కొత్త తలుపు | If the plane is a good idea to open the door to better welcome | Sakshi
Sakshi News home page

కొత్త తలుపు

Published Mon, Jan 30 2017 10:54 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

కొత్త తలుపు

కొత్త తలుపు

తలపు ఒక తలుపు  మంచి ఆలోచన ఉంటే మంచి వాకిళ్లు స్వాగతం చెబుతాయి. జన్మ జన్మలు ఆ మంచితోనే ముడిపడి ఉంటాయన్నది నమ్మకం. ఒక జన్మలో తీరని తృష్ణ మరు జన్మలో ఎందరి దాహమో తీర్చే సేవగా మారవచ్చు. అటు జన్మ, ఇటు జన్మ గురించి అంత కచ్చితంగా చెప్పలేం కానీ, ఈ జన్మకు మంచి పని చేస్తే తిరిగి మంచి జరుగుతుందని ఒక అందమైన కొత్త తలపు, కొత్త తలుపు తెరుచుకుంటుందని నమ్ముతాం.

వళ్లంతా పుళ్లు వాటి నుంచి కారుతున్న రసి. ముక్కుతూ మూలుగుతూ మట్టికొట్టుకుపోయిన దేహాలు. వారి నుంచి ముక్కులు పగిలిపోయేటంత దుర్గంధం. దూరం నుంచి చూస్తుంటేనే కడుపులో తిప్పినట్టు అవుతోంది. అలాంటిది, వారిని చేత్తో ఆప్యాయంగా నిమురుతు న్నాడు. వాళ్లు వద్దని మొరాయిస్తున్న కొద్దీ బతిమిలాడుతూ జుట్టు కత్తిరించి, స్నానం చేయిస్తున్నాడు. పుళ్లకు మందు రాసి, బట్టలు వేస్తున్నాడు. అమ్మలా గోరుముద్దలు తినిపిస్తున్నాడు. ఈ పనులన్నీ ఏ విసుగూ లేకుండా చేస్తూ దేవదూతలా కనిపిస్తున్న ఆ వ్యక్తిని తదేకంగా చూస్తూ నిల్చుండిపోయాడు వాసుదేవరావు.

సూటు బూటు వేసుకుని శ్రీమంతుడిలా ఉన్న వాసుదేవరావును అనుమానంగా చూస్తూ అక్కడి వాచ్‌మెన్‌ ‘సార్‌..’ అని గట్టిగా పిలిచాడు. ఉలిక్కిపడి చూశాడతడిని. ‘‘ఎవరు మీరు! ఏం కావాలి..’’ అన్నాడు వాచ్‌మెన్‌.  ‘‘అతను.. అతను.. నా కొడుకు...’’ అనాథలకు సేవ చేస్తూ వారే లోకంగా ఉన్న అతడిని చూపించాడు. ‘‘అవునా!’’ ఆశ్చర్యపోతూనే అభిమానంగా ‘‘రండయ్యా! రండి, లోపలికి రండి. ఇక్కడ కూర్చోండి. సార్‌ని పిలుచుకొస్తా!’’ సాదరంగా తోడ్కొని కుర్చీలో కూర్చోబెట్టి గబగబా వెళ్లాడు అతను.

విధి... విలాసం
ఆశ్రమంలో అందరితో పాటు భోజనం చేస్తున్నాడు వాసుదేవరావు. అందరికీ కొసరి కొసరి వడ్డిస్తున్నాడు తన కొడుకు సాకేత్‌. అతని మొహంలోని ప్రశాంతతను, ఆనందాన్ని చూస్తున్నాడు వాసుదేవరావు. అందరూ సాకేత్‌ని దేవుడిలా చూస్తున్నారు. కానీ, తనకు మాత్రం ఇంకా కొడుకు భవిష్యత్తే కనపడుతోంది. కళ్ల ముందు మాత్రం తను నిర్మించుకున్న సామ్రాజ్యం కదలాడుతోంది.  


తను వయసులో ఉన్నప్పుడు ఉన్న ఊళ్లో ఆస్తులమ్ముకొని విదేశాలకు వెళ్లాడు. అక్కడ బిజినెస్‌ పెట్టి భారీగా సంపాదించాడు. భార్య, కూతురు, కొడుకు.. కోట్లలో ఆస్తులు. దేనికీ లోటు లేదు. మంచి స్థితిమంతుడికి కూతురినిచ్చి పెళ్ళి చేశాడు. ఇక మిగిలింది సాకేత్‌ ఒక్కడే. ఇంజనీరింగ్‌ చదివించాడు. తన బిజినెస్‌లను చూసుకునేవాడు. ఆరేడేళ్ల్ల క్రితం

ఓ రోజు..
‘‘నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను డాడీ. మన దేశానికి వెళతాను’’ అన్నాడు. ఆశ్చర్యపోయాడు తను. ‘‘నువ్వు పుట్టిందీ పెరిగిందీ ఇక్కడే. మనదేశానికి వెళతాను అంటావేంటి?’’ ఆశ్చర్యపోతూ అడిగాను. ‘‘ఏమో, ఈ ప్రాంతం నాది కాదనిపిస్తోంది. నేను ఈ వ్యాపారాలు కాకుండా ఇంకా ఏదో చేయాలనిపిస్తోంది..’ అన్నాడు సాకేత్‌. ‘‘అదేంట్రా.. పెళ్లి చేసుకొని హాయిగా ఉండక. ఎక్కడెక్కడికో వెళతానంటావేంటి’’ అంది తల్లి. ‘‘లేదమ్మా! అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’’ అన్నాడు సాకేత్‌.
తండ్రీ–కొడుకు మధ్య వాదనలయ్యాయి. తల్లి ఏడుపు, తండ్రి నిష్టూరం.. ఏమీ పట్టించుకోలేదు సాకేత్‌.

ఓ రోజు..
ఉదయాన్నే సాకేత్‌ రూమ్‌లో ఓ లెటర్‌ దొరికింది. తను వెళ్లిపోతు న్నానని, తన కోసం వెతకద్దని రాసుంది అందులో. వాసుదేవరావు కొడుకు మీద ఆశలు వదిలేసుకున్నాడు. భార్య ఏడుస్తూనే కాలం గడుపుతోంది. ఏళ్లు గడుస్తున్నాయి.. ఈ మధ్య కొడుకు మీద బెంగ ఎక్కువై భార్య మంచం పట్టింది. ఇన్నేళ్లకు సాకేత్‌ ఉన్న చోటు తెలిసింది వాసుదేవరావుకి. ఆగమేఘాల మీద బయల్దేరాడు. బతిమాలో, బామాలో వెంటతీసుకుద్దామని.

ఏది సామ్రాజ్యం?
కానీ, తను ఇక్కడ చూస్తున్నది వేరు. అనాథలకు సేవ చేస్తూ.. వారి మలమూత్రాదులు ఎత్తుతూ వారిని కంటికి రెప్పలా సాకుతూ అదే జీవితంలా సాకేత్‌ కనిపించాడు. ఒంటరిగా ఉన్న సాకేత్‌ దగ్గరగా వెళ్లాడు వాసుదేవరావు. ‘‘సాకేత్‌.. నీ మీదే ఆశలెన్నో పెట్టుకున్నాం మీ అమ్మా నేను. నీ కోసం ఓ అందమైన సామ్రాజ్యాన్నే నిర్మించాను.

అవన్నీ వదిలేసి అనాథల మధ్య నువ్వు గడుపుతున్న జీవితం చూస్తుంటే బాధగా ఉంది. ఇంత మంది ముసలీ, ముతకను ఆదరిస్తున్న నీవు ఈ వయసులో ఈ ముసలితల్లిదండ్రులను ఎందుకు దూరం చేస్తున్నావ్‌! అక్కడ నీ తల్లి బెంగతో మంచంపట్టింది. మమ్మల్ని అనాథలను చేయకు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. వీళ్లందరి కోసం డబ్బులు పంపిద్దాం. మంచి కేర్‌టేకర్‌ని పెడదాం. మన ఇంటికి వచ్చేయ్‌!’ అన్నాడు కొడుకును బతిమాలుతూ!


‘‘డాడీ, నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు. చాలా సంతోషం. అమ్మను కూడా ఇక్కడకే తీసుకురండి వ్యాపారాలన్నీ ఎవరికైనా అప్పజెప్పండి. అంతా ఇక్కడే ఉందాం’’ అన్నాడు సాకేత్‌ అంతకుమించి మాట్లాడటానికి ఏమీ లేదన్నట్టు.

గతం ఏం చెబుతోంది?
‘‘సాకేత్‌.. మీరు గతాన్వేషణలో ఉన్నారు. ఇప్పటి నుంచి 10 ఏళ్లు, అటు నుంచి 20 ఏళ్ల క్రితం వరకు మీ జీవితాన్ని దర్శించండి. ఆ అన్వేషణలో మిమ్మల్ని కలచివేసిందేంటో వివరించంyì ’’ అన్నారు కౌన్సెలర్‌.తండ్రి బలవంతమ్మీద పాస్ట్‌లైఫ్‌ రిగ్రెషన్‌ థెరపీకి వచ్చాడు సాకేత్‌. అషైశ్వార్యాల మధ్య పెరిగినవాడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకోవాలని ఉందని వాసుదేవరావు పట్టుబట్టాడు. సాకేత్‌ సరేననడంతో థెరపీ మొదలైంది. ఎంతో ప్రశాంతంగా, మరెంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో కౌన్సెలర్‌ ముందున్నారు సాకేత్, వాసుదేవరావు. మెత్తటి వాలుకుర్చీలో విశ్రాంతిగా కళ్లు మూసుకుని కూర్చున్నాడు.

థెరపీలో సాకేత్‌ అంతర్‌ప్రయాణం మొదలైంది. క్షణాలు.. నిమిషాలు గడుస్తున్నాయి. సాకేత్‌ అంతర్‌ప్రయాణం మొదలైంది. ఇరవై ఏళ్ల క్రితం జీవితాన్ని వివరిస్తున్నాడు సాకేత్‌... ‘‘నా తల్లి, తండ్రి నన్ను అపురూపంగా చూసుకుంటున్నారు. ఏం కావాలన్నా క్షణంలో అమర్చుతున్నారు. చదువులో మంచి మార్కులు, చెల్లిలితో పోట్లాటలు.. ’ అంతా ఆనందంగా ఉంది...’’ చెబుతున్న సాకేత్‌ని మరో పదేళ్ల వెనక్కి.. ఆ తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పటి స్థితిని వివరించండి...’’అన్నారు కౌన్సెలర్‌. వాసుదేవరావు కొడుకు చెబుతున్న విషయాలను ఆసక్తిగా ఆతృతగా వింటున్నాడు. కాసేపు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో సాకేత్‌ చెప్పడం

మొదలుపెట్టాడు..
‘‘నేనో కాంతిగోళం నుంచి అణువంత వెలుగునై ఓ చీకటి గుహలోకి చేరుతున్నాను. అది నా తల్లి గర్భం. కానీ, నాలో అంతులేని అలజడి. ఈ జన్మను నేను సార్థకం చేసుకోగలనా?!’’ అనిపిస్తోంది సాకేత్‌ వివరణ వింటున్న కౌన్సెలర్‌ ‘‘ఎందుకు అలజడి? దానికి గల కారణాన్ని అన్వేషించాలంటే మీరింకా వెనక్కి ప్రయాణించండి. అక్కడ ఏం జరుగుతుందో దర్శించండి’’ అన్నారు. కౌన్సెలర్‌ సూచనలు అందుతున్నాయి సాకేత్‌ కి. మెళ్లగా అతని చెవులకు ఎంతోమంది ఆక్రందనలు వినపడటం మొదలుపెట్టాయి. కనులు మూసుకొని ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టు ఉన్న సాకేత్‌ మొహం ఒక్కసారిగా ఉద్వేగంగా మారిపోయింది.

అలమటించే అభాగ్యులు
సాకేత్‌ మíస్తిష్కంలో కనిపిస్తున్నది వివరిస్తున్నాడు. ‘‘నేనో గూడెంలో ఉన్నాను. ఆ గూడెం నాయకుడి సేవకుడిని నేను. అతనేం చెప్పినా ఎదురుచెప్పకుండా పనులు చేయాల్సిన విధి నాది. ఓ సారి మా ప్రాంతంలో తీవ్రమైన కరువొచ్చింది. అయినా, అక్కడున్న వనరుల వల్ల మా గూడెంలో తిండికీ, నీటికి పెద్ద కష్టాలు రాలేదు. కానీ, మా పొరుగు గూడెం జనం తిండికీ, నీళ్లకూఅలమటిస్తున్నారు. వాళ్ల అవసరాలు తీర్చుకోవడానికి మా గూడేనికి వచ్చి మొరపెట్టుకున్నారు. కానీ, మా నాయకుడి హృదయం కరగలేదు. పిల్లల ఆకలి తీర్చలేక నిస్సహాయ స్థితిలో వాళ్లలో కొందరు ఎదిరించారు. ఎదిరించిన వారిని చెట్లకు కట్టేసి భయానకంగా కొట్టించాడు మా నాయకుడు. వాళ్ల ఒళ్లంతా రక్తసిక్తమయ్యాయి. వాళ్ల పరిస్థితికి నా కడుపు తరుక్కుపోయింది.

వాళ్ల కష్టాలు చూసి తిండి సహించేది కాదు. నిద్రపట్టేది కాదు. మా గూడెం కట్టుబాట్ల ప్రకారం నాయకుడికి తెలియకుండా ఏ పనీ చేయకూడదు. కానీ, నాయకుడు లేని సమయం చూసి వాళ్లకు నీళ్లు, తిండి సాయం చేశాను. ఇది మా నాయకుడికి తెలిసింది. నాలాగ మిగతావాళ్లు తనను ధిక్కరిస్తారని నన్ను ఉరి తీయమని ఆదేశించాడు. అప్పుడే అనుకున్నాను. ‘సాటి జీవులపై కరుణ చూపని ఈ జన్మ ఎందుకు?. ఆకలితో, దాహంతో అలమటిస్తున్నవారికి గుక్కెడు నీళ్లు, బుక్కెడు తిండి పెట్టని జన్మ వృథా. నేను నేనుగా ఎదగాలి, దీనులకు నాకు చేతనైన సాయం చేయాలి’ అనుకున్నాను. సేవ చేయడానికే ఈ జన్మ తీసుకున్నాను. నా విధిని నేను నిర్వర్తిస్తాను’’ అని చెబుతున్న సాకేత్‌ దృఢనిశ్చయం అబ్బురమనిపించింది వాసుదేవరావుకి.

స్వదేశంలో...
భార్యతో సహా తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు వాసుదేవరావు. కొడుకు చేస్తున్న సేవలో తనూ భాగస్తుడయ్యాడు. ఆనందం కోట్లు ఖర్చుపెట్టి కట్టుకున్న కోటల్లో ఉండదని, ఎదుటివాడి కష్టం తీర్చడంలో ఉందని కొడుకు ద్వారా గ్రహించాడు. అదే ఈ దశలో నేర్చుకోదగిన పాఠం అని గుర్తించాడు.

సేవలోనే కర్మ ప్రక్షాళన
సృష్టి అంతటా ఉన్న చైతన్యం మనలోనూ ఉంది. ఆ చైతన్యం తప్పకుండా ఎదగాల్సి ఉంటుంది. ఇవ్వడంలో దివ్యత్వం మనలో ప్రవేశిస్తుంది. అందుకే ఇచ్చేవారిలో ఈశ్వరుడు ఉంటాడు అంటాం. అలాగే సేవాభిరుచిని నారాయణడి సేవతో పోల్చుతాం. నర అంటే శరీరం. ఆయణ అంటే శక్తి. ఈ దైవత్యం ఒకరి నుంచి ఒకరికి ప్రవహించాలి. సేవలోనే కర్మల ప్రక్షాళన జరుగుతుంది. కర్మలు నశించినప్పుడు మోక్షప్రాప్తి లభిస్తుంది. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ చెప్పినవి ఇవే!
– డాక్టర్‌ హరికుమార్, జనరల్‌ సర్జన్, బ్లిస్‌ఫుల్‌ లైఫ్‌ ఫౌండేషన్, హైదరాబాద్‌

‘నేను ఎవరిని...’ అనే ప్రశ్న ఉదయించాలి
ఆత్మ పరిణతి చెందేంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. పుట్టుక నుంచి మరణం వరకు మనిషి జీవన దశలు ఏ విధంగానైతే ఉంటాయో ఆత్మ దశలు అలాగే ఉంటాయి. శైశవ ఆత్మలు: ఈ దశలో ఉన్నవారిలో జంతు ప్రవృత్తి అధికం. ఆహారం కోసం, స్త్రీ కోసం, ధనం కోసం ఒకరినొకరు చంపుకోవడం ఉంటుంది. యువ ఆత్మలు: డబ్బు సంపాదన, కీర్తి కండూతి, కుటుంబ బంధాలు కోరుకుంటారు. ప్రస్తుతం సమాజం ఈ దశలోనే ఉంది. వృద్ధాత్మలుపై రెండు దశలు దాటిన తర్వాత ‘నేను ఎవరిని’ అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇక్కడే వృద్ధాత్మలుగా పరిణతి చెందుతారు. అప్పుడే సాటి జీవుల పట్ల కరుణ, దయ కలుగుతాయి. ప్రేమను పంచుతారు. ప్రస్తుత సమాజంలో వీటి సంఖ్య చాలా చాలా తక్కువ. కోటికి ఒకరుగా ఉంటున్నారు. ఈ దశకు చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి.

అనంతాత్మలు: కృష్ణుడు, బుద్ధుడు, వివేకానందుడు, మదర్‌థెరిస్సా.. లాంటి వారు కొన్ని కోట్ల మందిలో మార్పు తీసుకురావడానికి వచ్చినవారు. వారు ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో నేర్చుకొని ఆ దశకు చేరుకున్నవారు. మనకు మార్గనిర్దేశకులయ్యారు. ప్రతి ఆత్మ ఈ దశకు చేరుకునేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. – డా. లక్ష్మీ న్యూటన్, పాస్ట్‌ లైఫ్‌ థెరపిస్ట్, లైఫ్‌ రీసెర్చి అకాడమీ,  హైదరాబాద్‌

పాఠాలు నేర్చుకోవడానికే!
►ఈ లోకం ఒక విశ్వవిద్యాలయం. ప్రతి జన్మనూ ఈ విశ్వవిద్యాలయంలో నేర్చుకోవడం కోసమే తీసుకుంటాం.
►ప్రతి జన్మలోనూ పరిణతి పొందేందుకే ఆరాటపడుతుంటాం.
►ప్రతి జన్మలోనూ వచ్చే సవాళ్లు ఒక పుస్తకం. ఆ పాఠాలను నేర్చుకుంటేనే సవాళ్లను సులువుగా అధిగమించగలం.
►మోక్షం సిద్ధించాలంటే బయటెక్కడో కాదు మనలో ఉన్న ‘దయ’ అనే ఆలయాన్ని దర్శించాలి.
– నిర్మల చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement