మా బాబు వయసు తొమ్మిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది.
మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానీ యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా?
నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్‌ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12–14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి.
తరతూ మూత్రంలో మంట... ఎలా తగ్గుతుంది?
నా వయసు 36 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు) తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్‌కు చూపించుకోండి.
మూత్రం ఎర్రగా వస్తోంది? భవిష్యత్తులో సమస్యా?
నాకు 34 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా?
మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది.
డయాలసిస్ తర్వాత చర్మంపై దురద... ఏం చేయాలి?
నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి?
డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment