హోమియో కౌన్సెలింగ్
మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. గత కొంతకాలంగా ఎప్పుడూ పరధ్యానంగా ఉంటోంది. ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. మాట్లాడినా ఆ మాటలు నిరాశపూరితంగా ఉంటున్నాయి. ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు సరైన హోమియో మందు సూచించండి. – జి, మాలతి, నిజామాబాద్
మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్‌ను మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మత. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్‌లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి మంచి చికిత్స ఉంది.
డిప్రెషన్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా
పేర్కొన్నారు. దీనిలో రకాలు :
మేజర్ డిప్రెషన్ : ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డిస్థిమిక్ డిజార్డర్ : రోగి తక్కువస్థాయి డిప్రెషన్‌లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి.
సైకియాటిక్ డిప్రెషన్ : డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి.
పోస్ట్ నేటల్ డిప్రెషన్ : మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి.
సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటుంది.
బైపోలార్ డిజార్డర్ : ఈ డిప్రెషన్‌లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు.
హోమియో వైద్యవిధానంలో నేట్రమ్‌మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్
చర్మంపైన దద్దుర్లు తగ్గుతాయా?
నా వయసు 23 ఏళ్లు. నాకు తరచూ చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికి అవి తగ్గుతున్నాయి. మామూలుగా వాటితో ఎలాంటి హానీ లేదు. కానీ చూడటానికి దద్దుర్లు భయంకరంగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నప్పుడు తగ్గినట్లు తగ్గినా... ఆ తర్వాత ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఎమ్. గౌతమ్, నెల్లూరు
అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఏ వయసు వారికైనా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అవి...
అక్యూట్ అర్టికేరియా : సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది.
క్రానిక్ అర్టికేరియా : ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్ వంటి వాటి వల్ల ఆర్టికేరియా కనిపించవచ్చు.
కారణాలు : మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది.
అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు :
∙నొప్పి నివారణకు ఉపయోగించే మందులు ∙కీటకాలు, పరాన్నజీవులు ∙ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లు, అధిక ఒత్తిడి, సూర్యకాంతి ∙మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు ∙అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు ∙జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి.
లక్షణాలు : ∙చర్మంపై ఎరుపు లేదా డార్క్ కలర్‌లో దద్దుర్లు ఏర్పడటం ∙విపరీతమైన దురదగా అనిపించడం ∙దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం ∙కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు. ∙గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు ∙దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు.
చికిత్స : హోమియో ప్రక్రియ ద్వారా కాన్‌స్టిట్యూషన్ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలనతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాలను బలోపేతం చేయడం వల్ల అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
ఒళ్లంతా తెల్లమచ్చలు... పరిష్కారం సూచించండి
నా వయసు 37 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. దాంతో ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. – డి. మనోహర్‌రావు, మిర్యాలగూడ
బొల్లి వ్యాధి చర్మంపై మెలనిన్ కణాలు తగ్గడం వల్ల కలుగుతుంది. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు.
చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు.
బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది.
లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు.
చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు.
డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
Comments
Please login to add a commentAdd a comment