అక్కకు ఉంటే చెల్లికీ వస్తుందనేది అపోహ!
బ్రెస్ట్ క్యాన్సర్ కౌన్సెలింగ్
నా వయసు 32 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఇటీవల మా అక్కకు రొమ్ము క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఆమెకు వచ్చిన రొమ్ముక్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందా? తోబుట్టువులలో ఒకరికి ఈ సమస్య ఉంటే మిగతా వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుందని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. అది నిజమేనా? రొమ్ముక్యాన్సర్‌ను నివారించేందుకు ఏం చేయాలి? దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపించగలరు.
- జ్యోత్స్న, హైదరాబాద్
రొమ్ము క్యాన్సర్ పట్ల ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. మీ సోదరికి రొమ్ము క్యాన్సర్ ఉన్నంత మాత్రాన మీకు కచ్చితంగా ఆ వ్యాధి రావాలని ఏమీ లేదు. మీ సోదరి రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ వస్తేనే అప్పుడు మరో సోదరికీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు సరైన జాగ్రత్తలు పాటిస్తే రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గించుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఎత్తుకు తగిన బరువును కలిగి ఉంటూ క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాకింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ, వ్యాయామంగానీ చేయండి. దాంతోపాటు తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. సాధ్యమైనంత వరకు జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. మీ సోదరికి రొమ్ముక్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని తెలిపారు. చికిత్స విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే రొమ్ముక్యాన్సర్ ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. దురదృష్టవశాత్తు రొమ్ముక్యాన్సర్‌పై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు వీడండి. రొమ్ముక్యాన్సర్ అంటువ్యాధి కాదు. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలూ చాలా తక్కువ. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకొని జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఆ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
డాక్టర్ భారత్ వాస్వాని సీనియర్ హెమటో-ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్,
సికింద్రాబాద్
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 46 ఏళ్లు. మూడేళ్లుగా బీపీ ఉంది. సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే అందులో క్రియాటినిన్ 6 ఉంది. యూరియా 120 ఉంది. నాకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు డాక్టర్ చెబుతున్నారు. అయితే నాకు మూత్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటప్పుడు మూత్రపిండాల సమస్య ఉండవచ్చా?
- సుధాకర్, అనకాపల్లి
మీరు తెలిపిన వివరాలను బట్టి మీకు దీర్ఘకాలిక కిడ్నీ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. రిపోర్టులను బట్టి మీ కిడ్నీల పనితీరు 50 శాతం తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు రక్త పరీక్షలో పూర్తిగా తెలియకపోవచ్చు. అలాగే వ్యాధి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే సాధారణంగా కిడ్నీల పనితీరులో 30 శాతం తగ్గితేనే వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. కొంతమందిలో కిడ్నీల పనితీరు చాలా ఎక్కువగా దెబ్బతిన్నా కూడా ఏ ఇబ్బందులూ కనిపించకపోవచ్చు. హైబీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కుటుంబంలో ఎవరికైన కిడ్నీ వ్యాధులు ఉన్నట్లయితే క్రానిక్ కిడ్నీ డిస్ట్రెస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి వాళ్లు ప్రతి ఏటా కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంతగా మన కిడ్నీలను కాపాడుకునేందుకు అవకాశం ఉంది.
నా వయసు 23 ఏళ్లు. గత రెండేళ్లుగా అప్పుడుప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని ఇంతవరకూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇలా రావడం వల్ల కిడ్నీలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా?
- సురేశ్, కేసముద్రం
సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు.
మీకు సాధారణ ఇన్ఫెక్షన్ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రోటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్.
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
నా వయసు 27 ఏళ్లు. తరచూ వెన్నునొప్పి వస్తోంది. నడుము దగ్గర మరీ ఎక్కువ. నోట్లో పెదవులపైనా, నాలుకపైనా తరచూ పొక్కులు వస్తున్నాయి. ఎప్పుడూ ఒళ్లు వేడిగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి.
- ఎ. కుమారస్వామి, కత్తిపూడి
మీరు వివరించిన లక్షణాలను బట్టి మీ శరీరంలో కీళ్లనొప్పులు... ముఖ్యంగా వెన్నెముక, మెడ, తుంటి భాగాల్లో ఉండటం, పెదవులపైనా, దవడలపైనా పొక్కులు, జ్వరంగా ఉండటం వంటివి చూస్తుంటే... మీకు కీళ్లవాతం (సీరోనెగెటివ్ ఆర్థోపతి) వంటి వ్యాధులు ఉండవచ్చునేమో అనిపిస్తోంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట మీరు దీనికి సంబంధించిన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పరీక్షల్లో మీకు కీళ్లవాతానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్లు తెలిస్తే దానికి తగిన మందులు కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మానసికంగా ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు చెబుతున్న లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మీకు అలాంటి ఒత్తిళ్లు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు కనుగొని ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి జనరల్ ఫిజీషియన్‌ను కలిసి వారి సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
నా వయసు 42 ఏళ్లు. వీపు మీద నల్లటి మచ్చలతో కూడిన గడ్డలు వస్తున్నాయి. సాధారణ గడ్డలే కదా అని డాక్టర్‌కు చూపించ లేదు. కానీ ఇటీవల అవి పెరుగుతున్నాయి. గడ్డ గట్టిగా అవుతోంది. నా సమస్యకు తగిన సలహా ఇవ్వండి.
- కె. ఆనందరావు, ఉరవకొండ
మీరు చెప్పిన విషయాలను బట్టి మీకు సివియర్ యాక్నే (మొటిమలు) ఉండి ఉండవచ్చనిపిస్తోంది. ముఖం మీదే కాకుండా ఒక్కోసారి వీపు మీద, ఛాతీ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ సలహాపై తగిన పూతమందులు, అవసరమైతే యాంటీబయాటిక్స్ వంటివి వాడితే మీ సమస్య తేలికగానే పరిష్కారమవుతుంది.
డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి
కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్
అండ్ డయాబెటిస్,
సెంచరీ హాస్పిటల్,
బంజారాహిల్స్, హైదరాబాద్