చాలా సందర్భాల్లో క్రోమోజోములు లేదా జన్యువుల అసాధారణత్వం వల్ల లేదా అండం,
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 28 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు అవుతోంది. మూడు సార్లు గర్భం దాల్చాను. ప్రతిసారీ మూడునెలలలోపు గర్భస్రావం అవుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్ని పరీక్షలు చేసి అంతా నార్మల్ అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. మళ్లీ గర్భం దాల్చినా అదేవిధంగా అవుతుందేమోనని ఆందోళనగా ఉంది. హోమియో చికిత్స ద్వారా నాకు గర్భం నిలుస్తుందా?
– సరళ, హైదరాబాద్
స్త్రీలలో తరచూ గర్భస్రావం అవుతుంటే అది వారిని మానసికంగా దెబ్బతీసి, మరోసారి గర్భం వచ్చినప్పుడు అది నిలుస్తుందా లేదా అన్న ఆందోళనను కలగజేస్తుంది. గర్భం వచ్చిన తర్వాత రెండు లేదా అంతకు ఎక్కువసార్లు గర్భస్రావం జరిగితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’ లేదా ‘హ్యాబిచ్యువల్ అబార్షన్స్’ అంటారు.
కారణాలు: చాలా సందర్భాల్లో క్రోమోజోములు లేదా జన్యువుల అసాధారణత్వం వల్ల లేదా అండం, శుక్రకణాల్లో వేటిలోనైనా అసాధారణత్వం ఉండటం వల్ల ఇలా తరచూ గర్భస్రావం జరిగే అవకాశాలుంటాయి. అలాగే... ∙గర్భాశయంలో అసాధారణత్వాలు అంటే ఉదాహరణకు రెండు గదులుగా ఉండటం లాంటివి ∙గర్భాశయంలో కణుతులు, పాలిప్స్ ∙సర్విక్స్ బలహీనంగా ఉండటం ∙యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ (ఏపీఎస్) వంటి వ్యాధులు ∙కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులు (ఉదాహరణకు సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్) ∙కొన్ని రకాల ఎండోక్రైన్ వ్యాధులు (ఉదాహరణకు డయాబెటిస్, థైరాయిడ్ సమస్య వంటివి) ∙కొన్ని రకాల సాధారణ, వైరల్ ఇన్ఫెక్షన్లు ∙పైన పేర్కొన్న వైద్యపరమైన సమస్యలతో పాటు మద్యం, పొగతాగడం వంటి అలవాట్ల వల్ల గర్భాస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే చాలా సందర్భాల్లో ఏ విధమైన కారణం లేకుండా కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయి.
చికిత్స: హోమియో విధానంలో జెనెటిక్ కాన్స్‌టిట్యూషన్ పద్ధతి ద్వారా రోగి శారీరక, మానసిక తత్వాలను పరిగణనలోకి తీసుకొని అనుభవజ్ఞులైన వైద్యులు ఇచ్చే ఔషధాలతో గర్భస్రావం కాకుండా చూడవచ్చు. పేషెంట్ పరిస్థితిని వైద్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ వ్యక్తి సరిపడిన మందును అందించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం, హార్మోన్ల అవ్యవస్థత ఉంటే దాన్ని చక్కబరచడం, స్త్రీ–పురుషులలో లోపాలు ఉంటే వాటిని సరిచేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. తద్వారా మహిళల్లో గర్భం నిలిచేలా చూసి సంతానలేమి సమస్యను దూరంచేసి సంతానప్రాప్తి కలిగేలా చూడవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి
హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్