చిన్నప్పుడు, నాకు ఊహ తెలిసేసరికి రెండే రెండు పార్టీలు ఉండేవి. మీరు, కాంగ్రెస్ - కమ్యూనిస్టు పార్టీ అనుకుంటే, కాలే పప్పులో కాలేసినట్లే. ఎన్.టి.ఆర్. పార్టీ - ఎ.ఎన్.ఆర్. పార్టీలు అవి. నేను లాగుల్లో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్. పార్టీ. మా అమ్మమ్మ వాళ్లూళ్లో, డేరా టాకీస్‌లో నేలలో కూచుని సిన్మా చూస్తూ, ఎన్.టి.ఆర్. కత్తి తిప్పుతుంటే - గుర్రం తోలుతుంటే ఆయనతో పాటు నేను కూడా ఎక్కడికో వెళ్లిపోయేవాణ్ని. ఆ తర్వాత లాగుల్లోంచి ప్యాంటుల్లోకి ఎదిగినప్పుడు, నూనూగు మీసాలొచ్చినప్పుడు, అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించేసి, ఎ.ఎన్.ఆర్. పార్టీలోకి జంప్ అయిపోయాను.
కారణం ఏం లేదు. పిల్ల వేషాల నుంచి ‘పిల్ల’ కోసం రొమాంటిక్ వేషాలేసే స్టేజ్‌కి, మనసు, శరీరం ప్రమోట్ అయిపోవడమే! కత్తి తిప్పుతూ, ఒక్క కాలు మీద గెంతుతూ (అది కూడా టైట్ ప్యాంట్స్‌లో) - ‘‘వగల రాణివి నీవే’’ అని పాడితే, ఆడపిల్లలు ఇంప్రెస్ అవ్వరని, స్టైల్‌గా సిల్క్ షర్ట్‌లో, పియానో ముందు కూచుని, ‘‘నా హృదయంలో నిదురించే చెలీ’’ అని అరమోడ్పు కన్నులతో పాడితే, అతివలందరూ అతి చేరువవుతారనీ - ఓ లవ్ గురు చెప్పడం వల్ల ఎ.ఎన్.ఆర్. పార్టీలో చేరిపోయా.
అక్కడి నుంచీ ఎ.ఎన్.ఆర్. నన్ను వదిలిపెట్తే ఒట్టు. అసలు నన్నడిగితే, 60, 70ల్లో లవ్‌లో పడ్డ ప్రతి కుర్రాడూ తెలుగునాట ఎ.ఎన్.ఆర్. వల్లే ఇన్‌స్పైర్ అయి ఉంటాడని నా గట్టి నమ్మకం. నా నడకా, మాటా, నవ్వూ, చూపూ అన్నీ ఎ.ఎన్.ఆర్.లాగా ఫీల్ అయ్యేవాణ్ణి. ఒక్క రొమాన్సే కాదు, నా కెరీర్ కూడా ఎ.ఎన్.ఆర్. ప్రభావితమే. ఎన్టీఆర్ ఫ్యాన్‌గా ఉన్నప్పుడు, నేను పెద్దయినాక, గుర్రాల ట్రైనర్‌ని అవుదామనుకున్నాను. అలాంటిది, ‘ఆరాధన’, ‘డాక్టర్ చక్రవర్తి’ సిన్మాలు చూసి, అర్జెంట్‌గా డాక్టరైపోదామని డిసైడ్ అయ్యాను. ఈ రకంగా, ఎ.ఎన్.ఆర్. తన పరిచయానికి ముందే నా జీవితాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు.
1995లో నా కుమార్తె కావ్య యాక్ట్ చేయగా, గుణ్ణం గంగరాజు డెరైక్ట్ చేసిన ‘లిటిల్ సోల్జర్స్’ వచ్చింది. ఆ చిత్రాన్ని సమర్పించిన అక్కినేని వెంకట్ ద్వారా నాకు మొదటిగా ఎ.ఎన్.ఆర్.గారితో పరిచయం అయింది. నేను రాణిగారిని వదిలేసి ఇంగ్లండ్ నుంచి వెనక్కి వచ్చి, హైదరాబాదులో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారింది. అన్నపూర్ణమ్మగారి మోకాలు ఆపరేషన్లలో నేను కూడా భాగస్వామినవడం వల్ల, మా స్నేహం అనుబంధంగా మారింది. ఇప్పుడు, అక్కినేని కుటుంబం సభ్యులందరితో నా రిలేషన్ ‘గురవారెడ్డిగారు’ నుంచి ‘గురివి’కి ఎదిగింది - ఒదిగింది.
వ్యక్తిగతంగా నేను ఇన్‌స్పైరైన విషయాలు చెప్తాను. నాగేశ్వర్రావ్‌గారి డిసిప్లెయిన్ చూస్తే, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఉదయం 6 గంటలకి ఎండైనా, వానైనా వాకింగ్ చేయాల్సిందే (అదీ, అప్పుడే ఇస్త్రీ చేసినట్టు అగుపడే తెల్లని డ్రెస్‌లో). అలానే, ఎవరు డిన్నర్‌కి పిల్చినా, టంచన్‌గా వస్తారు. రాత్రి 9 గంటలకి ఇంటికి వెళ్లిపోవాల్సిందే. ఎ.ఎన్.ఆర్. గారి సమయపాలనా నిబద్ధత తెలుసుకున్న హోస్ట్‌లు అందరూ ఆయన ఒక్కరి కోసమన్నా ఆ టైమ్‌కి భోజనం ఏర్పాటు చేసి ‘అమ్మయ్య’ అనుకుంటుంటారు.
రెండో విషయం - అంత పెద్ద సెలెబ్రిటీ ఫ్యామిలీలో తన పెద్దరికాన్ని ఆయన హ్యాండిల్ చేసే వైనం. అది అద్భుతం. అందరం ఊహించుకునేది - ‘పెదరాయుడు’ టైప్‌లో కుటుంబాన్నంతా వేలి మీద ఆడిస్తూ, చండశాసనుడిలా పాలిస్తూ ఉంటారని. కానీ నిజం ఏమిటంటే, మనవళ్లతో సహా అందరితో స్నేహితుడిలా ఉంటారు. అడిగితేనే సలహాలిస్తారు. ఫ్యామిలీ అంతా ఆయనకిచ్చే గౌరవం అపురూపం. సరే! వ్యక్తిత్వం, అలవాట్లు, క్రమశిక్షణ మనం ఎలాగోలా కష్టపడో, ఇష్టపడో ఏర్పరుచుకుంటాం. అంటే ఒక రకంగా ఇవన్నీ మనసుకు సంబంధించిన నియంత్రణలు. అదే రకంగా శరీరాన్ని లోనున్న ఫిజియాలజీని మనం నియంత్రించడం కష్టమైన విషయం. కానీ అదేం చిత్రమో - నాగేశ్వర్రావ్‌గారి బాడీ కూడా ఆయన చెప్పుచేతల్లో ఉండేది.
ఇరవై ఏళ్ల కింద అమెరికాలో - ‘‘ఈయన గుండెని రిపేర్ చేయడం మావల్ల కాదు’’ అని ఆపరేషన్ థియేటర్‌లోంచి బయటకు పంపేశారు. చివరి వరకు ఆయన హార్ట్ పర్‌ఫెక్ట్. ఆ డాక్టర్లందరూ ముక్కున వేలేసుకుని, నోట్లో కాలేసుకుని, ఎ.ఎన్.ఆర్.గారి మీద డాక్యుమెంటరీ చేస్తున్నారు - ‘లాంగెస్ట్ సర్వైవ్డ్ పేషెంట్ ఫ్రమ్ దెయిర్ ఇన్‌స్టిట్యూట్’ అని. ఆయన నిల్చోవడం - నడవడం ఎప్పుడన్నా చూశారా? ఓ అంగుళం కూడా వంగరు. నిటారుగా మేరు నగం లాగ. ఆయనలో సగం వయసున్నవాళ్లు కూడా వంగి, వంగిపోయి మెడ నొప్పో, నడుం నొప్పో అంటూ మూలుగుతుంటారు.
అక్కినేనిగారితో పరిచయం నా అదృష్టం. నాకు ఇష్టమైన పాటల్లో మొదటిది - ‘వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా..’ ‘ఆరాధన’లో పాట. నాకిష్టమైన సిన్మాల్లో మొదటిది ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఈ రెండు సిన్మాల్లో హీరో నాగేశ్వర్రావ్‌గారే! నాకు కుర్ర వయసులో ఆయనే ఇన్‌స్పిరేషన్. నా వృద్ధాప్యంలోనూ ఆయనే. ఆ వయసులో, ఆయనలా నడవగల్గినా, నడుచుకోగలిగినా మహదానందం.
(ఈ రచయిత రాష్ట్రంలోని ప్రముఖ డాక్టర్లలో ఒకరు)
అసలు నేను ఎన్టీఆర్ పార్టీ!
Published Sat, Feb 1 2014 11:55 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement