట్టు తేలిగ్గా చింపిరిగా మారడంతో పాటు మాడుపైన కొన్ని దుష్పరిణామాలు రావచ్చు. ఫలితంగా చుండ్రు వంటివి పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే కాలుష్యంతో చర్మంపై అలర్జీ పెరిగి, మాడుపైనున్న చర్మం పొట్టుగా (పొలుసులుగా) రాలే సమయంలో గోళ్లతో గీరినప్పుడు అది గోళ్లలో నల్లగా కనిపిస్తుంటుంది. వీటన్నింటి సంయుక్త ప్రభావాల వల్ల వెంట్రుకలు తేలిగ్గా రాలడం వంటివి జరుగుతాయి.
 
మహిళల్లో గర్భధారణ తర్వాత: చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలి ఎక్కువగా పలచబారిపోతుంది. దీనికి వారు అనుభవించే శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్‌లు జుట్టుకు అందే విధంగా చూడటం వల్ల దీన్ని అరికట్టవచ్చు.
 శారీరక ఒత్తిడితోనూ: నిత్యం ఉండే శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటివ అంశాలు జుట్టు రాలిపోయేలా చేస్తాయి. దీన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. కానీ ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.
 
జుట్టును రాల్చే కొన్ని రకాల మందులు
రకరకాల రుగ్మతలకు మందులు వాడే మందులు కొందరిలో జుట్టు రాల్చడం మామూలే. ఉదా:  మొటిమల మందులు,  కొన్ని యాంటీబయాటిక్స్  యాంటీ డిప్రెసెంట్స్  నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు   కీమోథెరపీ మందులు. మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు,  హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్,  ఇంటర్‌ఫెరాన్స్,  వేగంగా మారిపోయే మూడ్స్‌ను నియంత్రించడానికి వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు,  నొప్పినివారణకు వాడే ఎన్‌ఎస్‌ఏఐడీ మందులు,  స్టెరాయిడ్స్,  థైరాయిడ్ మందులు... ఇవన్నీ జుట్టుపై ప్రభావం చూపేవే.

ఇలా రాలే జుట్టును అరికట్టడం ఎలాగంటే...  సాధారణంగా మందులు వాడటం మానేయగానే జుట్టు మళ్లీ రావచ్చు.  జుట్టు రాలడం విపరీతంగా ఉంటే ప్రత్యామ్నాయ మందులు వాడటం ద్వారా  కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్‌లోకి అంతగా ప్రవేశించదు. ఇలా చల్లబరిచే ప్రక్రియ హెయిర్ ఫాలికిల్‌ను కాస్త నెమ్మదించేలా చేసి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
 
 డాక్టర్ మేఘనారెడ్డి కె.
 డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్‌డ్
 స్కిన్ - హెయిర్ క్లినిక్,హైదరాబాద్

 
వెంట్రుకలను కాపాడుకునే సాధారణ పద్ధతులు...
కాలుష్యాలైన పొగ, దుమ్ము, ధూళి నేరుగా తాకకుండా సాధ్యమైనంత వరకు చర్మం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అంటే ముఖం, చేతులను రక్షించుకోడానికి స్కార్ఫ్, గ్లవ్‌జ్ వంటివి తొడుక్కోవాలి.  యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆకుపచ్చని కూరలు, తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, జింక్ పాళ్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. రోజూ రాత్రివేళ కూడా చర్మం, వెంట్రుకలు శుభ్రం అయ్యేలా స్నానం చేయాలి.  క్రమం తప్పకుండా జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే జుట్టును మరీ ఎక్కువగా కడగటం కూడా మంచిదికాదని గుర్తుంచుకోవాలి.  

అలర్జెన్స్ నేరుగా వెంట్రుకలకు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, హ్యాట్ పెట్టుకోవడం చేయాలి.  చుండ్రు సమస్య ఉంటే కీటోకెనజాల్ లేదా సైక్లోపిరోగ్సాలమైన్ ఉండే షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి  వెంట్రుక చివర్లు చిట్లిపోకుండా ఉండేలా ప్రతి ఆరువారాలకు ఓమారు జుట్టును ట్రిమ్ చేసుకోవాలి.  మీరు రంగు వేసుకునేవారైతే అది మీకు సరిపడుతోందా లేదా అన్నది ముందుగానే పరిశీలించుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement