తరచూ రక్తస్రావం..?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాను. నిద్ర కూడా తక్కువగా ఉంటుంది. మలద్వారం దగ్గర ఒక్కోసారి చీము రక్తం కనిపిస్తోంది. దీనికి పరిష్కారం చెప్పండి. - సురేశ్ కుమార్, జగ్గయ్యపేట
మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మలబద్దకం సమస్యలకు ముఖ్యకారణం పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనవచ్చు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఇటీవల ప్రతి ఐదుగురిలో ఒకరికి మలద్వార సమస్యలు వస్తున్నాయి. ఫిస్టులా అంటే రెండు వైపులా రంధ్రం ఉన్న నాళం వంటిది అని అర్థం. ఇందులో ఫిస్టులా కూడా ఒకటి. మలవిసర్జన మార్గంలో ఏర్పడే ఫిస్టులాలు బయటి వైపునకు ఒక చిన్న కురుపులా కనిపిస్తుంటాయి. కానీ లోపలి నుంచి ఒక నాళం పెరుగుతూపోయి లోపలి పేగుకు ఒక రంధ్రం ఏర్పడుతుంది. దీన్ని ఫిస్టులా అంటారు. ఇది ఎక్కువగా ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. పిరుదల మధ్య మలద్వారానికి పక్కగా ఏర్పడుతుంది.
ఫిస్టులా అనేది మానవ శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ సాధారణంగా ఏర్పడే ఫిస్టులాలలో ‘యానల్ ఫిస్టులా’ ఒకటి. ఇది మలద్వారంలోకి తెరచుకోవడం వల్ల అందులో నుంచి మలం రావడాన్ని ‘ఫిస్టులా ఇన్ యానో’ అంటారు. ఫిస్టులా సంవత్సరాలకొద్దీ నొప్పితో బాధిస్తుంది. వారి బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ చేయించుకున్నా మరల తిరగబెట్టడం వాళ్లకు ఆందోళన కలిగిస్తుంది. వారికి హోమియో వైద్యం ఒక వరం లాంటిది.
కారణాలు : ఇన్ఫెక్షన్ వల్ల మలద్వారం వద్ద ఉన్న యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ కావడం, మలద్వారం వద్ద సరైన శుభ్రత పాటించకపోవడం. ఊబకాయం, గంటల తరబడి కదలిక లేకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో కనిపిస్తుంది. దురద, మంట, నొప్పి ఉండటం దుర్వాసన కలగడం మలవిసర్జన మార్గం నుంచి చీము, రక్తస్రావం కావడం.
వ్యాధి నిర్ధారణ : సిబీపీ, ఈఎస్‌ఆర్, ఫిస్టులోగ్రామ్
చికిత్స : ఫిస్టులాకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. దీనికి హోమియోపతి వైద్యం వరం లాంటిది. ఇది పూర్తిగా మూలానికి చికిత్స చేస్తూ, ఆపరేషన్ అవసరం లేకుండా చాలావరకు నయం చేస్తుంది. దీనికి కాస్టికమ్, నైట్రిక్ యాసిడ్, కాంథరిస్ వంటి మందులు ఉపయోగించవచ్చు. అయితే రోగి లక్షణాల ఆధారంగా అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వీటిని వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్
చీదినప్పుడల్లా సమస్య..!
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాపకు ఎనిమిదేళ్లు. టూ వీలర్ మీద వెళ్లే సమయంలో వర్షంలో తడిసింది. అప్పుడు జలుబు చేసింది. ముక్కు చీదినప్పుడు రక్తం బయటకు వచ్చింది. తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే జలుబు చేసిన సమయంలో గట్టిగా చీదడం వల్ల రక్తం వచ్చిందని చెప్పారు. మందులు ఇచ్చారు. వాడాం. అయితే మళ్లీ ఒకసారి పాప ముక్కు నుంచి రక్తం వచ్చింది. మాకు చాలా భయంగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. - గౌతమి, ఖమ్మం
మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎపిస్టాక్సిస్ అంటారు. పిల్లలకు ముక్కు నుంచి రక్తస్రావం కావడం చాలా తరచుగా చూస్తుంటాం. ఇది చాలా సాధారణం. మూడు నుంచి పదేళ్ల పిల్లల్లో మరీ సాధారణం. నిజానికి మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో ఒక్కసారైనా ముక్కునుంచి రక్తస్రావం అవుతుండటం చూస్తూనే ఉంటాం. తీవ్రతను బట్టి ఈ సమస్యను మైల్డ్ అండ్ సివియర్ అని వర్గీకరించవచ్చు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు మైల్డ్ అండ్ రికరెంట్ ఎపిస్టాక్సిస్ అని చెప్పవచ్చు.
పిల్లల్లో ఎటోపిక్ రైనైటిస్, అడినాయిడ్స్, నేసల్ డిఫ్తీరియా, ఫారిన్‌బాడీ ఇన్ నోస్, ముక్కుకు దెబ్బతగలడం, రక్తం గడ్డకట్టడంలో సమస్యలు, ముక్కు క్యాన్సర్ వంటి అనేక సందర్భాల్లో రక్తస్రావం అవుతుంది. అయితే మనం రొటీన్‌గా చూసే ఎపిస్టాక్సిక్‌ని ప్రేరేపించే కారణాలలో... వేడిగా, పొడిగా ఉండే వాతావరణం, చల్లటి వాతావరణం, గట్టిగా చీదడం, ముక్కులో వేళ్లు పెట్టి లాగడం వంటివి కొన్ని.
ఇలాంటి పిల్లలకు ఎక్స్-రేస్ ఆఫ్ ప్యారానేసల్ సైనసెస్, సీబీపీ, క్లాటింగ్ అండ్ బ్లీడింగ్ టైమ్, ప్లేట్‌లెట్ కౌంట్ అండ్ కోయాగ్యులేషన్ స్టడీస్‌తో పాటు సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సీటీ స్కాన్, యాంజియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించాలి. వీటి వల్ల బ్లీడింగ్‌కు కారణాలు, నిర్దిష్టంగా ఎక్కడినుంచి రక్తస్రావం అవుతోంది అన్న విషయాలు తెలుసుకోడానికి వీలవుతుంది.
ప్రథమ చికిత్స :
1) పిల్లల్లో ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు ఆందోళన చెందకూడదు. పిల్లలకు ధైర్యం చెప్పి, సౌకర్యంగా ఉండేలా వాళ్లను కూర్చోబెట్టాలి.
2) ముందుకు ఒంగేలా చూసి, నోటితో గాలిపీల్చుకొమ్మని చెప్పాలి.
3) ముక్కుచివరి భాగాన్ని (ముక్కు రంధ్రాలపైన) బొటనవేలు, చూపుడువేలు సాయంతో కాసేపు నొక్కి పట్టి ఉంచాలి.
4) ముక్కుపైన ఐస్‌ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ఉంచాలి.
పైన చెప్పిన చిన్నపాటి చర్యలతో రక్తస్రావం ఆగిపోతుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో రక్తస్రావం అవుతూనే ఉంటే తక్షణం ఈఎన్‌టీ నిపుణులను కలవడం తప్పనిసరి.
నివారణ :
1) ముక్కు రంధ్రాల లోపలి భాగంలో వ్యాసలైన్ రాయాలి.
2) అలర్జీ ఉన్నవారికి క్రమం తప్పకుండా నేసల్ సెలైన్ డ్రాప్స్ వేయాలి.
3) పిల్లలకు గోళ్లు కత్తిరిస్తూ ఉండాలి. వాళ్లు ముక్కులో వేళ్లు పెట్టుకుని గిల్లుకోకుండా చూడాలి.
4) వాళ్లు గట్టిగా ముక్కు చీదకుండా చూడాలి.
ఇక మీరు చెప్పిన అంశాలను బట్టి ఇది అలర్జీకి సంబంధించిన సమస్యగా అనిపిస్తోంది. కాబట్టి పైన పేర్కొన్న చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూనే మీరొకసారి ఈఎన్‌టీ నిపుణులను కలిసి తగు సలహా, చికిత్స తీసుకోండి.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్