బయటపడండి! | how to manage Depression says some celebrities | Sakshi
Sakshi News home page

బయటపడండి!

Published Thu, Apr 6 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

బయటపడండి!

బయటపడండి!

ఈ రోజు వరల్డ్‌ హెల్త్‌ డే. రెండు రోజుల క్రితం... సిరియాలో ‘కెమికల్‌ ఎటాక్‌’ వల్ల చనిపోయిన పిల్లల బొమ్మలు చూసి, మనందరం కుంగిపోయాం. ఇంకొన్ని నెలల క్రితం సిరియా నుంచి శరణార్థులుగా వెళ్లిపోతున్న వారిలోంచి సముద్రంలో మునిగిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చిన చిన్న పిల్లాడిని చూసి హతాశులమయ్యాం. ఇలాంటి సన్నివేశాలు మనల్ని కుంగదీస్తాయి. ఆ క్షణం లేదా ఆ రోజు జీవితం మీద విరక్తి కలుగుతుంది. అన్నం సహించదు... వికారంగా అనిపిస్తుంది. అసలు జీవించి ఉండాలా అన్న ప్రశ్న వెంటాడుతుంది.ఇవన్నీ బాహ్య ప్రపంచం మనపై చూపించే ప్రభావాలు.  ఈ ప్రపంచం కాకుండా ఇంకో ప్రపంచం మనకు తెలుసు. అది ‘మన’లోని ప్రపంచం. అక్కడా బీభత్సాలు జరుగుతాయి.అక్కడా దాడులు జరుగుతాయి.

అక్కడా మనోభావాలు దెబ్బతింటాయి. అక్కడా మనోస్థైర్యంపై బాంబులు పేలుతాయి. ఈ యుద్ధం మనలో రేగేదే. దాన్ని చల్లార్చే శక్తి... మనలో పుట్టాల్సిందే. సమాజంలో అదృష్టవంతుల్లా కనపడే సెలిబ్రిటీల జీవితాల్లోనూ ఈ కుంగుబాటు తప్పలేదు. మామూలు మనుషుల జీవితాల్లో కూడా... కొన్ని పేజీలు డిప్రెషన్‌ బారిన పడుతుంటాయి. బయటపడిన వారి పోరాట పటిమ నాలుగు పుటలు చదివితే డిప్రెషన్‌ నుంచి బయటపడే ధైర్యం తెచ్చుకోవచ్చు. వరల్డ్‌ హెల్త్‌ డే... ఈ ఏడాది ఉద్దేశం... ‘డిప్రెషన్‌ గురించి మాట్లాడండి’. డిప్రెషన్‌ గురించి సిగ్గుపడే బదులు, భయపడే బదులు... మౌనాన్ని వీడండి... పెదవి విప్పండి! కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులతో మాట్లాడండి. మనసులో మాట బయటపెట్టండి... అలజడిని పారదోలండి! డిప్రెషన్‌ నుంచి బయటపడండి!!


నాకు నేనే సమాధానం!
నాకు 2010లో భుజానికి గాయం అయింది. సాధారణంగా నేను కొంత ఆశావాదినే. కానీ భుజం కదలించ లేని స్థితిలో దానికి సర్జరీ అవసరమైంది. సర్జరీ తర్వాత ఎంతో డిప్రెషన్‌లోకి జారిపోయా. ఎంతగానో నిరాశ, నిస్పృహలలో మునిగిపోయా. ఎప్పటికైనా బయటికి వస్తానా అనే తీవ్ర నైరాశ్యం. కానీ ఎప్పటికప్పుడు నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నా. ఇప్పటి స్థితి కంటే రేపు మరెంతో బాగుంటుందని ధైర్యం చెప్పుకున్నా. అవేవీ వ్యర్థం కాలేదు. నా నిరాశ, నిస్పృహ అంతా గతం. ఇప్పుడు నాలో కొత్త శక్తులు నిండాయి. కొత్త సామర్థ్యం పుంజుకుంది. సంతోషంగా ఉన్నా, పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నా. దృష్టిని పూర్తిగా కెరియర్‌ మీదనే నిలిపా. ఆ తర్వాత కూడా ఎంతగా సక్సెస్‌ అయ్యానో, ఎన్నెన్ని విజయాలు సాధించానో అందరికీ తెలిసిన విషయమే’’
- షారూక్‌ ఖాన్‌

చేదును వదిలించుకున్నా!
‘‘నిజానికి ఆ ఏడాది నేను అత్యంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. ఎన్నో అవార్డులు సాధించిన సంవత్సరం అది. కానీ ఎందుకో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాను. ఒక రోజు పొద్దున్నే లేచి ఎంతో ఏడ్చాను. అలా ఏడుస్తూనే ఉన్నాను. కానీ అలా కుంగిపోతున్నందుకు కారణం ఏదీ కనిపించలేదు. తీవ్రమైన డిప్రెషన్‌ వల్ల అలా జరిగింది. ‘‘అంతా ఒత్తిడి. పని మీద దృష్టి నిలవడం లేదు. ఒక్కసారిగా కుంగిపోయాను. అయితే నా చుట్టూ ఉన్నవారు నా గురించి ఆలోచించారు. చేయూతనిచ్చారు. కానీ నన్నంటుకున్న ఆ చేదు నన్ను వదలడం లేదనిపించింది. నేను లోతుగా శ్వాస తీసుకోలేకపోతున్నాని అనిపించింది. విషాదాన్ని ఒక్కపెట్టున వదిలించుకున్నాను. జీవితాన్ని మళ్లీ కౌగిలించుకున్నాను. డిప్రెషన్‌ నుంచి బయటపడడానికి డాక్టర్‌ను కలిసి మందులు వాడాను. దాంతో నేను త్వరగానే బయటపడ్డాను.నాకు డిప్రెషన్‌ నుంచి బయట పడగలిగాననే సత్యం తెలిసి, ఒక్కరైనా ప్రభావితమైతే చాలు. తమకు తాముగా ఒక్కరు డిప్రెషన్‌ నుంచి బయటపడినా... నేను బయటకు చెప్పుకున్నందుకు ఫలితం దక్కినట్టే.’’
- దీపికా పదుకొనే


వచ్చేదంతా ఫన్‌టైమ్‌!
‘‘ఎందుకలా అయ్యిందో తెలియదు. కానీ వివాహం విషయంలో అందరమ్మాయిలలాగే నేనూ ఆలోచించాను. కానీ ఎంతో దగ్గర అనుకుంటున్న నా మాజీ మిత్రుడు కలలో కూడా ఊహించనంతగా దూరమయ్యాడు. ఆ మిత్రుడే కాదు... ఎందరో స్నేహితులు దూరమయ్యారు. ఇలాంటి వారా నాకు జీవితాంతం అండగా ఉంటానంటూ... ఆ తర్వాత క్షణం కూడా దగ్గర లేకుండా పోయారు. ఎంతటి ఆశాభంగం! మిత్రుత్వం కూడా క్షణభంగురమేనా? కానీ... జీవితంలో కొత్త ఆశలు ఉండాలి కదా. కొత్త మిత్రులూ వస్తారు కదా. కాబట్టి ఏదో పిచ్చిగా ప్రవర్తించే బదులు జీవితాన్ని మరోమారు మళ్లీ ప్రారంభిస్తా. వచ్చేదంతా ‘ఫన్‌ టైమ్‌’ అనుకుంటూ తిరిగి ఆరంభిస్తా. ఇలాంటి విల్‌ పవర్‌ ఉంటే ఎవరైనా, ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోగలరు. ఎలాంటి అవరోధాలనైనా ఈజీగా అధిగమించగలరు. ఒకసారి వ్యాధి బారినుంచి బయటపడ్డ తర్వాత నాకు తెలిసి వచ్చిన సత్యమిది’’.
- మనీషా కొయిరాలా

 తలనొప్పి వంటిదే!
‘‘తమకూ, తమ అభిప్రాయాలకు అనుగుణంగా నన్ను ఉండమంటారు. కానీ వాస్తవ సత్యాలతో ఎవరికీ అవసరం లేదు. దీని గురించి నాకు ఎప్పుడూ నిమిత్తం లేదు. ఒకరేమనుకుంటారో అనే బెంగ లేదు. అయినా ఎందుకో గానీ ఒక  సమయంలో నాకెంతో ఉద్విగ్నత. ఎంతో ఉద్వేగం. నాకెందుకింత యాంగై్జటీ. ఉద్వేగాన్ని వేగంగా వదిలించుకోవాలి. డాక్టర్లు నాకు మందులిస్తున్నారు. నా కుటుంబంలోనూ ఇలా యాంగై్జటీకి గురై చికిత్స తీసుకున్నవారు ఉన్నారు. ప్రపంచంలోనూ ఉంటారు. అవును... డిప్రెషన్‌లోకి వెళ్తే ఏమిటి? కడుపునొప్పి, తలనొప్పి లాగే ఇదీ ఒక సమస్య. చాలా సాధారణమైన బయలాజికల్‌ సమస్య. లాజికల్‌గా బయటపడవచ్చు. అందుకే దీన్ని ఒక ఉద్యమంలా తీసుకుంటా. ఈ మిషన్‌కు నేతృత్వం వహిస్తా. నేను డిప్రెషన్‌లోకి వెళ్లి... బయటపడి తిరిగివచ్చానని అందరితో మాట్లాడుతా. డిప్రెషన్‌ మీద అవగాహన పెంచుతా. నాలాగే బయటపడవచ్చని అందరికీ చెబుతా. అందుకే డిప్రెషన్‌ని అందరూ కడుపునొప్పి, తలనొప్పి అంత తేలిగ్గా  తీసుకోవాలన్నది నా కోరిక’’ - అనుష్క శర్మ

ధైర్యమే గెలిచింది!
డిప్రెషన్‌కు లోనయ్యి... విజయవంతంగా బయటపడిన వాళ్లలో అత్యంత ముఖ్యులు... ప్రఖ్యాత నటుడు అమితాబ్‌ బచ్చన్‌. 1996లో తన ‘ఏబీసీఎల్‌’ కంపెనీ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు...అది లెక్కలు చెప్పలేనంతగా దివాలా తీసినప్పుడు... ఆయన  డిప్రెషన్‌లో కూరుకుపోయారు. ధైర్యం తెచ్చుకుని బయటపడి...ఇప్పుడు తన బాటలో ఎందరినో నడిపిస్తున్నారు.
- అమితాబ్‌ బచ్చన్‌

లొంగడం ఎందుకు?
సంజయ్‌దత్‌ 2013లో తాను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు చెబుతారు. కానీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న తాను తాత్కాలికమైన కొన్ని సమస్యలకు ఎందుకు లొంగిపోవాలంటూ తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడని కూడా అంటారు.
- సంజయ్‌ దత్‌

ఆనందతీరం!

‘‘బదలాపూర్‌... సినిమాలో నటిస్తున్నప్పుడు నేను జీవితంలోని విషాదం అనే తీరానికి చేరిపోయాను. ఎవరెన్ని మందులు ఇచ్చినా పని చేయడం లేదు. దాంతో ఇంకెప్పటికీ ఆ తీరం ఒడ్డునే ఉండిపోతాననుకున్నాను. ఇంకెప్పటికీ ఇవతలి ఆనందతీరానికి చేరననుకున్నాను. కానీ అప్పుడు ఆ డాక్టర్‌ ఢిల్లీ నుంచి వచ్చారు. అప్పటికి ఆయన నాలుగో డాక్టర్‌. ఇక నేనెప్పటికీ విషాదాలలోనే ఉండిపోతాననుకున్నప్పుడు, ఏడాదిగా చికిత్స జరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని అనుకున్నప్పుడు, ఆ నిరాశలోనే కుంగిపోయినప్పుడు నాలుగో డాక్టర్‌ నన్ను విజయవంతంగా బయటకు తీసుకొచ్చారు.’’ అని చెప్పుకున్నాడు వరుణ్‌ ధావన్‌. ‘తాము డిప్రెషన్‌లో ముగినిపోయాం’ అని  తెలుసుకున్న తర్వాత కుంగుబాటు సాగరంలో మునిగిపోకుండా... ఎంతోమంది ఆ సాగరాన్ని ఈది బయటకు వచ్చారు. జీవితంలో తిరిగి ఉన్నత స్థానాలను అధిరోహించారు.
- వరుణ్‌ ధావన్‌

పైన చెప్పుకున్న వాళ్లు మాత్రమే కాదు... కెరియర్‌ అనుకోని విధంగా మలుపులు తిరిగి... తన నుంచి సూపర్‌స్టార్‌ కిరీటం దూరమైందని కుంగిపోయారు రాజేశ్‌ఖన్నా. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, విజయాలకు దోహదపడిన పర్వీన్‌ బాబి... డిప్రెషన్‌ బారిన పడి, దాని నుంచి బయటపడలేకపోవడంతో జీవితంలో ఓడిపోయారు. అయితే స్ఫూర్తి పొందాల్సి వస్తే... దీపికా, షారూఖ్, వరుణ్‌ ధావన్‌ లాంటి వారూ ఉన్నారు. వారిని స్ఫురణకు తెచ్చుకోవడం, వారు మాట్లాడిన మాటలు మళ్లీ తలుచుకోవడం, వాటి నుంచి ప్రేరణ పొందడమే మనం చేయాల్సిన పని.

అపోహలు వాస్తవాలు
డిప్రెషన్‌ మందులతో తగ్గదనే అభిప్రాయం కొందరిలో ఉంది. కానీ ఇది మందులు, సైకోథెరపీ ద్వారా పూర్తిగా తగ్గుతుంది. ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీగా పేర్కొన షాక్‌ ఇచ్చే చికిత్స ప్రక్రియ (ఈసీటీ)తో డిప్రెషన్‌ చాలా ప్రభావపూర్వకంగా తగ్గుతుంది. ఇక తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఇది ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది. డిప్రెషన్‌ లాగే ఈ షాక్‌ ట్రీట్‌మెంట్‌పై కూడా చాలా అపోహలు ఉన్నాయి. అయితే షాక్‌ ట్రీట్‌మెంట్‌గా పేర్కొనే ఈ చికిత్సలో తీవ్రమైన షాక్‌ కొడుతుందనేది అపోహ. చికిత్సలో భాగంగా ఇచ్చే ఈ కరెంటు అస్సలు షాక్‌ కొట్టదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement