అలసిపోయినా ఫర్వాలేదు కానీ... ఖాళీగా ఉండలేను! | heroine rakul preet singh interview | Sakshi
Sakshi News home page

అలసిపోయినా ఫర్వాలేదు కానీ... ఖాళీగా ఉండలేను!

Published Sat, May 31 2014 11:11 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

heroine rakul preet singh interview

సినీ నటి కావాలని కలలుగన్న అమ్మాయి...
 అందుకోసం మోడలింగ్‌లో కృషి చేసిన అమ్మాయి...
 కన్నడంలో మొదలుపెట్టి, తెలుగులోకి వచ్చి...
 ఆ పైన తమిళం మీదుగా హిందీ దాకా వెళ్ళిన నటి...
 అందం, కళ్ళతోనే భావాలు పలికించగల అభినయ నైపుణ్యమున్న ఇరవై మూడేళ్ళ రకుల్ ప్రీత్ సింగ్.
 ఒక్క ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్‌తో నాలుగు తెలుగు చిత్రాలతో బిజీగా మారిన నవతరం నాయిక. బిజీ బిజీగా గడుపుతున్న రకుల్‌తో కాసేపు...

 
ఒకేసారి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నారు.. హఠాత్తుగా కెరీర్ ఇలా మలుపు తీసుకుంటుందని ఊహించారా?
 నిజం చెప్పాలంటే అస్సలు ఊహించలేదు. ఎప్పుడో రెండు మూడేళ్ల తర్వాత ఇలా బిజీ అవుతానేమో అనుకున్నా. కానీ, ఎప్పుడో జరుగుతుందనుకున్నది ఇప్పుడే జరిగినందుకు ఆనందంగా ఉంది.
     
 మీ తొలి చిత్రం ‘గిల్లి’ (కన్నడ - 2009)కీ, మీ మలి చిత్రం ‘కెరటం’ (తెలుగు -2011)కీ మధ్య గ్యాప్. ఆ తర్వాత కూడా కొంత విరామం తీసుకుని తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (2013) చేశారు. కారణం ఏంటి?
 డిగ్రీ పూర్తి చేయాలనే ఆకాంక్షతో కావాలనే విరామం తీసుకున్నా. వాస్తవానికి ‘కెరటం’ ఒప్పుకున్నప్పుడు సినిమాల్లో కొనసాగాలా, లేదా అని తర్జనభర్జన పడ్డాను.
     
 ఎందుకలా.. సినిమాలంటే ఇష్టం లేదా?
 చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. హీరోయిన్ కావాలన్నదే నా ఆశయం. అయితే, డిగ్రీ పూర్తి చేయకుండా సినిమాల్లో కొనసాగడం మంచిది కాదనిపించింది. అందుకే విరామం తీసుకున్నా.
     
 హీరోయిన్ అవుతానంటే మీ ఇంట్లో ఏమన్నారు?
 నన్ను హీరోయిన్‌గా చూడాలని అమ్మ కల. అందుకే, ఎండల్లో తిరగనిచ్చేది కాదు. నూనె వంటకాలు తింటే, బరువు పెరుగుతావని హెచ్చరించేది. నేను ‘మిస్ ఇండియా’ టైటిల్ గెల్చుకున్నప్పుడు అమ్మ ఎంత సంతోషపడిందో ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే, నన్ను వెండితెరపై చూసి, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది.
     
 మరి... టైటిల్ గెలుచుకున్నప్పుడు మీకేమనిపించింది?
 ఆ క్షణాలను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే, ‘ఈ దేశానికే ఈమె అందగత్తె... మిస్ ఇండియా’ అని తీర్మానించారు. అందుకే అది చాలా చాలా విలువైన బిరుదు. ఆ టైటిల్ సంపాదించిన తర్వాత హిందీ రంగంలోకి అడుగుపెట్టి, అవకాశాల కోసం ప్రయత్నం చేయాలనుకున్నా.
     
 హిందీ సినిమాలే చేయాలని ఎందుకనుకున్నారు?
 నేను ఢిల్లీ అమ్మాయిని కదా! హిందీ బాగా వచ్చు. దక్షిణాది భాషలు, ఇక్కడి సంప్రదాయం నాకు తెలియదు. అందుకే హిందీ సినిమాల మీద దృష్టి పెట్టా.
     
 డిగ్రీ పూర్తి చేశారు కాబట్టి, ఇక దృష్టంతా సినిమాలపైనేనా?
 అవును. కాకపోతే ‘కెరటం’ చేసినప్పుడు చిత్ర నిర్మాణం గురించి, నటన గురించి నాకేం తెలియదు. అలా వచ్చి.. ఇలా నటించేసి, అలా వెళ్లిపోయేదాన్ని. మొదటి సినిమాతో ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై అవగాహన వచ్చింది. అందుకే, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అవకాశం రాగానే ఒప్పుకున్నాను. నాకు మంచి సినిమా అవుతుందనిపించింది. నా నమ్మకం నిజమైంది.
     
 ఆ సినిమా విజయం వల్లే మీరింత బిజీ అయ్యారనొచ్చా?
 అనుకోవచ్చు. ఒక సినిమా విజయం సాధిస్తే, అందులో నటించిన నటీనటులకు మరింత గుర్తింపు లభిస్తుంది. ఆ విధంగా నాకు ఆ సినిమా లాభించింది.
     
 ప్రస్తుతం మీరు చేస్తున్న నాలుగు సినిమాల్లో ‘కరెంటు తీగ’, ‘పండగ చేస్కో’ నిజానికి నటి హన్సిక చేయాల్సినవి. మరి, ఆ అవకాశాలు మీకు వచ్చినప్పుడు ఎలా అనిపించింది?
 అది కాకతాళీయంగా జరిగింది. ఒక హీరోయిన్‌ను ముందు అనుకొని, ఆ తర్వాత ఆ స్థానంలో వేరే హీరోయిన్‌ను తీసుకున్న సందర్భాలు, సినిమాలు చాలా ఉన్నాయి. నాకు ఆ రెండు సినిమాల కథ, నా పాత్రలు నచ్చాయి. అందుకని అంగీకరించా. పగలు ‘కరెంట్ తీగ’, రాత్రి ‘పండగ చేస్కో’ షూటింగ్‌లలో పాల్గొన్న రోజులున్నాయి.
     
 పగలూ రాత్రీ షూటింగ్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదా?
 ఒక్కరోజు నాకు పని లేకపోతే జీవితమే వ్యర్థం అయినట్లుగా ఫీలై పోతా. వరుసగా షూటింగ్స్ చేసి, అలసిపోయినా ఫర్వాలేదు కానీ, ఖాళీగా మాత్రం ఉండలేను.
     
 హిందీ చిత్రం ‘యారియాన్’లో లిప్‌లాక్ సీన్‌లో నటించారు. మరి తెరపై బికినీ కూడా ధరిస్తారా?
 కథ డిమాండ్ చేస్తే ఓ నటిగా ఏదైనా చేస్తా. అది నా బాధ్యత. ‘యారియాన్’ చూసినవాళ్లు, లిప్‌లాక్ సీన్ అనవసరం అని అనరు. ఆ సినిమాలో ఆ సన్నివేశం లేకపోతే ఏదో లోపించినట్లుగా అనిపిస్తుంది. ఇక, బికినీ విషయానికి వస్తే... ఒకవేళ నేను చేస్తున్నది పల్లెటూరి అమ్మాయి పాత్ర అనుకోండి.. అప్పుడు బికినీ ధరించమంటే అందులో లాజిక్ లేదు. కావాలని ఆ సన్నివేశం పెట్టినట్లు ఉంటుంది. అదే గనక ఆధునిక యువతి పాత్రలో బికినీ ధరిస్తే, సందర్భానికి అతికినట్టు ఉంటుంది. ఏమైనా, కథ, సన్నివేశంలో అవసరముంటే, బికినీ ధరించడానికి సిద్ధం.
     
 మొదట్లో హిందీ సినిమాలే చేయాలనుకున్నారు కదా! మరి, ఇప్పుడేమనుకుంటున్నారు?
 తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే, ఇక్కడ మంచి మంచి పాత్రలు చేసే అవకాశం వస్తోంది. తెలుగు అర్థమవుతోంది. కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను కూడా! త్వరగా తెలుగు భాష నేర్చుకోవాలనుకుంటున్నా. అందుకే ఇక్కడ షూటింగ్ లొకేషన్లో నాతో తెలుగులోనే మాట్లాడమని అందరితో చెబుతున్నా.
     
 మీకంటూ ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా?
 కొన్ని పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఉదాహరణకు ‘బొమ్మరిల్లు’ సినిమాలో జెనీలియా పోషించిన హాసిని పాత్ర. అలా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉంది. అలాంటి పాత్ర వస్తే ఎంత కష్టపడడానికైనా నేను సిద్ధం.
     
 సినీ తారగా పేరొచ్చింది. ఈ సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉంది?
 వ్యక్తిగా నాలో మార్పు రాలేదు. స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్‌తో టచ్‌లోనే ఉన్నా. వీలు కుదిరినప్పుడు వాళ్లను కలుస్తున్నా. కాకపోతే అంతకు ముందు అందం, శరీరం గురించి పెద్దగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరంలేదు. కానీ, ఇప్పుడు తప్పనిసరిగా శరీరాకృతిని కాపాడుకోవాలి.
     
 అంటే... నచ్చిన ఆహారానికి దూరంగా ఉంటున్నారన్నమాట?
 ఐస్‌క్రీమ్‌లు, స్వీట్స్‌కు వీలైనంత దూరంగా ఉంటున్నా. ఒకవేళ ఎప్పుడైనా తిన్నా, అదనంగా వర్కవుట్ చేసేస్తా.
     
 మీలాంటి అందమైన అమ్మాయిలకు సహజంగానే బోల్డన్ని ప్రేమలేఖలు వస్తాయి కదా! మరి మీకు?
 వచ్చాయండి. వాటిని చదువుతా కానీ, జవాబివ్వను.
     
 అంటే... మీ జీవితంలో ఇంకా ఎవరూ లేరన్నమాట?
 లేరు. ప్రస్తుతం సినిమాలే నా జీవితం.
 
 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement