దేవెంద్ర టు నరేంద్ర | H.D.Devegouda to Narendra Modi : 20years of Women's Reservation Bill | Sakshi
Sakshi News home page

దేవెంద్ర టు నరేంద్ర

Published Sun, Sep 11 2016 11:04 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

దేవెంద్ర టు నరేంద్ర - Sakshi

దేవెంద్ర టు నరేంద్ర

హెచ్.డి.దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో ప్రతిపాదనకు వచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. ఆమన తర్వాత ఐ.కె.గుజ్రాల్‌, అటల్‌ బిహారీ వాజపేయి, మన్మోహన్‌ సింగ్‌.. ఇప్పు నరేంద్ర మోదీ హయంలోనూ అర్దామోదంతోనే ఆగిపోయిన దశలో ఉంది!

1996 - 2016 : బిల్లుకు 20 ఏళ్లు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు నేటికి 20 ఏళ్లు! నేడు ట్వెంటీయెత్ బర్త్‌డే! పుట్టని బిల్లుకు బర్త్‌డే ఏమిటి? అవును కదా! పురుడుకు నోచుకోకుండా, ప్రాణం మాత్రమే పోసుకున్న ‘డే’ని బర్త్ డే అనలేం. అదొట్టి ‘బిల్’డే మాత్రమే. 1996లో తొలిసారి బిల్లు పార్లమెంటుకు వచ్చింది.

ఈ 2016లోనూ ఆ వచ్చింది వచ్చినట్టే ఉంది! ప్రవేశ పెట్టిన ఏడాదికో, రెండేళ్లకో బిల్ పాసై ఉన్నా మహిళా బిల్లుకు ఇప్పుడు 18 ఏళ్లు వచ్చి ఉండేవి. అదే టైమ్‌కి మనింట్లో అమ్మాయి పుట్టి ఉంటే ఆమెకూ 18,19 ఏళ్లు వచ్చి ఉండేవి. ఆమెకు ఓటు హక్కు వచ్చి ఉండేది. తనక్కావలసిన అభ్యర్థినో, ప్రత్యేకించి మహిళా అభ్యర్థినో ఆమె ఎన్నుకుని ఉండేది.
 
భారీ ప్రాజెక్టులకే ఇన్నేళ్లు పట్టలేదు!
ఇరవై ఏళ్లన్నది కాల గమనంలో దీర్ఘమైన వ్యవధి. పెద్ద పెద్ద డ్యామ్‌లు పూర్తవడానికి కూడా ఇంత సమయం పట్టలేదు. (నాగార్జునసాగర్ 12 ఏళ్లలో, భాక్రానంగల్ 15 ఏళ్లలో, హీరాకుడ్ 9 ఏళ్లలో కంప్లీట్ అయ్యాయి). అలాంటిది ప్రజాస్వామ్య భవన నిర్మాణానికి 33 శాతం బంగారు తాపడం వెయ్యడానికి మనం ఇరవై ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం కానీ, పని మొదలు కాలేదు! హెచ్.డి. దేవె గౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో ప్రతిపాదనకు వచ్చిన బిల్లు.. ఆయన తర్వాత ఐ.కె.గుజ్రాల్, అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్‌సింగ్..

ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలోనూ అర్ధామోదంతోనే ఆగిపోయిన దశలో ఉంది. రాజ్యసభలో ఓకే. లోక్‌సభలో నాట్ ఓకే. ఇదీ బిల్లు ప్రస్తుత స్థితి. పెండింగులో ఉన్న ఏ బిల్లుకైనా లోక్‌సభ కాలపరిమితి తీరనంత వరకే ప్రాణం. కొత్త లోక్‌సభ వచ్చాక బిల్లును మళ్లీ కొత్తగా పెట్టాల్సిందే. అలా లోక్‌సభలో మహిళా బిల్లు చచ్చిబతుకుతూ వస్తోంది. రాజ్యసభ పర్మినెంట్. అందుకే అక్కడ బిల్లును వదలకుండా పట్టుకుని సాధించుకోవడం వీలైంది.
 
బిల్లుకు బాబ్డ్ హెయిర్ అడ్డొస్తుందా!
మహిళా బిల్లును లోక్‌సభ ఎందుకని ప్రతిసారీ వెనక్కి నెట్టేస్తోంది? ఎందుకంటే.. అక్కడ బిల్లు పెట్టేవాళ్లు ఒకరైతే.. గగ్గోలు పెట్టేవాళ్లు వంద మంది. ‘బాబ్డ్ హెయిర్ మహిళలకు రిజర్వేషన్ ఇస్తే.. అవకతవకగా జుట్టు ముడేసుకుని పనికిపోయే ఆడవాళ్ల బాధ వాళ్లకేం తెలుస్తుంది’ అని అనేవాళ్లు కొంతమంది. 33 లోనే మళ్లీ కొంత రిజర్వేషన్ ఉండాలని వీళ్ల డిమాండ్. ‘ఎన్నేళ్లయినా సరే, పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరాకే మహిళా బిల్లుకు విముక్తి’ అనే అర్థం వచ్చేలా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు డి.వి.సదానంద గౌడ ఆమధ్య లోక్‌సభలో చేసిన ప్రకటనను బట్టి ఒకటైతే స్పష్టం అవుతోంది. ఇప్పట్లో ఇది తెగేలా లేదు. బహుశా ఎప్పటికీ తెగేది కాదేమో! బిల్లొస్తే మగవాళ్ల అవకాశాలు తగ్గుతాయి. అధికారాలు తగ్గుతాయి. అది ఖాయం. అందుకే భయం.
 
‘మాన్సూన్’లో చిన్న జల్లైనా లేదు!
న్యూఢిల్లీలో ఈఏడాది మార్చి 5, 6 తేదీలలో మహిళా ప్రతినిధుల జాతీయ సదస్సు జరిగింది. అది కూడా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవతో మాత్రమే జరిగింది. ‘జాతి నిర్మాణంలో మహిళా ప్రతినిధుల (ఉమన్ లెజిస్లేచర్స్) పాత్ర’ అనేది ప్రసంగాంశం. మొదటి రోజు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడారు. ‘పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 12 శాతం మించి లేదు. ఇది కరెక్టు కాదు’ అన్నారు ప్రణబ్, హమీద్. ‘ఇకనైనా మనం మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆలోచించాలి’ అని కూడా అన్నారు.

రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అయితే ఆయన మహిళా రిజర్వేషన్ మాటే ఎత్తలేదు! ‘స్త్రీలు అభివృద్ధి గురించి కాదు, స్త్రీల నాయకత్వంలో జరిగే అభివృద్ధి గురించి ఆలోచించే సమయం ఆసన్నమైంది’ అన్నారు కానీ, మహిళా బిల్లుకు ఏకాభిప్రాయం సాధించవలసిన సమయం ఆసన్నమైందని అనలేదు! ‘స్త్రీలకు సాధికారతను ఇచ్చేందుకు పురుషులెవరు?’ అని ప్రశ్నించారు కానీ, సాధికారతను చేకూర్చే మహిళా బిల్లును ప్రస్తావనకు తేలేదు! ‘మిమ్మల్ని మీరు సమర్థంగా తీర్చిదిద్దుకోండి.

సాంకేతిక అంశాల్లో సాధికారత సాధించుకోండి’ అని సలహా ఇచ్చారు కానీ.. సమర్థత నిరూపణకు, సాధికారత సాధనకు వీలు కల్పించే మహిళా బిల్లును త్వరలోనే మళ్లీ ప్రవేశపెడుతున్నాం అని హామీ ఇవ్వలేదు. అంతేనా! బిల్లునొదిలేసి పొగడ్తల విల్లంబును ఎత్తుకున్నారు. ‘‘క్షమ, ఓపిక లాంటివి స్త్రీలకు సహజ గుణాలు. భర్త, పిల్లల కోసం వారెంతో త్యాగం చేస్తారు’’ అని ప్రశంసించారు. ‘‘చాలా కొత్త విషయమే చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ! రిజర్వేషన్ బిల్లు చాలా పాతది కాబట్టి పాత సంగతి వద్దనుకున్నట్లుంది’’ అని కాంగ్రెస్ విమర్శ. ఆ విమర్శను ఆ పార్టీ మొన్నటి మాన్‌సూన్ సెషన్స్‌లో వినిపించనేలేదు.
 
ఇరవై ఏళ్లు... అరవై సమావేశాలు
ఇరవై ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు బడ్జెట్ సమావేశాలలో లెక్కలోకి రానిదిగా అయిపోతోంది. వర్షాకాల సమావేశాలలో నీరుగారి పోతోంది. శీతాకాల సమావేశాలలో గడ్డకట్టుకుని పోతోంది. ఈ వికారాలన్నీ బిల్లువి కాదు. బిల్లు పెట్టేందుకు సంశయిస్తున్న వారివి. మన ‘ప్రోగ్రెసివ్’ మోదీ, ‘మేక్ ఇన్ ఇండియా’ మోదీ కూడా బిల్లు మాట లేకుండానే ఈ వర్షాకాల సమావేశాలను దాటేశారు. బహుశా చట్ట సవరణతో పని లేకుండా బిల్లును గట్టెక్కిస్తారేమో చూడాలి.. వచ్చే రెండేళ్లలో.
 
బిల్లు ‘రక్షణ’భారం మహిళలదే

యు.పి.ఎ. తొలి విడత హయాంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి హెచ్.ఆర్.భరద్వాజ్ పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు ఆయనపై సమాజ్‌వాది సభ్యులు దాడి చేసి, బిల్లు పత్రాలను గుంజుకోబోయారు. అక్కడే ఉన్న మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి రేణుకా చౌదరి, మరో మహిళా ఎంపీ చురుగ్గా స్పందించి, భరద్వాజ్‌కు రక్షణగా అటొకరు ఇటొకరు నిలబడ్డారు. ‘బిల్లుపై చెయ్యి పడిందా..’ అని హెచ్చరించారు! ఎప్పటికైనా మహిళా బిల్లు.. మహిళా ఎంపీల తెగింపుతో మాత్రమే సాధ్యమౌతుందనడానికి ఆనాటి సంఘటన ఒక స్పష్టమైన సంకేతం.
 
బిల్ బయోగ్రఫీ
మహిళా బిల్లు చట్టంగా వస్తే కనుక లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల స్థానాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుంది.
మహిళా బిల్లు చట్టంగా రావాలంటే లోక్‌సభలో, రాజ్యసభలో ఆమోదం పొందాలి. దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. రాష్ట్రపతి సంతకం చేయాలి. ఇప్పటి వరకు ఒక్క రాజ్యసభలో మాత్రమే బిల్లు ఆమోదం పొందింది.
తొలిసారి హెచ్.డి.దేవెగౌడ ప్రభుత్వం 1996 సెప్టెంబర్ 12న మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
సి.పి.ఐ. ఎంపీ గీతా ముఖర్జీ అధ్యక్షతన బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను 1996 డిసెంబర్ 9న లోక్‌సభకు సమర్పించింది. తర్వాత కొద్ది కాలానికే దేవెగౌడ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి లోక్‌సభ రద్దయింది.
దేవెగౌడ, గుజ్రాల్‌ల తర్వాత వచ్చిన వాజపేయి ప్రభుత్వం 1998 జూన్ 26న మహిళా బిల్లును లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ గవర్నమెంటు కూడా మైనారిటీలో పడిపోవడంతో లోక్‌సభ అర్ధంతరంగా రద్దయింది.
ఎన్నికల తర్వాత వాజపేయి ప్రభుత్వమే మళ్లీ 1999 నవంబర్ 22న బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ బిల్లుపై ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయింది.
తిరిగి 2002లో, 2003లో వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం బిల్లును సభ ముందుకు తెచ్చింది. అప్పుడూ అదే సమస్య.
ఎన్డీయే తర్వాత, 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం మహిళా బిల్లు తెస్తామని చెప్పింది కానీ, నాలుగేళ్ల వరకు అలాంటి ప్రయత్నాలే చేయలేదు!
ఇంకో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా, 2008 మే 6న బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. లా అండ్ జస్టిస్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపింది.
స్థాయీ సంఘం తన నివేదికను సమర్పించాక,  2009 డిసెంబర్ 17న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండు సభల్లో బిల్లును ప్రవేశపెట్టింది. సమాజ్‌వాది పార్టీ, జనతాదళ్ (యు), ఆర్జేడీ నిరసనలు, తీవ్ర వ్యతిరేకతల నడుమ బిల్లుపై ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయింది.
బిల్లును వీలైనంత త్వరగా తెచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని 2010 ఫిబ్రవరి 22న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
కేంద్ర మంత్రిమండలి 2010 ఫిబ్రవరి 25న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది.
తర్వాత కొద్ది రోజులకు 2010 మార్చి 8న బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బిల్లును వ్యతిరేకిస్తూ సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) సభలో గందరగోళం సృష్టించాయి.
మర్నాడు (2010 మార్చి 9) ఓటింగులో భారీ మెజారిటీతో మహిళా బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
ఆరేళ్లు గడిచాయి. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో యూపీఏ పోయి, ఎన్డీయే వచ్చింది. ఇప్పటి వరకు మళ్లీ బిల్లు మాటే లేదు. మహిళల్లో విల్ పవర్ ఉంటే బిల్ పవర్ ఎందుకు అన్నట్లుంది మోదీ వైఖరి!
 
సాకులు, సైడు ట్రాకులు
జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల బిల్లును తేలేకపోతున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. నిజానికి రాజ్యాంగం ప్రకారం కానీ, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం కానీ ఒక చట్టం తెచ్చేందుకు ఏకాభిప్రాయంతో పని లేదు. పేటెంటు చట్టం, పోటా చట్టం వంటివి ఏకాభిప్రాయం లేకుండా అమల్లోకి వచ్చినప్పుడు మహిళా బిల్లును చట్టంగా ఎందుకు తేకూడదు?
బిల్లు చట్టంగా వస్తే అగ్రవర్ణ మహిళలే ఎక్కువ సీట్లను ఎగరేసుకుపోతారని బిల్లును వ్యతిరేకిస్తున్నవారి వాదన! అందుకే 33 శాతంలోంచి మళ్లీ కొంత శాతం బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ కోసమైతే 33 శాతం నుంచే ఎందుకు తీసుకోవాలి? మొత్తం చట్టసభ సీట్లలోంచే అడగొచ్చు కదా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు!
ప్రతి పార్టీ తప్పనిసరిగా 33 శాతం సీట్లను మహిళలకు ఇచ్చేలా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తే పోయేదానికి రాజ్యాంగాన్నే సవరించడం ఎందుకు అనేవాళ్లూ ఉన్నారు! దీని వెనుకా కుట్ర ఉంది. ఓడిపోయే స్థానాల్లో మహిళా అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిచే చోట మగాళ్లు నిలబడొచ్చు. అప్పుడు రిజర్వేషన్ అన్నమాటకే అర్థం ఉండదు.  పోటీ చేసేవాళ్లు 33 శాతం ఉంటారు కానీ, గెలిచి చట్టసభల్లోకి వెళ్లే వాళ్లు అంతమంది ఉండరు.
ఇన్ని రాజకీయాలు ఉంటాయి కనుకే మహిళలు చట్టసభల్లోకి రావడానికి మహిళా రిజర్వేషన్ చట్టం తప్పనిసరి అవసరం.
- మాధవ్ శింగరాజు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement