లివర్ పెరిగింది... పరిష్కారం..?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 37 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సందీప్, నరసన్నపేట
మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు.
కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. - ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. మీకు వస్తున్న కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించండి. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి.
నా వయసు 41 ఏళ్లు. నేను చాలా ఏశ్ల నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం పాంటసిడ్-హెచ్‌పి ఒక వారం పాటు వాడాను ప్రస్తుతం ఒమేజ్ అనే మందు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి, మలబద్దకం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సంపత్, కొత్తగూడెం
మీరు ఒకవేళ ఇప్పటివరకూ ఎండోస్కోపీ చేయించుకోకపోతే ఒకసారి గాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఎండోస్కోపీ చేయించుకోగలరు. ఇక మలబద్దకం, కడుపులో నొప్పి అనే లక్షణాలను బట్టి మీకు ఇరిటబుల బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి కూడా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఇది యాంగ్జైటీతో పాటు ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి, ఐబీఎస్ కాంపొనెంట్ ఉందా అని చూపించుకొని, దాన్ని బట్టి చికిత్స పొందండి.
డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
వెన్నునొప్పి తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్
నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియో ప్రక్రియలో చికిత్స ఉందా? దయచేసి వివరించగలరు. - నజీర్ అహ్మద్, నల్లగొండ
ఇటీవల వెన్నునొప్పి చాలామందిలో కనిపిస్తున్న సాధారణమైన సమస్య. వెన్నుపూసలు అరగడం అన్నది ఒకప్పుడు ఒక వయసు పైబడిన వారిలోనే కనిపించేది. కానీ ఇటీవల మారుతున్న జీవనశైలితో పాటు తాము నిర్వహించే వృత్తుల్లో భాగంగా వెన్నుపై భారం పడేలా పనిచేయడం, ఇతర కారణాల వల్లా ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం మన వెన్నెముక ప్రధాన లక్షణం.
అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు.
మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా కొందరు పేషెంట్లలో ఉంటుంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. అయితే హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది.
దాంతో పాటు తిమ్మిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్కులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి చాలా బాగా పనిచేస్తాయి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి
హైదరాబాద్