నచ్చకపోతే ఇంతే మరి!
తిక్క లెక్క
నిజంగా ఇది తిక్క లెక్కే. ఈ లెక్క వేసిందీ, తీసింది కూడా ఎప్పటిలా పాశ్చాత్యులే. అందులోనూ అమెరికా వాళ్లే. చిరునవ్వు ప్రపంచమంతటా ఒకేలా ఉంటుంది కదా, సుతిమెత్తని చిరచిర కూడా అలాగే ఉంటుందా అనే గొప్ప డౌటొకటి వచ్చి ఓహియో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకుల బృందం ఓ 150 మంది కాలేజీ అమ్మాయిల ముఖ కవళికల్ని రికార్డు చేసింది.
ఆ అమ్మాయిల్లో అమెరికా వాళ్లున్నారు. బ్రిటన్, స్పెయిన్, చైనా వగైరా దేశాల వాళ్లూ ఉన్నారు. ఈ పరిశోధకులు ఏం చేశారంటే... ‘అమ్మాయిలూ.. మీకు నచ్చని విషయమేదైనా ఉంటే దాన్ని మాటల్లోనే కాకుండా మీ ముఖంలో కూడా ఎక్స్‌ప్రెస్ అయ్యేలా చెప్పండి ప్లీజ్’ అని అడిగారు. ఆ తర్వాత వాళ్ల ముఖారవిందాల రీడింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత కామన్‌గా ఉన్న వ్యక్తీకరణల్ని బయటికి తీశారు. మూతి ముడవడం, చుబుకం కాస్త పైకి వెళ్లడం, కనుబొమలు ఎడంగా జరగడం, ముక్కు వంకరపోవడం వంటివి అందరిలోనూ ఒకేలా ఉండడం చూసి... నవ్వు నలభై రకాలుగా ఉంటుంది కానీ, చిరాకు నాలుగైదు రకాలుగా మాత్రమే ఉంటుందని తేల్చేశారు. ఇదేం లెక్కోమరి!