కేశ సౌందర్యం...
బ్యూటిప్స్
పెరుగులో నిమ్మరసం కలిపి తలకు పట్టించి మర్దన చేసి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. పెరుగు మరీ పుల్లగా ఉంటే మంచిది. రెండు-మూడు రోజుల పాటు ఫ్రిజ్‌లో పెట్టకుండా గది వాతావరణంలోనే ఉంచి, పులుపెక్కిన పెరుగునే వాడాలి. దీనికి ఇదమిత్థంగా పాళ్లు అవసరం లేదు. ఒక కప్పు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. మర్దన పూర్తయిన తర్వాత పదిహేను నిమిషాలకు తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే ఒక నెలలోనే చుండ్రు బాధ తప్పుతుంది.
ఒక స్పూను నిమ్మరసంలో అంతే మోతాదులో ఉసిరికాయల రసం కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఉదయాన్నే మామూలుగా తలస్నానం చేయాలి. ఇలా రెండు వారాలు చేస్తే చుండ్రు పూర్తిగా పోతుంది.చుండ్రు సమస్య ఉన్న కొందరిలో తలస్నానం చేసిన మొదటి రెండు రోజులు ఆ ఛాయలు కనిపించకుండా మూడవ రోజునుంచి కొద్దికొద్దిగా పొడి రాలుతూ ఉంటుంది. అప్పటి నుంచి తల దురదపెట్టడం క్రమేణా పొట్టు ఎక్కువగా రాలడం జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు వారానికి మూడుసార్లు చొప్పున తలస్నానం చేస్తుంటే మంచిది. అలాగే ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాల సేపు గుండ్రటి పళ్లున్న దువ్వెనతో దువ్వి, వేళ్లతో వలయాకారంగా ప్రెషర్ అప్లయ్ చేస్తూ తలంతటినీ మర్దన చేయాలి. దీనికి ఎటువంటి ఆయిల్స్ అప్లయ్ చేయాల్సిన పని లేదు. ఈ ట్రీట్‌మెంట్ జుట్టు కుదుళ్లను ఉత్తేజితం చేస్తుంది. ఇలా చేస్తుంటే చుండ్రు సమస్యతోపాటు హెయిర్‌ఫాలింగ్ కూడా తగ్గుముఖం పడుతుంది.
బీట్‌రూట్ రసంలో అంతే మోతాదు అల్లం రసం కలిపి తలకు పట్టించినా చుండ్రు తగ్గుతుంది. తాజా బీట్‌రూట్, అల్లం రెండింటినీ చిన్న ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. వారానికి ఒకసారి తలస్నానం చేయడానికి గంట ముందు ఈ రసాన్ని తలకు పట్టించి మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.