వినికిడి తగ్గిందా? బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు! | Homeopathic counseling | Sakshi
Sakshi News home page

వినికిడి తగ్గిందా? బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు!

Published Tue, Sep 8 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

Homeopathic counseling

హోమియో కౌన్సెలింగ్
 

 నా వయసు 34 ఏళ్లు. నాకు తరచు గొంతునొప్పి వస్తూ, మింగడం కష్టం అవుతోంది. ఈ సమస్యతో ఫంక్షన్లకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. బయట ఎక్కడైనా గుక్కెడు మంచినీళ్లు తాగితే చాలు... తిప్పలు తప్పట్లేదు. దీనికి హోమియోపతిలో పరిష్కారం ఉంటే చెప్పగలరు.  - కాంచన, నెల్లూరు

 గొంతులో తీవ్రమైన నొప్పి, దురద, అసౌకర్యం... ఈ సమస్యకు ఇంచుమించు అందరూ బాధితులే. సాధార ణంగా ఫారింజైటిస్ అంటే ముక్కు, గొంతు వెనుక ఉన్న ఒక ప్రాంతం, నోరు వెనుకభాగంలో ఉండే పల్చటి పొరలో వాపు రావడం గొంతునొప్పికి ప్రథమ లక్షణం.  సమస్య ఉదయం తీవ్రంగా ఉండి, పొద్దుపోయేకొద్దీ తగ్గుతుంటుంది. ఇది ప్రాథమిక దశలోనే తగ్గవచ్చు లేదా  తీవ్రం కావచ్చు. ఫారింజైటిస్ మూలంగా గొంతునొప్పి తీవ్రమై, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ మాత్రం తగ్గకపోవచ్చు. అది వారానికి, రెండువారాలకు పైగా గొంతు బొంగురుపోయి ఉన్నప్పుడు, జ్వరం 101 డిగ్రీలకన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, తెమడలో రక్తం కనిపిస్తూ, మింగడంలో గానీ, శ్వాస తీసుకోవడంలోగానీ ఇబ్బంది అనిపించవచ్చు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దీనికి కారణం కావచ్చు. అలాగే నోరు సరిగా తెరుచుకోకపోడం, చెవినొప్పి, వికారం లేదా వాంతులు కావడం, తీవ్రమైన నీరసం, మెడవద్ద ఉండే లింఫ్ నోడ్స్ పెద్దవిగా కావడం, టాన్సిల్స్ మీద తెల్లని మచ్చలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
 జాగ్రత్తలు: గొంతు సమస్యలు మొదలైనప్పుడు  ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో నోరు పుక్కిలించాలి. గొంతుకు విశ్రాంతినివ్వాలి. ద్రవపదార్థాలు తీసుకోవాలి. గొంతు తడి ఆరకుండా చూసుకోవాలి. మసాలా తగ్గించాలి. మద్యం అలవాటుంటే మానాలి.

హోమియో చికిత్స
బెల్లడోనా: తీవ్రమైన గొంతునొప్పి, టాన్సిల్స్ వాపు, మంట, దీనితోపాటు జ్వరం, గొంతునొప్పి. గొంతు పొడిబారినట్టుగా ఉండి ద్రవాలు తీసుకోవడానికి ఇష్టపడరు.
 
మెర్క్‌సాల్: వాతావరణం మారితే గొంతునొప్పి, నోటిలో పొక్కులు, గొంతు అల్సర్స్, గొంతు మొద్దుబారినట్లుగా ఉండి, గొంతులో తీవ్రమైన మంట ఉంటుంది

 ఫైటోలెక్కా: ముక్కు ఎర్రబారడం, టాన్సిల్స్ వాచడం, కాళ్లూ చేతులూ లాగ డం, శ్లేష్మం, నోరుదుర్వాసన వంటి లక్షణాలున్నప్పుడు.
 కాలిమూర్: గొంతుభాగంలో గోధుమరంగు చిన్నచిన్న మచ్చలు, దీర్ఘకాలిక గొంతునొప్పి ఉన్నప్పుడు. ఇంకా లాకసిస్, లైకోపొడియా, వైతియా అనే మందులు డాక్టర్ పర్యవేక్షణలో వాడవలసి ఉంటుంది.
 
జనరల్‌హెల్త్ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. నాకు మొదటి నుంచి అసిడిటీ సమస్య ఉంది. ఇటీవల ఒళ్లంతా తీవ్రమైన నొప్పులు రావడంతో డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నాను. ఒకటి రెండుసార్లు పెయిన్ కిల్లర్స్ వాడాను. అవి వాడినప్పటి నుంచి కడుపులో మంట మరింతగా పెరుగుతోంది. నాకు పరిష్కారాన్ని సూచించండి. - మనోహర్, కడప


కొన్ని నొప్పి నివారణ మందుల వల్ల... ముఖ్యంగా ఎన్‌ఎస్‌ఏఐడి గ్రూపునకు చెందిన బ్రూఫెన్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్ వంటి వాటివల్ల అసిడిటీ, గుండెలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించి మీకు మందులతో వస్తున్న సైడ్‌ఎఫెక్ట్స్ గురించి వివరించండి. డాక్టర్ మందులు మార్చి ఇస్తే మీ సమస్య తీరుతుంది. కాకపోతే మీకు ఒళ్లునొప్పులు రావడానికి గల కారణాలను కూడా తెలుసుకొని, దానికీ చికిత్స అందించడం అవసరం. కాబట్టి ఒకసారి ఫిజీషియన్‌ను సంప్రదించండి.
 
 నా వయస్సు 64 ఏళ్లు. నాకు గత పదేళ్లుగా షుగర్, బీపీ ఉన్నాయి. ఈమధ్య ముఖం బాగా ఉబ్బింది. కాళ్లపై కూడా వాపు కనిపిస్తోంది. దాంతోపాటు పొట్ట నొప్పి కూడా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి మూత్రపిండాల్లో సమస్య ఉందన్నారు. కిడ్నీలు ముప్ఫయి శాతం దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టపోయిన దాన్ని మళ్లీ బాగు చేయలేమని కూడా చెప్పారు. నాకు వచ్చిన సమస్య ఏమిటి? నా మూత్రపిండాలు మిగతా 70 శాతం  చెడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి. - ఓంకార్‌నాథ్, విజయనగరం

షుగర్, బీపీ సమస్యలు ఉన్నవారిలో వాటిని నియంత్రించుకోకపోతే, కొంతకాలం తర్వాత మూత్రపిండాలపై వాటి దుష్ర్పభావం పడి అవి దెబ్బతినడం చాలామందిలో కనిపించే పరిణామమే. దీనికి డయాబెటిక్ నెఫ్రోపతి లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) లేదా కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ (సీసీఎఫ్) కారణాలు కావచ్చు. అందువల్లనే బీపీ, షుగర్... ఈ రెండు సమస్యలూ ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని చికిత్సలో తగు మార్పులు (అంటే... మందులు, వాటి మోతాదుల్లో మార్పులు) చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బహుశా  మీరు ఈ పరీక్షలు తరచూ చేయించకపోవడం వల్లనో లేదా మీకు ఈ సమస్యల దుష్ర్పభావాల ఫలితాలపై తగినంత అవగాహన లేకపోవడం వల్లనో ఇప్పటికే ముప్పయి శాతం డ్యామేజీ జరిగిపోయి ఉంవడచ్చు.
 ఇంకా ఆరోగ్యపరంగా మరింత నష్టం వాటిల్లకుండా ఉండటం కోసం మీరు మీ బీపీ, షుగర్‌లను అదుపులో పెట్టుకోవడం, వైద్యులను తరచూ సంప్రదిస్తూ క్రమం తప్పకుండా సంప్రదించడం  అవసరం. మీరు ఇకపై తరచూ మీ ఫిజీషియన్‌ను తప్పక సంప్రదిస్తూ ఉండండి.
 
రేడియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 57 ఏళ్లు. ఇటీవల వినికిడి శక్తి బాగా తగ్గింది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేయించి, న్యూరోసర్జన్‌ను సంప్రదించమని చెప్పారు. వినికిడి సామర్థ్యానికీ, మెదడుకూ సంబంధం ఏమిటి? డాక్టర్ ఆపరేషన్ అవసరం అంటున్నారు. నాకు శస్త్రచికిత్స అంటే భయం. దాని అవసరం లేకుండా చికిత్స చేయడం సాధ్యం కాదా?  దయచేసి వివరంగా చెప్పండి. - శ్యామలరావు, అనకాపల్లి

 మీరు చెప్పిన లక్షణాలను బట్టి మెదడులోని కణుతుల పరిమాణం బాగా పెరగడం వల్ల వినికిడి శక్తి తగ్గిందని అనుకోవచ్చు. కొందరిలో కొన్నిసార్లు మెదడులో కణుతులు పెరుగుతాయి. వీటిని బ్రెయిన్‌ట్యూమర్స్ అంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. అయితే ప్రాథమికంగా వీటిని హానిచేయనివి (బినైన్), హానికరమైనవి (మాలిగ్నెంట్) అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. మెదడులో సాధారణంగా వచ్చే కణుతుల్లో దాదాపు వంద రకాలకు పైగా ఉన్నప్పటికీ గ్లయోమా, మినింజియోమా ఆకాస్టిక్ న్యూరోమా అనేవి ప్రధానమైనవి. ఇందులో మినింజియోమా కణుతులు హానిచేసేవి కావు. అయితే అవి మెదడు పైపొరల నుంచి గానీ, లేదా అడుగు భాగం నుంచి గానీ పుట్టుకొస్తాయి.

 వినికిడి శక్తి తగ్గడానికీ, మెదడు కణుతుల పెరుగుదలకూ సంబంధం ఉంది. చెవి వెలుపల నుంచి వచ్చే శబ్దతరంగాలను చెవిలోపలి శ్రవణనాడి మెదడుకు మోసుకుపోతుంది. ఈ శ్రవణనాడిని ఆలంబన చేసుకొని పెరిగే ట్యూమర్‌నే అకాస్టిక్ న్యూరోమా లేదా ష్వానోమా అంటారు. ఇది పెరుగుతున్నప్పుడు ముఖానికి సంబంధించిన ఫేషియల్ నాడితో పాటు ట్రైజెమినల్ నాడిపై ఒత్తిడి పెరుగుతుంది. అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఏర్పడితే ట్యూమర్ వల్ల కలిగే ఒత్తిడితో పరిసరాల్లోని నాడులు ప్రభావితమై వినికిడి శక్తి సన్నగిల్లుతుంది. దాంతోపాటు నోరు ఒంకరపోవడం, తూలిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. లక్షణాలు కనిపించేవారకూ చాలామందిలో మెదడులో ట్యూమర్ ఉందన్న విషయం బయటపడకపోవచ్చు. అయితే వినికిడిశక్తి తగ్గడంతో ఈఎన్‌టీ నిపుణుల వద్దకు వెళ్లినప్పుడు వారు చేయించే ఎమ్మారై స్కాన్‌ల వల్ల ఇటీవల చిన్నసైజు ట్యూమర్లూ  తెలుస్తున్నాయి. వారు అకాస్టిక్ న్యూరోమాను అనుమానించినప్పుడు సంబంధిత పరీక్షలు చేయిస్తారు. ఇప్పుడు శస్త్రచికిత్స అవసరం లేకుండానే రేడియేషన్ చికిత్స ద్వారా 3 సెం.మీ. వరకు ఉన్న మెదడు ట్యూమర్‌లను కరిగించవచ్చు. మీరు ఆపరేషన్ గురించి ఆందోళన పడకుండా న్యూరోసర్జన్‌ను కలవండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement