బాబుకు ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్... ఏం చేయాలి? | How to control Interstitial Lung Disease | Sakshi
Sakshi News home page

బాబుకు ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్... ఏం చేయాలి?

Published Thu, Sep 26 2013 12:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM

బాబుకు ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్... ఏం చేయాలి?

బాబుకు ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్... ఏం చేయాలి?

మా బాబుకు ఏడేళ్లు. అతడికి రెండున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. దాంతో స్పెషాలిటీ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లాం. చాలారోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇంటస్ట్టీషియల్ లంగ్ డిసీజ్ అని చెప్పారు. అప్పట్నుంచి వాడికి సమస్య వచ్చినప్పుడు తీవ్రంగా ఆయాసపడుతూ డొక్కలెగరేస్తూన్నాడు. ఇలా సమస్య వచ్చినప్పుడల్లా అక్కడికే తీసుకెళ్తున్నాం. వారు అక్కడ స్టెరాయిడ్స్‌తో చికిత్స చేసి, మెరుగుపడ్డ తర్వాత డిశ్చార్జి చేస్తున్నారు. ప్రతి నెలా తీసుకెళ్లి చూపిస్తున్నాం. గతేడాది పరిస్థితి బాగానే ఉండటంతో ఈ నెలలో ఫాలో అప్‌కు తీసుకెళ్లడంలో కాస్త ఆలస్యం అయ్యింది. దాంతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వెంటవెంటనే జబ్బు తిరగబెట్టింది. మా వాడి సమస్యకు పరిష్కారం ఏమిటి?  మాకు తగిన సలహా ఇవ్వండి.
 - ఎ.పి. సురేశ్ కుమార్, చిత్తూరు

 
మీరు వివరించిన దాన్ని బట్టి మీ అబ్బాయికి ఛైల్డ్‌హుడ్ ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఇది ఊపిరితిత్తులలోని రెండు వైపుల భాగాలతో పాటు దానిలోని అన్ని ముఖ్యమైన భాగాలనూ అంటే... అల్వియోలై, ఇంటస్ట్టీషియమ్ మొదలైన వాటన్నింటినీ ప్రభావితం చేస్తుంది. దీన్ని ఒక జబ్బుగా పేర్కొనడం కంటే దానికి సంభవించిన ఏదో ఒక నష్టం (ఇన్‌సల్ట్) వల్ల ఊపిరితిత్తులకు చెందిన స్వరూపంలోనే వచ్చే మార్పుగా చెప్పడం సరైనదిగా పేర్కొనవచ్చు. దాని ఫలితంగానే లక్షణాలు  బయటకు కనిపిస్తాయి.
 
చాలామంది పిల్లల్లో లక్షణాలు బయటపడినప్పుడు వాటిని బట్టి ఇది నిర్దిష్టంగా ఫలానా కారణంగా అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అనంతర పరిణామం (పోస్ట్ ఇన్ఫెక్షియస్)గా ఇది కనిపించడంతో పాటు కొన్నిసార్లు బయటి నుంచి అవాంఛితమైన పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం (ఆస్పిరేషన్) వల్ల ఇది రావచ్చు. (అంటే ఏదైనా తింటున్నప్పుడు ఆహారపదార్థపు ముక్కల వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం లాంటివి).
 
 కారణాలు : అవాంఛితమైన పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం, ఇన్ఫెక్షన్స్, వాతావరణంలోని మార్పులు, మందులు, నియోప్లాస్మిక్ కండిషన్స్ (క్యాన్సర్ సంబంధిత అంశాలు), సర్ఫెక్టెంట్ అనే అంశంలో లోపాలు ఉండటం, కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్, దీర్ఘకాలిక కిడ్నీ, లివర్, పేగు సంబంధిత వ్యాధులు మొదలైనవన్నీ ఇంటస్ట్టీషియల్ లంగ్ డిసీజ్‌కు కారణాలు. ఈ జబ్బు ఏ వయసులోనైనా రావచ్చు.
 
 లక్షణాలు : దగ్గు, ఊపిరి బలంగా, ఎక్కువసార్లు తీసుకోవడం... ఈ లక్షణాలు  నెల కంటే ఎక్కువ రోజులు కనిపించడం, కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బు ఉన్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ), ఎదుగుదలలో లోపం, చిన్నారుల శరీరం నీలంగా మారడం (సైనోసిస్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్‌ను నిర్ధారణ (డయాగ్నోజ్) చేయడానికి లక్షణాలతో పాటు సవివరమైన వైద్య పరీక్షలు అవసరం. ప్రత్యేక స్కోరింగ్ సిస్టమ్ ద్వారా ఈ రోగుల వ్యాధి తీవ్రతను గ్రేడింగ్ చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. పైన పేర్కొన్న లక్షణాలున్న ప్రతివారికీ అది ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మరికొన్ని వ్యాధుల్లో... అంటే ఉదాహరణకు కొన్ని రకాల గుండెజబ్బులు, ఆస్తమా, టీబీ, కొన్ని వ్యాధినివారణ శక్తి లోపించిన సందర్భాలు (ఇమ్యునలాజికల్ లోపాలు), సీలియరీ డిస్కనేసియా వంటి జబ్బులు కూడా పైన పేర్కొన్న లక్షణాలతోనే కనిపించవచ్చు.

అందుకే ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ నిర్ధారణ చేయడానికి పూర్తిస్థాయి రొటీన్ పరీక్షలు, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రత్యేక పరీక్షలు (అంటే హెచ్‌ఆర్‌సీటీ, పీఎఫ్‌టీ, శాచ్యురేషన్ ఎస్‌ఏఓ-టు),  అలర్జీకి సంబంధించిన పరీక్షలతో పాటు లంగ్ బయాప్సీ, బ్రాంకోస్కోపీ పరీక్షలను తప్పనిసరిగా చేయాలి. అలాగే కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు తెలుసుకోవడానికి డీఎన్‌ఏ మ్యూటేషన్ పరీక్షల వంటి జెనెటిక్ పరీక్షలు చేయించాలి. వీటన్నింటి వల్ల ఊపిరితిత్తుల్లో వచ్చిన మార్పులను బట్టి అది ఏ ఉపవర్గానికి (సబ్‌టైప్‌కు) చెందినదో తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఇది ఏ మేరకు నయమవుతుందో తెలుసుకోడానికి (ప్రోగ్నోసిస్‌కు) ఇది చాలా ముఖ్యం.
 
 ఇక మీ బాబు విషయంలో అది ఇన్ఫెక్షన్ అనంతర (పోస్ట్ ఇన్ఫెక్షియస్) పరిణామంగా వచ్చి ఉండవచ్చు. మీ అబ్బాయి విషయంలో ఒక మంచి పరిణామం ఏమిటంటే అతడికి ఆక్సిజన్ ఇవ్వడం వల్ల, కొద్దిపాటి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల మెరుగుదల కనిపిస్తోందని మీరు చెప్పారు. అది మీ అబ్బాయి కండిషన్‌కు మెరుగుదల విషయంలో మంచి సూచన. ఇక ఈ జబ్బు ఎందుకు వస్తోందని నిర్ధారణ చేయడం అన్నది చాలా ప్రత్యేకమైన పెద్ద సెంటర్ల  (స్పెషలైజ్‌డ్ లంగ్ సెంటర్స్) లో మాత్రమే సాధ్యపడుతుంది. ఇది తెలుసుకోవడం ఎందుకంటే... ఈ జబ్బు విషయంలో కారణాలను బట్టే చికిత్స ఆధారపడుతుంది. ఆక్సిజన్ ఇవ్వడం, పల్స్ మిథైల్ ప్రెడ్నిసలోన్ థెరపీ అన్నవి ఈ చికిత్సలో చాలా ప్రధానం. ఇక కారణం తెలియని పరిస్థితుల్లో ఇమ్యునోసప్రెస్సెంట్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్ వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో కొన్ని కేసుల్లో పేషెంట్స్ సుదీర్ఘకాలం పాటు కేవలం ఆక్సిజన్ మీద ఉండటం వల్ల కూడా మెరుగుదల కనిపించిన దాఖలాలు ఉన్నాయి. మందులతో ఎలాంటి ప్రయోజనం కనిపించని సందర్భాల్లోనూ, బయటి నుంచి ఇవ్వాల్సిన ఆక్సిజన్ ఎక్కువగా ఇవ్వాల్సివస్తున్న పరిస్థితుల్లో  మాత్రం ‘ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స’ గురించి ఆలోచించాల్సి ఉంటుంది.
 
 మీరు పైన పేర్కొన్న విధానంలో వైద్య చికిత్స చేయిస్తూ అలర్జీకి కారణమయ్యే అంశాల (అలర్జెన్స్) నుంచి పిల్లవాడిని దూరంగా ఉంచుతూ, ఎవరైనా పొగతాగుతుంటే ఆ పొగ (పాసివ్ స్మోకింగ్) నుంచి  కూడా దూరంగా ఉంచుతూ, పిల్లవాడిలో ఎలాంటి మార్పులు కనిపించినా తక్షణం వైద్యసహాయం కోసం తీసుకెళ్తూ, పల్మునరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ వంటి దుష్ర్పభావాలు కనిపిస్తే దానికి తగిన చికిత్స చేయిస్తూ ఉండటం ఈ పిల్లల విషయంలో చాలా అవసరం. పల్మునాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఇమ్యునాలజిస్ట్‌ల పర్యవేక్షణలో ఉంచడం కూడా చాలా అవసరం. దీనికి ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏదీ లేదు. అయితే పుష్టికరమైన ప్రోటీన్‌లు, క్యాలరీలతో కూడిన ఆహారం ఇవ్వడం మాత్రం అవసరం. ఇక అతడి దినచర్యల విషయానికి వస్తే అతడు సౌకర్యంగా ఉండేలా చూడటం ముఖ్యం. ఇక ఈ జబ్బు ఉన్న పెద్ద పిల్లలకు నిపుణుల పర్యవేక్షణలో కొన్ని వ్యాయామ విధానాలు (మానిటర్‌డ్ ఎక్సర్‌సైజ్ ప్రోగ్రామ్స్) ఇతరత్రా సాధారణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీళ్లలో క్రమం తప్పకుండా ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయులు పరిశీలిస్తూ ఉండాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది.
 
 పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని మీరు నిత్యం ఒక పీడియాట్రిక్ లంగ్ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో మాత్రమే చికిత్స తీసుకుంటూ వారి ఫాలోఅప్‌లో ఉండటం చాలా ముఖ్యం.


 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement