ఖర్చు లేకుండానే వ్యాయామం చేయడం ఎలా..?
నాకు జిమ్‌లో చేరేంత ఆర్థిక స్తోమత లేదు. కానీ వ్యాయామం చేయాలనే ఆసక్తి ఉంది. నేను పెద్దగా ఖర్చు పెట్టకుండానే చేసుకోగలిగే వ్యాయామాలను సూచించండి.
- జీవన్, జగ్గయ్యపేట
వ్యాయామం చేయాలనే ఆసక్తి ఉంటే చాలు... దీనికి జిమ్‌లో చేరాల్సిన అవసరమే లేదు. మన బరువు ఆధారంగానే చేయదగ్గ వ్యాయామాలు, మనం నిత్యం ఉపయోగించే అనేక రకాల వస్తువులతోనే చేయదగ్గ ఎక్సర్‌సైజ్‌లతో జిమ్‌లో వ్యాయామం చేసిన ఫలితాలు పొందవచ్చు. దీనికి కావాల్సిందల్లా సంకల్పబలం. వ్యాయామం చేయడంలో క్రమం తప్పనివ్వకపోవడం (రెగ్యులారిటీ).
మీరు రోజూ బ్రిస్క్ వాకింగ్ లేదా స్లో జాగింగ్ చేయాలనుకుంటే దీనికి ఎలాంటి ఖర్చూ అవసరం లేదు. అలాగే మీ బరువు ఆధారంగా చేసే వ్యాయామాలు... ఉదాహరణకు దండీలు, బస్కీల వంటివి చేయవచ్చు. మీకు వీలుకాకపోతే వీటికోసం గ్రౌండ్‌కు వెళ్లాల్సిన పని కూడా లేదు. మీ ఇంట్లోనే చేయవచ్చు. రన్నింగ్, స్లోజాగింగ్‌ను ఒక చోట స్థిరంగా నిలబడి కూడా (అక్కడికక్కడే పరుగెత్తుతున్నట్లుగా కాళ్లు కదిలిస్తూ) చేయవచ్చు. మీరు మొదట వాకింగ్ లేదా స్లో రన్నింగ్/జాగింగ్‌ను ప్రారంభిస్తే... మొదట 20 నిమిషాల నుంచి మొదలుపెట్టి... ఆ తర్వాత క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతూ... 90 నిమిషాల వరకు చేయవచ్చు. అలాగే మీ బరువు 85 కిలోలకు పైన ఉంటే వాకింగ్/జాగింగ్ కాకుండా సైక్లింగ్ చేయవచ్చు. ఇక ఈ సైక్లింగ్ కోసం మీరు ప్రత్యేకంగా సైకిల్ కొనాల్సిన అవసరం లేదు. మీరు రోజూ ఉపయోగించే సైకిల్‌తో కూడా వ్యాయామపు సైకిల్ ప్రయోజనాలే దక్కుతాయి.
ఇక మీ బరువును ఆసరాగా చేసుకుని చేసే వ్యాయామాలైన దండీలు, బస్కీలతో పాటు ఒక చోట వేలాడుతూ, శరీరాన్ని పైకి లేపుతూ చేసే చినప్ ఎక్సర్‌సైజ్‌ల వంటివి చేయవచ్చు. మీ ఇంట్లో ఉండే వాటర్‌బాటిల్ సహాయంతో డంబెల్ ఎక్సర్‌సైజ్‌లను చేయవచ్చు. మీకు మోకాళ్లలో ఎలాంటి నొప్పులూ లేకపోతే మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు చేయవచ్చు. ఒకవేళ డాబా లేని కారణంగా మెట్లు లేకపోతే... మీ ఇంటి ఒకే మెట్టుపైకి మాటిమాటికీ ఎక్కుతూ కూడా మెట్లు ఎక్కే వ్యాయామం రిపిటీషన్స్‌ను ఎన్నైనా చేయవచ్చు. ఇవన్నీ వ్యాయామ రీతులు.
ఇక ఇంటి పనుల విషయానికి వస్తే... మొక్కలకు నీళ్లు పోయడం, నీళ్లు తోడటం వంటి పనులు చేయవచ్చు. మీరు ఆఫీసుకు బైక్ మీద వెళ్లే వారైతే... దానికి బదులు సైకిల్ వాడటం లేదా ఇంటి దగ్గరే ఉన్న కిరాణా షాప్ వంటి చోట్లకు నడుచుకుంటూ వెళ్లి, సామాన్లు మోసుకురావడం వంటివి కూడా వ్యాయామంగానే పరిగణించవచ్చు. ఈ తరహా వ్యాయామాలకు ఎలాంటి ఖర్చూ అవసరం లేదు.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్