పోలీసు పుట్టిల్లు | Home to the police | Sakshi
Sakshi News home page

పోలీసు పుట్టిల్లు

Published Mon, Feb 29 2016 11:07 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

పోలీసు పుట్టిల్లు

పోలీసు పుట్టిల్లు

ఫంక్షన్ స్టేషన్
 
వాళ్లు... రివాల్వింగ్ ఛైర్‌లో కూర్చుని ఉన్న రివాల్వర్లు. చిర్నవ్వునూ, యూనిఫామ్‌నూ ధరించి ఉన్న రైఫిళ్లు. అప్రమత్తంగా ఉండే స్టెన్‌గన్‌లు. అవాంఛిత ఘటనల్లో దూసుకుపోయే బుల్లెట్లు. ఈ మాటలు అక్కడి పురుష సిబ్బందికి కాదు... అక్కడ పోలీసింగ్ చేస్తున్న సివంగులకూ వర్తిస్తాయి.   నేర్పుతో మ్యాగజైన్‌లో బుల్లెట్లు నింపినంత అలవోకగానే నిండైన ఆప్యాయతతో కొత్తసారెతో ఒడి నింపారు. నీకు మేమున్నామన్న భరోసానూ నింపారు. పక్కన పనిచేసే అమ్మాయీ మాకు అక్కచెల్లెళ్లనే సంకేతం ఇచ్చారు. శాంతిభద్రతలతో పాటు సంస్కృతి మాకు కావాలనే సందేశం పంపారు. వాళ్లే గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు! వాళ్ల ఆలోచన వైవిధ్యం. వాళ్ల ఆచరణలో సౌభ్రాతృత్వం. వాళ్లు చేసింది సీమంతం. తమ సహోద్యోగిని ప్రమీల కోసం చేసిన వేడుక చూతము రారండి. మునివేళ్లతో నాలుగు మంగళాక్షతలను చల్లేద్దాం పదండి.  

ఆరోజు శుక్రవారం. సమయం సాయంత్రం ఆరు గంటలు. కాళ్ల చుట్టూ ఎర్రటి తివాచీలు, కళ్లకు కనిపిస్తున్న పచ్చటి తోరణాలు. రంగురంగుల బెలూన్లు. ఆహ్లాదకరమైన సువాసనలు. మల్లెల గుబాళింపులు. అది పోలీస్ స్టేషనేనా లేక ఫంక్షన్‌హాలా అనే సంశయాలు. ఈ సందేహానికి కారణం ఉంది. పట్టుచీరలు కట్టిన మహిళలు ఒక్కొక్కరుగా స్టేషన్‌లోనికి వెళ్తున్నారు. యూనిఫాంలో ఉన్న పోలీసులు ఎదురేగి వాళ్లను ఆహ్వానిస్తున్నారు. కొద్దిసేపట్లోనే స్టేషన్ నిండా సౌభాగ్యవతుల కళకళ. లాఠీలు పట్టే చేతులనిండా ఆ కాసేపు గాజుల గలగల. కాస్త ఎత్తై డయాస్‌పై మహారాజా కుర్చీలో మహారాణిలా కూర్చున్న ప్రమీల.
 
ఎవరీ ప్రమీల, ఎందుకీ వేడుక..?
గుంటూరు రామిరెడ్డితోటకు చెందిన మానుపాటి ప్రమీల 2014లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లోనే తొలి పోస్టింగ్. కంప్యూటర్ విభాగంలో పనిచేసే ప్రమీల అంటే కొలీగ్స్ అందరికీ ఆదరం. ఎనలేని గౌరవం. సీఐ, ఎస్సైలతో పాటు సిబ్బంది అందరికీ ఆమె తలలో నాల్క. అతి తక్కువ సెలవులు పెట్టే ఉద్యోగినిగా మంచి గుర్తింపు. ఒక్కమాటలో చెప్పాలంటే స్టేషన్‌లోని వారందరికీ తోబుట్టువు. ఈ వాత్సల్య భావనే ఆమెకు సీమంతం చేయాలనే ఆలోచనను అంకురింపజేసింది. ఆ వేడుక సాకారమయ్యేలా చేసింది. సాధారణంగా గర్భిణులకు 5, లేదా 7వ నెలలో పుట్టింటి వారు సీమంతం చేస్తుంటారు. పసుపు, కుంకుమలతో నిండు నూరేళ్లూ సౌభాగ్యంతో జీవించమని ఆశీర్వచనాలు అందజేస్తుంటారు. దీనికితోడు కడుపులో బిడ్డకు చలువ చెయ్యడం కోసం చలివిడి తినిపించాలన్న ఆకాంక్ష. అందరి దీవెనలతోనూ తల్లి కడుపులోని శిశువు గొప్పవాడు కావాలన్న శుభాకాంక్ష. ఆ నమ్మకంతోనే ఈ వేడుకను నిర్వహించడం ఒక ఆనవాయితీ. ఒక సంప్రదాయం. సాధారణంగా ఈ తరహా వేడుకలన్నీ పుట్టింట్లో జరుగుతాయి. కానీ ఇక్కడ ప్రమీలకు ఈ గౌరవాన్ని ఇచ్చారు తోటి పోలీసులు. కారణం... ప్రమీలమ్మ తమ తోబుట్టువు అనుకుంటారు అక్కడి సిబ్బంది. దాంతో ఆమెకు సీమంతం చేశారు. పసుపు, కుంకుమలు, గాజులు, పండ్లు అందజేశారు. నుదుట కుంకుమ బొట్టుపెట్టి, కంఠానికి గంధం పూసి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. ఇలా ఒక పోలీస్ స్టేషన్‌లో సీమంతం జరగడం తెలుగురాష్ట్రాల్లోనే బహుశా ఇది మొదటిసారి.
 - పీఎస్‌ఎన్‌వీ ప్రశాంత్,
 జీ. వేణుగోపాల్, సాక్షి, గుంటూరు
 
ప్రజలకు నమ్మకం పెరగాలి...
ప్రజలతో సత్సంబంధాలు పెరగాలంటే సంప్రదాయాలను గౌరవించాలి. ప్రధానంగా మహిళల్లో పోలీసులపై నమ్మకం పెరగాలి. మా మధ్యలో పనిచేసే మా ఇంటి ఆడపడుచుకు సీమంతం చేస్తే ఎలాగుంటుందో తెలియజేయాలనుకున్నాం. ఇది మిగతా వారందరికీ స్ఫూర్తి కావాలన్నది మా కోరిక.
 - శేషగిరిరావు, సీఐ, పట్టాభిపురం
 
మంచి ఆలోచన...
మంచి సంప్రదాయానికి పోలీస్ సోదరులు స్ఫూర్తిగా నిలిచారు. చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ప్రజల్లో పోలీసులపై గౌరవం, నమ్మకం పెరుగుతుంది. మహిళలు ధైర్యంగా స్టేషన్‌కు రాగలుగుతారు.
 - కేజీవీ సరిత, డీఎస్పీ, గుంటూరు వెస్ట్.
 
మరచిపోలేని వేడుక...

నా  భార్యకు జరిగిన సీమంతపు వేడుక చూశాక ఎంతో సంతోషంగా అనిపించింది. స్టేషన్‌లోని సిబ్బంది అంతా ఆమెలో ఒక సోదరిని చూసుకోవడం చూసి ఆనందంగా ఉంది.  ప్రమీలకు స్టేషన్‌లో జరిగిన సీమంతం మరచిపోలేని వేడుక.
 - అజయ్‌కుమార్, ప్రమీల భర్త.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement