నాదే పొరపాటు!
వేదిక
మొన్నీమధ్యే నాకో పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఉద్యోగం కూడా మంచిది. పెళ్లి చూపులయ్యాక ఇంటికెళ్లి ఫోన్ చేస్తామన్నారు. సంబంధం తెచ్చినాయనకు ఫోన్ చేసి అమ్మాయి వయసు కొంచెం ఎక్కువున్నట్లుంది అన్నారట. అంతే - ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. విషయం తెలిసిన దగ్గర నుంచి అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.
'‘ఆరోజు నీకు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. అంతా నా ఖర్మ’’ అంటూ అమ్మ నన్ను తిట్టనిరోజు లేదు. మొదట్లో అమ్మ మాటల్ని లెక్కచేసేదాన్ని కాదు. ఇప్పుడు నాకు కూడా భయం మొదలైంది. అమ్మ మాటలకు బాధేస్తోంది. అది గమనించిన అమ్మ తిట్టడం మానేసి తనలో తానే బాధపడడం మొదలెట్టింది. నేను చేసిన పొరపాటు ఏమిటంటే - నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఐదంకెల జీతం. అంతా బాగుంది. ‘‘ఇప్పుడే కదా ఉద్యోగంలో చేరాను. ఓ ఏడాది వరకూ పెళ్లి మాట ఎత్తకండి’’ అని అమ్మకూ, నాన్నకూ గట్టిగా చెప్పాను. నాన్న వెంటనే ఒప్పుకున్నారు.
అమ్మ మాత్రం నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించింది. నేను ససేమిరా అన్నాను. ఏడాది తర్వాత వచ్చిన సంబంధాల్లో కొన్ని నాకు నచ్చలేదు. కొన్ని నాన్నకు నచ్చలేదు. అలా చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నా వయసు ముప్ఫైకి దగ్గరపడుతోంది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ ‘అమ్మాయికి వయసెక్కువ’ అంటున్నారు. ఆ మధ్య వచ్చిన ఒక సంబంధం వారికి నేను బాగా నచ్చాను. కానీ, అబ్బాయి వయసు నలభై వరకు ఉంటాయి.
దాంతో, ఆ సంబంధం వదులుకున్నాం. ‘‘ఎంచక్కా ఉద్యోగం వచ్చిన కొత్తల్లో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది’’ అంటూ అందరి దగ్గరా అంటోంది మా అమ్మ. ఇప్పుడు నాకు కూడా నిజమేననిపిస్తోంది. నా నిర్ణయం కారణంగా అమ్మానాన్నలు కూడా ఇబ్బందిపడుతున్నారు. ఈ ‘వేదిక’ ద్వారా అమ్మాయిలకు నేను చెప్పేదేమిటంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట వినకపోతే చాలా నష్టపోతాం.
- శ్రీలత, హైదరాబాద్