టెస్ట్లన్నీ నార్మల్... జబ్బు మాత్రం ఉంటుంది
గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని పిలిచే ఈ వ్యాధి చాలా చిత్రమైనది. చూడ్డానికి అంతా ఆరోగ్యంగానే అనిపిస్తుంది. వైద్య పరీక్షల్లో వైటల్స్ అని పిలుచుకునే నాడీ, రక్తపోటు... ఇవన్నీ సాధారణంగా నార్మల్‌గానే ఉండవచ్చు. కానీ అనారోగ్యమంతా ఆ అచేతనత్వంలోనే ఉంటుంది. కాళ్లూ, చేతులు, మెడ కండరాలతో పాటు... ఒక్కోసారి తలలోని కండరాలూ అచేతనం కావడంతో కళ్లు మూసుకోవడం కూడా సాధ్యం కాని పరిస్థితి. ఆ అరుదైన వ్యాధిపై అవగాహన కోసమే ఈ కథనం.
మనలోని ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంటుంది. మెదడు నుంచి శరీరంలోని అన్ని భాగాలకూ నరాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ నరాలన్నింటిపైనా ‘మైలీన్’ అనే పొర ఉంటుంది. ఈ పొర ద్వారానే కదలికలకు సంబంధించిన సమాచారమంతా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారానే వెళ్తూ, వస్తూ ఉంటుంది. ఆ సిగ్నళ్ల ఆధారంగానే మన కండరాలు కదులుతుంటాయి. మనలోని వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన యాంటీబాడీస్ ఏ కారణం వల్లనో మన మైలీన్ పొరనే నాశనం చేస్తాయి. దాంతో ఈ ఎలక్ట్రిక్ సిగ్నళ్ల ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా అన్ని కండరాలూ అచేతమైపోతాయి.
మొదట నరాలు అచేతనం కావడమన్నది పొడవైన నరం నుంచి ప్రారంభమవుతుంది. అందుకే మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుంటే కాలి నరాలు ప్రభావితం కావడం వల్ల కాళ్లు పడిపోతుండటం జీబీ సిండ్రోమ్‌లో మొట్టమొదట సాధారణంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అచేతనం కావడం అన్నది క్రమంగా పైవైపునకు పాకుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. అంటే... వీపు, చేతులు, మెడ కండరాలు, ఆ తర్వాత చివరగా ముఖం కండరాలు. ఇలా మనిషి మొత్తం... పూర్తిగా అచేతనమైపోతాడు. ఈ అచేతనం కావడం అన్నది అక్కడికే పరిమితమైపోకుండా క్రమంగా ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ కండరాలు కూడా ప్రభావితమౌతాయి. దాంతో ఊపిరితీసుకోవడం కష్టమై ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
వ్యాధి తీవ్రత : ఇలా కండరాలు అచేతనం కావడంలోని తీవ్రత చాలా స్వల్పంగా మొదలుకొని తీవ్రంగానూ ఉంటుంది. స్వల్పంగానే ఉంటే నడవడం కష్టమైపోతుంది. కానీ తీవ్రంగా ఉన్నప్పుడు రోగి పూర్తిగా మంచానికే పరిమితమైపోతాడు. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే కాళ్లూ, చేతులకు తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం వంటివి సంభవించవచ్చు. చాలా అరుదుగా కొందరిలో గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ కూడా అదేవిధంగా హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖంలో వేడి ఆవిర్లు వస్తున్నట్లుగా అనిపిసించడం, తీవ్రంగా చెమటలు పట్టడం, చాలా అరుదుగా మూత్రం కండరాలపైనా పట్టుకోల్పోయి, మూత్రం బయటకు వెళ్లకపోవడం జరగవచ్చు. వ్యాధి ఒకసారి కనిపించాక అది క్రమంగా 7 - 14 రోజుల పాటు క్రమంగా తీవ్రమవుతూ పోవచ్చు. ఆ తర్వాత మళ్లీ రోగి కోలుకోవడం మొదలై క్రమంగా మెరుగుపడవచ్చు.కానీ కొందరిలో మాత్రం పరిస్థితి ప్రమాదకరమై, అవాంఛిత పరిణామాలకు దారితీయవచ్చు.
లక్షణాలు : శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియమ్ పాళ్లు తగ్గడం లేదా పెరగడం వంటి చాలా సాధారణ కారణాలతోనూ కనిపిస్తాయి. అయితే ఆ పరిస్థితిని చక్కదిద్దిన వెన్వెంటనే శరీరంలో కనిపించిన అచేతనత్వం తగ్గిపోతుంది. అప్పుడు రోగి కేవలం రెండు మూడు రోజుల్లోనే మామూలైపోతాడు. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్‌ఐవీ, లింఫోమా వంటి కండిషన్లలో కూడా జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి.
నిర్ధారణ పరీక్షలు: గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని భావిస్తే తొలుత సాధారణ రక్తపరీక్ష చేసి అందులో పొటాషియమ్, క్యాల్షియమ్ పాళ్లను, క్రియాటినిన్ పాళ్లను పరిశీలిస్తారు. అవన్నీ సక్రమంగా ఉంటే నర్వ్ కండక్షన్ పరీక్షల ద్వారా జీబీ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. అయితే ఈ పరీక్ష వ్యాధి తీవ్రతను చెప్పలేదు. కొన్నిసార్లు వెన్ను నుంచి నీరు తీసి చేసే సెరిబ్రో స్పైనల్ ఫ్లుయిడ్ (సీఎస్‌ఎఫ్) పరీక్ష కూడా అవసరం కావచ్చు.
చికిత్స: గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన రోగులకు అవసరాన్ని బట్టి శ్వాస అందించే వెంటిలేటర్ మీద పెట్టాల్సి ఉంటుంది. దాంతో పాటు అతడి రక్తపోటు (బీపీ)ని, గుండె వేగాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ... అవసరాన్ని బట్టి వాటిని సరిచేస్తూ ఉండేలా చికిత్స అందిస్తుండాలి. ఈ చికిత్సతో పాటు రోగి కండరాలకు బలం చేకూర్చేందుకు ‘ప్యాసివ్ ఫిజియోథెరపీ’ ప్రక్రియను కొనసాగించడమూ ప్రధానం.
పైన పేర్కొన్న సాధారణ చికిత్సతోపాటు మరి రెండు చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి.
ఇమ్యూనో గ్లోబ్యులిన్ చికిత్స: ఐదు రోజుల పాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లను ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ. ఇవి శరీరంలోని యాంటీబాడీస్ మనకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రతిబంధకంగా మారతాయి. (యాంటీబాడీస్‌ను బ్లాక్ చేస్తాయి). నరాల పై ఉండే మైలీన్ పొర మరింత ధ్వంసం కాకుండా చూస్తాయి.
ప్లాస్మా ఎక్స్‌ఛేంజ్ చికిత్స: ఈ చికిత్స ప్రక్రియలో ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. ఇది దశలవారీగా జరుగుతుంది. నాలుగు నుంచి ఆరు విడతలుగా ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. రోజు విడిచి రోజు చేసే ఈ చికిత్సలో తొలగించిన ప్లాస్మాకు బదులు సెలైన్, ఆల్బుమిన్‌ను భర్తీ చేస్తారు.
ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స చాలా ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్‌ఛేంజ్ చికిత్స... దాదాపు సగం ఖర్చులోనే అవుతుంది. అయితే ఇక అచేతనమైన శరీర అవయవాలు వెంటనే పనిచేయడం ప్రారంభించవు. అయితే పూర్తిగా మెరుగుపడతాయని కూడా చెప్పడం కష్టం. కాకపోతే చికిత్స తీసుకోని రోగితో పోలిస్తే చికిత్స తీసుకున్న రోగిలో పరిస్థితి మెరుగవుతుంది.