
ఆఫీసుకు క్యారియర్ పట్టుకొచ్చారా? భోజనం వేళకు.. అయ్యో ఆహారం చల్లగా ఉందని బాధపడుతున్నారా? ఇంకొన్ని నెలలు ఆగితే ఈ ఇబ్బందికి సరికొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్, స్టవ్ వంటివి అవసరం లేకుండానే ఆహారాన్ని వెచ్చబెట్టుకునేందుకు సరికొత్త టెక్నాలజీని సిద్ధం చేసింది యాబూల్. ఫొటోలో కనిపిస్తోందే.. అదే యాబూల్ కుక్కర్. సిలికాన్ రబ్బరుతో తయారు చేసిన ఓ బాక్స్.. మూతపై చిన్న వాల్వ్ లాంటివి ఉంటాయి దీంట్లో. వంటెలా వండాలి? అంటున్నారా? చాలా సింపుల్. ఈ కుక్కర్‌తోపాటు మీకు కొన్ని హీటింగ్ ప్యాడ్స్ అవసరమవుతాయి. కవర్‌లోంచి వాటిని తీసి కుక్కర్ అడుగున పెట్టాలి. పైన జిప్ బ్యాగ్‌లో వండాల్సిన ఆహారం ఉంచి.. మూత వేసేయాలి.
ఒకవైపు నుంచి మూత కొంచెం మాత్రం తీసి నీళ్లుపోసి.. మళ్లీ మూత పెట్టేయాలి. అంతే. పది నిమిషాల్లో కుక్కర్ నుంచి ఆవిరి రావడాన్ని మీరు గమనించవచ్చు. కొంచెం ఆగి జిప్‌బ్యాగ్‌లో ఉన్న ఆహారాన్ని లాగించేయడమే. హీటింగ్ బ్యాగ్‌లో ఉండే రసాయనాల కారణంగా చుట్టూ ఉన్న నీరు వేడెక్కి కుత కుత ఉడికే స్థాయికి చేరుతుంది. ఈ క్రమంలోనే బ్యాగ్‌లలో ఉంచిన ఆహారం కూడా సిద్ధమవుతుందన్నమాట. ఒక్కో హీటింగ్ ప్యాడ్‌ను ఒక్కసారి మాత్రమే వాడుకోవచ్చు. కొరియాకు చెందిన యాబూల్ ఈ వినూత్నమైన ఐడియాను మార్కెట్‌లోకి తెచ్చేందుకు కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరిస్తోంది. దాదాపు పదివేల డాలర్లు సేకరించాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే 23 వేల డాలర్లకుపైగా వచ్చేశాయి. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో నెల రోజుల్లో ఈ వినూత్నమైన కుక్కర్ మార్కెట్‌లోకి వచ్చేస్తుంది.