
కథ కంచికి!
హ్యూమర్ ఫ్లస్
కంచిలో చీరలమ్మే ఒక కుర్రాడికి ఎలాగో కథలతో దోస్తీ కుదిరింది. ఊరూరూ తిరిగి ఒక సత్రంలో విశ్రాంతి తీసుకుంటున్న కథలతో మాటామాటా కలిపి అన్నింటినీ కట్టగట్టి మూటలో వేసి కృష్ణానగర్ చేరుకున్నాడు. అక్కడ అడ్డాలో కొంతమంది రైటర్లు ఫైటర్లుగా మారి పెన్నులతో పొడుచుకుంటున్నారు. ‘ఎందుకు కొట్టుకుంటున్నారు’ అక్కడున్న ఒకాయన్ని భయంగా అడిగాడు కుర్రాడు. ‘కత్తి కంటే కలం గొప్పదని నిరూపించటానికి. ఇంతకూ నువ్వెవరు?’ అని అడిగాడు. నేనో రచయితని’ ‘అయితే పారిపో. లేదంటే పెన్నుపోటే. వెన్నుపోటు కంటే అది ప్రమాదకరం’ అని సలహా చెబితే కుర్రాడు కథల మూటతో పారిపోయి చీరలమ్మే అలవాటు కొద్దీ ఫిల్మ్‌నగర్ వీధుల్లో ‘కంచి కథలు’ అని అరుస్తూ తిరగసాగాడు.
ఒక పెద్దమనిషి పిలిచి ‘ఏం కథలు బాబూ’ అని అడిగాడు. ‘సినిమా కథలండి’ ‘సినిమాకి కథెందుకు నాయనా’ ‘కథ లేకుండా సినిమా ఎలా తీస్తారు సార్’ ‘పిండి లేకుండా రొట్టె, చెట్టు లేకుండా కట్టెను సృష్టించడమే సినిమా. ఎలాగూ మూట దించావు కాబట్టి కథ చెప్పు’ ‘ఓపెనింగ్ సీన్‌లోనే హీరో వయొలిన్ వాయిస్తుంటాడు’ ‘విలన్లని వాయించాలిగానీ వీణా, వయెలిన్, తబలా వాయిస్తే ఎవరు చూస్తారు నాయనా. వయొలిన్ వయెలెన్స్‌గా మార్చు’ ‘కథ చెడిపోతుందండి’ ‘కథుంటే సినిమా చెడిపోతుంది. సరే ఓపెనింగ్ నేను చెబుతా విను. విశాలమైన మైదానంలో సీన్ ఓపెన్. అరుపులు, కేకలు. రెండొందల మంది రౌడీలు కత్తులు కర్రలతో పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ల వెనక హీరో. అంటే హీరోని చూసి భయంతో పారిపోతున్నారన్నమాట’’ ‘కత్తులు ఉండి కూడా రెండొందల మంది ఎందుకు పారిపోతారు సార్’
‘ఎందుకంటే హీరో చేతిలో ఎలక్ట్రిక్ పోల్ ఉంటుంది కాబట్టి’ ‘పోల్‌లో పవర్ ఉండదా?’ ‘ఆ టైమ్‌లో పవర్ కట్’ ‘పోల్ మోయడం కష్టం కదా’
‘పోలే మోయలేని వాడు ఇక సినిమానేం మోస్తాడు. హీరో పోల్ గిరగిరా తిప్పగానే రౌడీలు పోల్‌కి తగులుకుని మెరుపులు, మంటలు’’
‘పవర్ లేదన్నారు’ ‘కొడితే వచ్చింది’ ‘మరి హీరోకేం కదా?’‘ఆయన షాక్ ప్రూఫ్. దేవుని గుడిలో కర్ర. సినిమా హాల్లో బుర్ర వాడడం మర్యాద కాదు. ఫైటింగ్ టైంలో హీరోయిన్ ఎంట్రీ. చంపు బావా... కనీసం యాభైమందిని చంపు అని ఎంకరేజ్ చేస్తుంది’
‘అమ్మాయిలు సెన్సిటివ్ కదా, మరీ అంత అన్యాయంగా మాట్లాడుతారా?’ ‘సెన్స్, నాన్సెన్స్, న్యూసెన్స్, ఈ మూడు పదాలకు సినిమాలో అర్థం ఒకటే. ఏ లాంగ్వేజి సినిమాకైనా బాడీ లాంగ్వేజి ఒకటే. రక్తం చూసిన హీరోయిన్ రెచ్చిపోయి బ్లడ్ ఈజ్ వెరీగుడ్ అని పోల్ డాన్స్ పాట కలగంటుంది’ ‘రక్తం చూసి కళ్లు తిరిగి పడిపోతారు కానీ కలలు కంటారా?’ ‘వాళ్ల కల వాళ్లిష్టం. రియల్ లైఫ్‌లో ఎలాగూ కలలు లేవు. సినిమాల్లో కూడా లేకపోతే ఎలా?’ ఆ తరువాత హీరో ఎలక్ట్రిక్ పోల్‌ని గాల్లోకి విసిరి... ‘‘నేనెవరో తెలుసా? కరెంట్‌ని. మంచివాళ్లకు వెలుగునిస్తా, లేనివాళ్లకు షాక్ కొడతా. చూపుకి కనబడను. తాకితే చూపిస్తా సత్తా. దోస్తీకి లైటింగ్‌ని, దుష్మనీకి లైట్నింగ్‌ని’ అంటాడు.
‘ఇదేం కథ సార్ ఇందులో లైఫే లేదు’ ‘లైఫ్ నైఫ్ లాంటిది. సినిమాల్లో దానిజోలికెళితే పీక తెగిపోతుంది. చీరలకు డిస్కౌంట్ ఇచ్చినంత సులభం కాదు, సినిమా ప్రేక్షకుల పల్స్‌ని కౌంట్ చేయడం’ ‘ఇంతకూ మీరెవరు సార్?’ ‘స్టోరీని నమ్మి కోల్డ్‌స్టోరేజ్‌కి చేరుకున్న వోల్డ్ ప్రొడ్యూసర్ని’
- జి.ఆర్. మహర్షి