గుండెపోటును గుర్తించండిలా...
ఇటీవల చాలామంది తమకు గ్యాస్ పైకి ఎగజిమ్మే లక్షణాలైన ఛాతీలో కాస్తంత నొప్పి లాంటివి కనిపించగానే నడుస్తూనే ఆసుపత్రికి వెళ్తున్నారు. తీరా వెళ్లాక... నిజంగానే హార్ట్‌స్ట్రోక్ వచ్చిందంటూ ఎమర్జెన్సీగా స్టెంట్ వేయడమో లేదంటే శస్త్రచికిత్స చేయాల్సి రావడమో జరుగుతోంది. దీనికి భిన్నంగా కనిపించే కేసులూ ఉంటున్నాయి. పూర్తిగా గుండె ఉన్నవైపు నొప్పి రావడం, ఆయాసంగా అనిపించడం, ఒళ్లంతా చెమటలు పట్టడం జరుగుతోంది. తీరా ఆసుపత్రికి వెళ్తే అంతగా ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదంటూ... గ్యాస్ సమస్యకు అవసరమైన మందులు రాసి పంపించేస్తున్నారు. ఈ రెండు సమస్యల తాలూకు అయోమయాల మధ్య ఒక్కోసారి సందిగ్ధానికి లోనయ్యేవారు ఎందరో ఉన్నారు. గుండెపోటుకు అసలు చిహ్నాలేమిటో, ఆ లక్షణాలు నిర్దిష్టంగా ఎలా ఉంటాయో తెలపడం కోసమే ఈ కింది సూచనలు.
లక్షణాలివే...
ఈ నొప్పిని గతంలో ఎప్పుడూ అనుభవించి ఉండరు. ఇలా గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కొత్త నొప్పి ఛాతీకి ఎడమవైపున వస్తూ ఉంటే అది గుండెనొప్పి కావచ్చేమో అని అనుమానించాలి.
ఛాతీకి ఎడమవైపున వచ్చే ఇదే నొప్పి ఎడమ భుజం వైపునకు పాకుతూ ఉన్నట్లు కూడా అనిపిస్తుంటుంది. కొందరిలో ఎడమ వీపు భాగానికీ విస్తరిస్తున్నట్లుగా అనిపించవచ్చు.
ఛాతిపైన చాలా ఎక్కువ బరువు పెట్టినట్లుగానూ, ఛాతీ పట్టేసినట్లుగా ఉంటుంది.
ఊపిరి తేలిగ్గా అందకపోవడం, చల్లటి చెమటలు పట్టడం (ప్రొఫ్యూజ్‌డ్ స్వెటింగ్), చెమటలతో ఒళ్లు పూర్తిగా తడిసిపోవడం జరుగుతుంది.
నొప్పి లేని హార్ట్ ఎటాక్...
కొన్ని సందర్భాల్లో ఇలాంటి లక్షణాలు కానీ, నొప్పీ ఏదీ లేకుండానే హార్ట్ ఎటాక్ వస్తుంది. దాన్నే ‘సెలైంట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్’ అంటారు. దీనికీ కారణం ఉంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో నొప్పి తెలిసే గుణం తక్కువ. ఎందుకంటే చక్కెర వ్యాధి కారణంగా వారి నరాలు కాస్తంత మొద్దుబారి ఉంటాయి. అందుకే సమర్థంగా నొప్పిని వెంటనే తెలియనివ్వవు. అందువల్లనే చక్కెర వ్యాధి ఉన్నవారిలో ‘సెలైంట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్స్’ ఎక్కువ. ఇలాంటివారిలో నొప్పి లేకుండానే చెమటలు పట్టడం, ఛాతీ ఎడమవైపున భాగంలో అసౌకర్యంగా ఉండటం లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ఆ వేళలోనే ఎందుకు...?
గుండెపోటుకు సమయమంటూ ఉండదు. ఏ వేళనైనా రావచ్చు. కానీ ఉదయం వేళల్లో (ఎర్లీ మార్నింగ్స్) వస్తుండటం చాలా సందర్భాల్లో, ఎక్కువ మందిలో గమనించిన అంశం. అందుకు కారణం ఉంది. శరీరంలోని సింపాథెటిక్ హార్మోన్లు స్రావం ఆ సమయంలో ఎక్కువగా జరుగుతుంది. దాంతో ఎర్లీ మార్నింగ్ వేళల్లో రక్తపోటు, గుండె వేగం పెరగడం సర్వసాధారణం. అదీగాక నిద్ర అనే పూర్తి స్థాయి విశ్రాంతి స్థితి నుంచి శరీరం క్రమంగా దినచర్యలకు (యాక్టివిటీస్‌కి) ఉపక్రమించే వేళ అది కావడంతో ఆ సమయంలో గుండెపోటు రావడానికి అవకాశాలు ఎక్కువ.
నిర్ధారణ ఇలా...
గుండెజబ్బు/గుండెపోటు నిర్ధారణకు ఈసీజీ తీసి తెలుసుకోవడం ఎప్పటినుంచో అనుసరిస్తున్న చాలా సులువైన పద్ధతి. ఇందులో ఏ తేడాలు లేకపోతే చాలావరకు గుండెపోటు లేనట్లుగానే భావించవచ్చు. ఒకవేళ ఈసీజీలో ఏవైనా తేడాలుంటే అప్పుడు ట్రాప్-టీ అనే పరీక్ష ద్వారా గుండెపోటును నిర్ధారణ చేయవచ్చు.
ఈసీజీలో ఏవైనా తేడాలున్నట్లు అనిపించినప్పుడు మాత్రమే డాక్టర్ల సూచన మేరకే ట్రాప్-టి అనే పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష వల్ల గుండెపోటు వచ్చిందీ, రానిదీ నిర్ధారణ చేయవచ్చు.
సీటీ కరోనరీ ఆంజియోగ్రఫీ అనే మెషిన్‌తో ఇప్పుడు కేవలం కొద్ది నిమిషాల్లోనే గుండెపోటు/గుండెజబ్బు నిర్ధారణ జరగుతుంది.
కాబట్టి అది గ్యాస్ సమస్య వల్ల వచ్చిన అసౌకర్యమా లేక గుండెపోటు వల్ల రాబోతున్న అనర్థమా అన్నది నిర్ధారణగా తేలాలంటే ఒకసారి డాక్టర్‌ల సలహాలతో మాత్రమే ఈసీజీ చేయించుకోండి. అందులో ఏవైనా తేడాలున్నప్పుడు ట్రాప్-టీ వంటి సులభమార్గాలను అనుసరించి, గుండెపోటు వంటిది ఏదీ లేదని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండండి.
- డాక్టర్ అనూజ్ కపాడియా, కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్