హోమియో కౌన్సెలింగ్
మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్న వయసు నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌గారిని సంప్రదించి చికిత్స అందిస్తున్నాము. కానీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా? - సరళ, అమలాపురం
మీ బాబు రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే ఈ అలవాటును వైద్యపరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఈ సమస్య చిన్న పిల్లల్లోనే గాక కొంతమంది పెద్దల్లోనూ ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో రాత్రి సమయంలో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు సాధించడం జరగకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే ఈ పరిస్థితిని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు.
కారణాలు
నాడీ వ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు (ముఖ్యంగా డౌన్‌సిండ్రోమ్), ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువ సార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్-1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు.
పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ,
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్
లివర్ సమస్య.. పరిష్కారం చెప్పండి
లివర్ కౌన్సెలింగ్
నా వయసు 54 ఏళ్లు. నాకు మద్యం తాగే అలవాటు ఉంది. అయితే కొన్ని నెలల క్రితం నాకు ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో డాక్టర్ సలహాలతో మద్యం పూర్తిగా మానేశాను. అయితే అనారోగ్య సమస్యలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి ‘లివర్ ట్యూమర్’ కారణంగా లివర్ పాడైందనీ, అలాగే ‘అల్ఫా పెటోప్రొటీన్’ అత్యధికంగా లక్షకు మించిపోయిందని, దాంతో లివర్ సరిగా పనిచేయడం మానేసిందని తెలిపారు. అంతేకాకుండా లివర్ మార్పిడి చేసుకోకపోతే ఇక బతకడం కష్టమని కూడా తేల్చి చెప్పారు. కుటుంబ పెద్దగా బాధ్యతలు ఉన్న నేను ఈ పరిస్థితుల్లో నాకు తగిన సలహా ఇవ్వండి. - గుప్తా, హైదరాబాద్
మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ లివర్ కండిషన్ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పవచ్చు. లిక్కర్ అనేది లివర్‌కు ప్రధాన శత్రువు. అతిగా మద్యం సేవించే అలవాటు వల్ల లివర్ పూర్తిగా డ్యామేజీ అవుతుంది. లివర్ క్యాన్సర్ లేదా లివర్ సిర్రోసిస్ బారిన పడుతుంది. మీరు మద్యాన్ని మానివేసే సమయానికే మీ కాలేయం బాగా పాడైపోయి ఉండవచ్చు. కాలేయం క్షీణత అనేది మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశ (చైల్డ్ గ్రేడ్-ఏ)లో లివర్‌పై ట్యూమర్లు దాడి చేసినట్టు గుర్తించి, సరైన చికిత్స అందిస్తే దాదాపు 70 శాతం వరకు దానిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికే ట్యూమర్లు మళ్లీ తిరగబడినా, లివర్‌కు మాత్రం ఐదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రీట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రెండోదశలో ట్యూమర్ల పరిమాణం పెరిగి చికిత్సకు ఇబ్బందిగా మారుతుంది. అప్పుడు కేవలం కాలేయ మార్పిడి ద్వారానే పేషెంట్‌ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ట్యూమర్లు ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఫలితం దాదాపు 70 - 80 శాతం మేరకు ఉంటుంది. ఇక చివరిదైనా మూడోదశకు వస్తే... లివర్ ట్రాన్స్‌ప్లాంట్ తప్ప వేరే మార్గమే లేదు.
పరిస్థితిలో పేషెంట్‌కి వివిధ స్టేజెస్‌లో, రకరకాల చికిత్స విధానాల్ని అవలంబించాల్సి వస్తుంది. ట్యూమర్ల కారణంగా లివర్ పూర్తిగా చెడిపోవడం జరిగింది. కాబట్టి దాని చుట్టుపక్కల కూడా వాటి ప్రభావం ఉంటుంది. అలాగే ట్యూమర్ల వ్యాధిని కూడా నియంత్రించాలి. ఇందుకు పరిస్థితిని బట్టి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందే కీమోథెరపీ లేదా రేడియోథెరపీలు చేసి కాలేయానికి ఉన్న ట్యూమర్లను పూర్తిగా తొలగించి, వాటిని నిర్వీర్యం చేస్తారు. దాంతో పేషెంట్ శరీరం కాలేయ మార్పిడి చేసే పరిస్థితికి చేరుకుంటుంది. అప్పుడు శస్త్రచికిత్స నిర్వహించి రోగికి మ్యాచ్ అయిన లివర్‌ను అమర్చడం జరుగుతుంది. లివర్ లభ్యత రెండు విధానాలుగా ఉంటుంది. ఒకటి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్‌గ్రూప్‌నకు సరిపోలిన వారు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘లైవ్ డోనార్’ అని అంటారు. ఇది సురక్షితమైన విధానం. రెండోది ‘కెడావర్ డోనార్’ అంటారు. దీనికి దాతలపై ఆధారపడాల్సి వస్తుంది. అది లభించినప్పుడు డాక్టర్లు సర్జరీని నిర్వహిస్తారు. ఆలస్యం చేయకుండా ముందుగా మీరు నిపుణులైన వైద్యుడిని సంప్రదించి లివర్ ఏ స్టేజ్‌లో ఉందో పరీక్షల ద్వారా తెలుసుకొని వెంటనే తగిన చికిత్సను పొందండి.
డాక్టర్ బాలచంద్రమీనన్
చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్.
ఇంకా పక్క తడుపుతున్నాడు..!
Published Tue, Jul 12 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement
Advertisement