తరచు గొంతు బొంగురు  ఎందుకిలా?  | health counciling | Sakshi
Sakshi News home page

తరచు గొంతు బొంగురు  ఎందుకిలా? 

Jan 3 2018 12:03 AM | Updated on Jan 3 2018 12:03 AM

health counciling - Sakshi

ఈఎన్‌టీ కౌన్సెలింగ్‌

నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ఇటీవల అప్పుడప్పుడూ నాకు గొంతు బొంగురుపోయినట్లుగా అనిపిస్తోంది. నాలాంటి వారు గొంతు విషయంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. 
– సంతోష్, విజయవాడ
 
కొంతమంది తమ వృత్తిపరంగా తమ గొంతునూ, స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. వీరిని ప్రొఫెషనల్‌ వాయిస్‌ యూజర్స్‌ అంటారు. అంటే ఉదాహరణకు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, గాయకులు, రేడియోజాకీలు, సేల్స్‌ జాబ్‌లో ఉండేవాళ్లు. వీళ్లు రోజూ తమ రోజువారీ పనిలో గొంతునే ఉపయోగించాల్సి ఉంటుంది. వీళ్ల రోజువారీ పనులు ముగిశాక వాళ్ల వోకల్‌ కార్డ్స్‌ ఎంతగానో అలసిపోతాయి. ఇలాంటివారు తమ గొంతు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే... ∙రోజులో కనీసం 15 నిమిషాల పాటు చొప్పున మూడుసార్లైనా తమ గొంతుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి ∙రోజూ నీళ్లు పుష్కలంగా తాగాలి ∙ఆల్కహాల్‌ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పొగాకు అలవాటును తక్షణం వదిలేయాలి. కాఫీ అలవాటును పూర్తిగా తగ్గించుకోవాలి ∙గొంతు గరగర వచ్చి అది సుదీర్ఘకాలం ఉంటే తప్పకుండా ఈఎన్‌టీ నిపుణులను కలుసుకొని తగిన చికిత్స తీసుకోవాలి. కొందరిలో యాసిడ్‌ పైకి ఎగజిమ్మడం వల్ల కూడా గొంతులో సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటివారు తప్పకుండా తమ అసిడిటీ తగ్గించుకోవాలి.

వోకల్‌ నాడ్యుల్స్‌  అంటే ఏమిటి
నేను ఒక ప్రైవేటు కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు కోచింగ్‌ ఇస్తుంటాను. ఇటీవల నా గొంతు బొంగురుగా ఉంటే ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాను. ‘వోకల్‌ నాడ్యుల్స్‌’ వచ్చాయని అన్నారు. ఇవి ఎందుకు వస్తాయి? నాకు తగిన పరిష్కారం చెప్పండి. – సుధాకర్, విశాఖపట్నం 
మీలాంటి సమస్యనే చాలామందిలో చూస్తుంటాం. వృత్తిపరంగా గొంతును ఎక్కువగా ఉపయోగించే చాలా మందిలో కనిపించే ప్రధాన సమస్య వోకల్‌ నాడ్యూల్స్‌. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్‌ నాడ్యూల్స్‌ వల్ల స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు పూర్తిగా మూసుకుపోవు. దాంతో కంఠస్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్‌ వాయిస్‌) లోపిస్తుందన్నమాట. అంతేగాక ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాట పూర్తిగా పెగలకపోవచ్చు. లోగొంతుకతో మాట్లాడుతున్నట్లూ అనిపించవచ్చు. అంతేగాక... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్‌ కార్డ్స్‌) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్‌ కార్డ్స్‌ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్‌ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్‌ కార్డ్స్‌ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దానివల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. మీరు ఈఎన్‌టీ నిపుణులను, స్పీచ్‌ థెరపిస్ట్‌లను కలవండి. మీ నాడ్యూల్స్‌ మరీ ఎక్కువ పరిమాణానికి పెరిగితే అవసరమైతే శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది.

ముక్కులోఎప్పుడూ ఏమిటా అడ్డు?
నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. అవి వాడుతున్నప్పుడు సమస్య తాత్కాలికంగా తగ్గినట్లు అనిపించినా మళ్లీ తిరగబెడుతోంది. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం చెప్పండి. 
– అరుణ్‌కుమార్, ఖమ్మం
 
ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్‌ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్‌ కూడా తీయించాల్సిరావచ్చు. ఈ పరీక్షలతో ముందుగా మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వాటిలో వచ్చే ఫలితాల ఆధారంగా చికిత్స ఉంటుంది. 

మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్‌ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్‌ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు.

గుండె సర్జరీ  తర్వాత గొంతులో  ఏదో అసౌకర్యం... ఎందుకిలా?
నాకు ఇటీవలే ‘ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ’ అయ్యింది. అప్పట్నుంచి మాట సరిగా రావడం లేదు. మాట్లాడబోతుంటే గాలిలాగా వస్తోంది. తినేప్పుడు, తాగేప్పుడు, మిగడంలో ఇబ్బందిగా ఉంది. ఎప్పుడూ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా ఉంది. దగ్గు కూడా వస్తోంది. దీనికి తగిన పరిష్కారం చూపండి. 
– అనిల్‌కుమార్, హైదరాబాద్‌ 

మీకు స్వరపేటికలోని ‘వోకల్‌ ఫోల్డ్‌’లో సమస్య ఉన్నట్లుగా అనిపిస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్‌హార్ట్‌ సర్జరీ), ట్రకియాస్టమీ, మెడ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్లలో కొన్నిసార్లు ‘వోకల్‌ ఫోల్డ్‌’పై ఒత్తిడి పడటానికీ లేదా అవి చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో మింగడం, మాట్లాడటంలో సమస్యలు రావచ్చు.. కొన్నిసార్లు వోకల్‌ఫోల్డ్‌ పెరాలసిస్‌ వచ్చేందుకూ అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి ముందుగా మీరు నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ‘ల్యారింగోస్కోపీ లేదా ఎండోస్కోపీ’ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేగాక స్పీచ్‌థెరపిస్ట్‌ను సంప్రదించి మింగడంలోని ఇబ్బందులు తొలగిపోడానికీ, గొంతురావడానికి అవసరమైన ఎక్సర్‌సైజ్‌లను తెలుసుకుని వాటిని ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది.
డాక్టర్‌ ఇ.సి. వినయ కుమార్‌
హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్, 
అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement