హైపర్ అసిడిటీ తగ్గుతుందా?
నా వయసు 35 ఏళ్లు. ఉద్యోగరీత్యా మార్కెటింగ్ జాబ్‌లో ఉన్నాను. తరచూ ప్రయాణాలు చేస్తుంటాను. కడుపులో నొప్పి, వికారంగా ఉంటున్నాయి. సమయానికి భోజనం తీసుకోకపోతే బాధ పెరిగిపోతోంది. తీసుకున్న తర్వాత పుల్లటి లాలాజలం ఊరుతూ ఉంటుంది. హోమియోలో ఏదైనా పరిష్కారం చెప్పండి.
– రమేశ్, ఏలూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు హైపర్ అసిడిటీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మనం ఆహారం వేళకు తీసుకోనప్పుడు పైన మీరు చెప్పిన లక్షణాలతో పాటు అజీర్తి, ఛాతీలో మంట వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుంది. హైపర్ అసిడిటీ అన్నది సాధారణంగా మన కడుపులో యాసిడ్ ఎక్కువగా స్రవించడం వల్ల వస్తుంటుంది. మన కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదల వల్ల మనకు స్టమక్ అల్సర్స్, యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్, స్టమక్ క్యాన్సర్ వంటివి కూడా కనిపించే అవకాశం ఉన్నా ఇంత తీవ్రతతో కనిపించే పై వ్యాధులు కాస్త అరుదుగా వస్తాయి.
కారణాలు:
మానసిక ఒత్తిడి
ఎక్కువగా టీ, కాఫీలు తాగడం
నిద్రలేమి
స్థూలకాయం
ఎక్కువగా మసాలాలు తీసుకోవడం
జంక్‌ఫుడ్, ఆల్కహాల్
అధిక ఆందోళన
ఎక్కువ మోతాదులో కారం, మిర్చి తీసుకోవడం వల్ల
శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల లక్షణాలు:
ఛాతీలో, గొంతులో మంట
కడుపునొప్పి
తేన్పులు
చెమటలు పట్టడం
కోపం, చిరాకు
విరేచనాలు
నీరసం
అధిక దాహం ఔ
ఆయాసం
వ్యాధి నిర్ధారణ: ఎక్స్–రే
రక్తపరీక్షలు మూత్ర పరీక్ష
ఎండోస్కోపీ
అల్ట్రాసౌండ్ స్కానింగ్
జాగ్రత్తలు: స్వచ్ఛమైన, శుద్ధమైన ఆహారం సరైన సమయానికి తీసుకోవడం n అతిగా నూనె, మసాలా పదార్థాలు తీసుకోకుండా ఉండటం
చికిత్స: హైపర్ అసిడిటీ సమస్యకు హోమియోలో అద్భుతమైన పరిష్కారం ఉంది. శరీర తత్వాన్ని బట్టి, కారణాలను బట్టి కాలేయ జీర్ణకోశాలను సరిచేస్తూ హైపర్ అసిడిటీకి మంచి మందులను వైద్యులు సూచిస్తారు. హోమియోలో నక్స్‌వామికా, యాసిడ్ సల్ఫ్, చైనా, లైకోపోడియమ్, పల్సటిల్లా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.