హోమియోపతి కౌన్సెలింగ్ | Homeopathy counseling | Sakshi
Sakshi News home page

హోమియోపతి కౌన్సెలింగ్

Published Wed, Jul 15 2015 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

Homeopathy counseling

వెన్నునొప్పికి సర్జరీనే మార్గమా?
 
నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియో ప్రక్రియలో చికిత్స ఉందా? దయచేసి వివరించగలరు.
 - సుమన్, బాలాపూర్

 ఇటీవల వెన్నునొప్పి ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన  సమస్య. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా కొందరు పేషెంట్లలో ఉంటుంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి సవ్తుంటుంది. అయితే హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పిలకు ఆస్క్కులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి.
 
 డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
 ఎండీ (హోమియో),
 స్టార్ హోమియోపతి, హైదరాబాద్
 

ఆస్తమా తగ్గదంటారు.. నిజమేనా..!?
 
నా వయసు 48. గత పాతికేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. రకరకాల మందులు వాడాను. అయితే ఆస్తమా వచ్చినప్పుడు ఆయాసం తగ్గడానికి వాడే మందులు తప్ప... శాశ్వత పరిష్కారం ఉండదని చెబుతున్నారు. నిజమేనా? హోమియోలో ఏదైనా పరిష్కారం ఉందేమో చెప్పండి.
 - యాదయ్య, భువనగిరి

 ఆస్తమా అనేది సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. మన ముక్కులోకి, ఊపిరితిత్తుల్లోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మపదార్థాలు (అలర్జెన్స్) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు, వాటికి ప్రతిచర్యగా మన శరీరం స్పందించి, వివిధ రకాల రసాయనాలు విడుదల చేసి, శ్వాసనాళాలలో శ్లేష్మపొర వాపునకు గురిచేస్తాయి. దీనివల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయి, ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. దగ్గు, ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ఆస్తమా లేదా ఉబ్బసం అంటారు.
 ఆస్తమా లక్షణాలు : శ్వాసనాళాలు సంకోచించడం వల్ల గాలి రవాణాకు ఆటంకం కలిగి ఆయాసం, దగ్గు వస్తాయి. ఛాతీ బరువుగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, పిల్లికూతలు ప్రధాన లక్షణాలు. పిల్లల్లో ఈ లక్షణాలతో పాటు రాత్రివేళ దగ్గు, పిల్లికూతలు, పగలు పరుగెత్తినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయాసపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 ఆస్తమాకు కారణాలు : వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనలు, పెంపుడు జంతువులూ వాటి వెంట్రుకలు, మస్కిటో రిపెల్లెంట్స్, రకరకాల స్ప్రేలు, విసర్జకాలు, పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్స్, జన్యుసంబంధమైన కారణాలు... ఉబ్బసం రావడానికి గల కారణాలలో కొన్ని.

నిర్ధారణ : సీబీపీ, ఈఎస్‌ఆర్, అబ్‌సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్, ఎక్స్‌రే (చెస్ట్), సీటీ స్కాన్, స్పైరోమెట్రీ, పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ మొదలైన వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను నిర్ధారణ చేయవచ్చు.

నివారణ మార్గాలు :  దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి  శీతలపానియాలు, ఐస్‌క్రీమ్స్ తీసుకోకూడదు  పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి  ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడికి దూరంగా ఉండాలి.  
 ఆస్తమా ఎప్పటికీ తగ్గదని చాలామంది భావన. కానీ అందులో నిజంలేదు. హోమియో ప్రక్రియలో ఆస్తమాను పూర్తిగా తగ్గించే మందులు అందుబాటులో ఉన్నాయి. మీరు నిపుణులైన హోమియోవైద్యులను కలిసి, తగు జాగ్రత్తలతో మందులు వాడితే ఆస్తమా పూర్తిగా తగ్గిపోతుంది.
 
 డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
 చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్,
 హైదరాబాద్
 
థైరాయిడ్ సమస్యల నుంచి విముక్తి ఎలా?
నా వయసు 56. పిల్లల చదువులు పూర్తయి వారు స్థిరపడ్డాక పదేళ్ల క్రితం నగరానికి వచ్చాను. అప్పట్నుంచి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నాను. మా పిల్లలు చిన్నవారైనప్పటికీ వారిలోనూ ఇదే సమస్య ఉన్నట్లు ఇటీవలే తెలిసింది. థైరాయిడ్ సంబంధిత సమస్యలు తగ్గేందుకు మార్గాలు చెప్పండి.
 - అనసూయబాయి, హైదరాబాద్

మీరు చెప్పినట్లుగా ఇటీవల నగరాలలో థైరాయిడ్ సమస్యలు రావడం పెరుగుతోంది. నగరాలలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు ఒక రకంగా థైరాయిడ్ సమస్యలకు కారణం అని చెప్పవచ్చు. థైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర ఉండే కీలకమైన గ్రంథి. ఇది స్రవించే హార్మోన్‌లు మానసిక ఆలోచనలపై ప్రభావం చూపేవిగా ఉంటాయి. ఈ గ్రంథి టీ4, టీ3, టీఎస్‌హెచ్ హార్మోన్లను స్రవిస్తుంది. సున్నిత మనస్తత్వం కలవారు, ప్రతి చిన్న విషయాన్నీ మనసుపైకి తీసుకునేవారిలో ఈ గ్రంథి స్రవించే హార్మోన్ సమతౌల్యత దెబ్బతింటుంది. టీహెచ్‌ఎస్ ఎక్కువ అవడం వల్ల అతిగా బరువు పెరగడం, అతి ఆలోచన, అతి బద్దకం, మతిమరపు, అదినిద్ర వచ్చే అవకాశం ఉంది. మా వద్ద నిర్వహించిన పరిశోధనల ప్రకారం స్త్రీలలో థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. మా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... స్త్రీలలో రుతుస్రావ సమస్యలు, గర్భం రాకుండా ఉండేందుకు వాడే మందులు, పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు వాడే మందుల వల్ల థైరాయిడ్‌పై దుష్ర్పభావాలు పడి, దానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మందులు వాడటం వల్ల ప్రతి 100లోనూ 50 మంది థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం... గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే మహిళల్లో వచ్చే అనారోగ్య సమస్యల వల్లనే అని తేలింది. దీనికి బదులు ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిది నెలల పాటు హోమియోపతి మందులు వాడితే పిల్లల్లోనూ సమస్యలు రాకుండా నివారించవచ్చు. తల్లిదండ్రులకు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలలోనూ ఆ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమిటంటే థైరాయిడ్ సమస్యలన్నీ ఒకేలా ఉండవు. హార్మోన్ స్రావం పెరిగితే ఒకలా, తగ్గితే మరొకలా, నాడ్యూల్స్ వస్తే ఇంకోలా లక్షణాలు కనిపిస్తాయి. హోమియోలో ఈ లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. ఉదాహరణకు...
 ఆర్సినిక్ ఆల్బ్: హైపోథైరాయిడిజమ్‌లో కనిపించే నిద్రలేమి, ఎవరినీ నమ్మకపోవడం, ఆలోచనలు  అస్థిమితంగా ఉండటం, అతి ఆందోళన వంటివాటికి ఈ మందు బాగా పనిచేస్తుంది.

కాల్కేరియా కార్బ్: ఇది కూడా హైపోథైరాయిడిజమ్‌లో లక్షణాలతో పాటు చిన్నపిల్లల మనస్తత్వం, గుర్తింపుకోసం తహతహ, అసూయ వంటి లక్షణాలున్నవారికి.
ఓపియమ్ : అతినిద్ర, గురకపెట్టడం, ప్రతివిషయాన్ని అశ్రద్ధ చేయడం, అతిచురుకు లక్షణాలున్నవారికి ఈ మందు.
నేట్రమ్‌మ్యూర్ : అతిగా స్పందించడం, అసంతృప్తి, అతి ఆలోచన వంటి లక్షణాలకు ఈ మందు. ఇలా అన్నిరకాల థైరాయిడ్ సమస్యలకు హోమియోలో మంచి మందులు ఉన్నాయి.
 
 డాక్టర్ ఎ.ఎమ్.రెడ్డి,
 పాజిటివ్ హోమియోపతి
 హైదరాబాద్
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement