హెల్త్ టిప్స్
ఆలూ మేలే..
డైటింగ్ చేసేవాళ్ల ముందు ‘ఆలూ’ అనే మాట ఎత్తితే చాలు.. వామ్మో..వాయ్యో అని అరుస్తుంటారు. ఎందుకని అడిగితే అది ఉన్నదానికన్నా మరింత బరువును పెంచుతుందంటూ భయపడతారు. కానీ బంగాళదుంప తింటే బరువు పెరుగుతారన్నది పూర్తిగా నిజం కాదంటున్నారు నిపుణులు. దాన్ని వండే పద్ధతిని బట్టి వాటి ఉపయోగాలుంటాయట. అసలు బంగాళదుంపపై ఇంత నింద పడటానికి ఓ బలమైన కారణమే ఉంది. అదేమిటంటే వాటితో చిప్స్ అనీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనీ ఆలు టిక్కా అని తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అవేమో నూనెలో బాగా ఫ్రై చేసిన పదార్థాలు. దాంతో ఆ కారణంగా అవి ఎక్కువగా తిన్నవారు బరువు పెరగడం మొదలైంది. ఫ్రైలు తినడం లాంటి అనారోగ్య పనులుచేయడమే కాకుండా పాపం ‘ఆలూ’ను నిందిస్తున్నారు.
అసలు ఈ బంగాళదుంపలో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్-సి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్రైలు కాకుండా వాటిని ఉడకబెట్టుకొని రోజు ఎన్ని తిన్నా ఆరోగ్యానికి మేలే కానీ కీడు జరగదట. అంతేకాదు డైటింగ్ చేసే వారు ఓ పూట అన్నానికి బదులుగా రెండు, మూడు బంగాళదుంపలను ఉడికించుకొని తింటే కడుపు నిండి పోతుందట. ఇప్పటికైనా ప్రచారంలో ఉన్న అపోహలను విడిచి ఆలూను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చంటున్నారు డాక్టర్లు.