ఆరోజు ఆకాశాన వెయ్యి ఇంద్రధనస్సులు! | Indra celestial bow of a thousand a day | Sakshi
Sakshi News home page

ఆరోజు ఆకాశాన వెయ్యి ఇంద్రధనస్సులు!

Published Thu, Jan 22 2015 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

ఆరోజు  ఆకాశాన  వెయ్యి  ఇంద్రధనస్సులు!

ఆరోజు ఆకాశాన వెయ్యి ఇంద్రధనస్సులు!

‘నా అమెరికా ప్రయాణం’... అని చాలామంది యాత్రా కథనాలు రాశారు. ఎవరి పర్యటన వారికి ప్రత్యేకమే. అలాగే నా పర్యటనలోనూ ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి అమెరికాలో పర్యటించినప్పుడే స్వాతంత్య్ర వేడుకలను కూడా వీక్షించాను. మన జాతీయ వేడుక గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు రానున్నారు. ఈ సందర్భంగా నా అమెరికా పర్యటన, అక్కడి స్వాతంత్య్ర వేడుకలు గురించి నా అనుభూతులను మీతో పంచుకుంటున్నాను...
 
మా అబ్బాయి సునీల్ సీనియర్ ఇంజనీర్‌గా కొలంబస్ ఇండియానాలో పనిచేస్తున్నాడు. మా కోడలు డేటా సైంటిస్టు. వారితో గడపడానికి నేను, నా భార్య అమెరికా వెళ్లాం. జూలై 4వ తేదీ అమెరికా స్వాతంత్య్రదినోత్సవం. ముందురోజు ఉదయమే మేము కొలంబస్ నుంచి వాషింగ్టన్‌కు బయలుదేరాం. మా ప్రయాణం ఇండియానా, ఓహియో రాష్ట్రాల గుండా సాగింది. అవి రెండూ మిడ్‌వెస్ట్ ప్రాంతంలోని వ్యవసాయ రాష్ట్రాలు. మొక్కజొన్న ప్రధాన పంట. రైతుల ఇళ్లు విశాలమైన వ్యవసాయ క్షేత్రాల మధ్య అక్కడక్కడా విసిరేసినట్లున్నాయి. అక్కడక్కడా గాలిమరలు కనిపిస్తున్నాయి. ఓహియో నది ఒడ్డున ‘వీలింగ్’ అనే అందమైన పట్టణం ఉంది. పెన్సిల్వేనియా, పిట్స్‌బర్గ్, మరీ పెద్దవి కాని చిన్న చిన్న గుట్టల్లాంటి కొండలు, పచ్చిక బయళ్లు, చిన్న చిన్న లోయలు... చెయ్యి తిరిగిన చిత్రకారుడు వేసిన అద్భుతమైన చిత్రంలా కనిపిస్తోంది ‘అపలాబియన్’ పర్వతశ్రేణి. నయనమనోహరంగా, నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో కొన్ని మైళ్లు వెళ్లాక ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఓ గుజరాతీకుటుంబం ఉంది. వాళ్లు అదే ప్రదేశంలో రెండు తరాలుగా వ్యాపారం చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాం. మేరీల్యాండ్ రాష్ట్రం మీదుగా సాగిన ప్రయాణం సుమారు పదిన్నర గంటల గడిచాక వాషింగ్టన్‌కు చేరింది.

ఆ రోజు జూలై 4వ తేదీ. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశం, ఆ దేశ రాజధాని నగరంలో స్వాతంత్య్రదినోత్సవాల హడావిడి కనిపిస్తోంది. అమెరికా కూడా మనలాగే బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి చెందింది. మనకంటే సుమారుగా నూటా డెబ్భై ఏళ్ల ముందు 1776 జూలై 4వ తేదీన వారికి స్వాతంత్య్రం వచ్చింది.

మేమంతా నగరం నడిబొడ్డున ఉన్న నేషనల్ మాల్‌కు వెళ్లాం. ఆ మాల్ ఒక ఊరంత ఉంది. తూర్పున కేపిటల్ నుంచి పశ్చిమాన ఫొటోమాక్ నది వరకు రెండు మైళ్ల దూరం విస్తరించి ఉంది. మాల్‌కు ఓ పక్క ప్రతిష్ఠాత్మకమైన ‘కేపిటల్ భవనం’. అమెరికా చట్టసభలు సెనెట్, కాంగ్రెస్ ఇక్కడే ఉన్నాయి. మరోపక్క అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసభవనం ‘వైట్‌హౌస్’ ఉంది. కేపిటల్ భవనానికి సమీపంలోనే ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉంది. జార్జి వాషింగ్టన్, జెఫర్‌సన్, లింకన్, రూజ్‌వెల్ట్ వంటి ప్రభావశీలురైన అమెరికా అధ్యక్షుల స్మారక చిహ్నాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్మిత్‌సోనియన్ అమెరికన్ ఆర్ట్ మ్యూజియం, అమెరికా హిస్టరీ మ్యూజియం, విమాన అంతరిక్ష మ్యూజియం, నేషనల్ ఆర్ట్ గ్యాలరీ, నేచురల్ హిస్టరీ మ్యూజియం వంటి అనేక కట్టడాలు ఉన్నాయి.
 వేడుకలను చూడడానికి వచ్చిన వారితో మాల్ సందడిగా పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.
 కొద్దిసేపటికి కాన్‌స్టిట్యూషన్ అవెన్యూలో స్వాతంత్య్ర దినోత్సవ కవాతు మొదలైంది. రోడ్డుకు ఇరువైపుల ప్రజలు కిక్కిరిసి ఉన్నారు. కొంతమంది నిలబడి, కొందరు చెట్లనీడన కూర్చుని ఉన్నారు. వృద్ధులు మడతకుర్చీల్లో ఉన్నారు. మన జాతీయ పండుగల్లో ఉన్నట్లే అమెరికాలో కూడా అనేక అలంకారాలతో శకటాల ఊరేగింపు జరిగింది. వరుసగా కొన్ని నాట్యబృందాలు, జిమ్నాస్టిక్స్, సర్కస్ ఫీట్‌లు, కౌబాయ్ ప్రదర్శన జరిగింది. కొంతమంది నేల మీద కృత్రిమ గుర్రంలా నర్తించారు. మరికొంత మంది పిల్లలు, పెద్దలు నక్షత్రాల్లా దుస్తులు ధరించి నడిచారు. ఆ వెనుక స్వింగ్ డాన్స్ బృందం, రకరకాల మోడళ్ల సైకిళ్లతో విన్యాసాలు జరిగాయి. ఆ వెనుక సుమారు పాతిక మంది చిన్న పిల్లాడిని పోలిన పెద్ద బెలూన్‌ను మోసుకెళ్లారు. దాని పేరు ‘లిటిల్ బిగ్‌బోయ్’. ఈస్ట్ డాన్స్, కదం తొక్కుతున్న అశ్విక దళం... ఇలా ఎన్నో ప్రదర్శనలు సాగిపోయాయి. చివరగా ఒక శకటం వచ్చింది. అది భారతీయ దేవాలయాల నమూనాలో ఉన్న ఇస్కాన్ వారి శకటం. ఊహించకపోవడంతో అది ఇంకా ఆశ్చర్యపరిచింది. ఎంతో వైభవంగా జరిగిన పెరేడ్‌ను రెండుగంటల సేపు చూశాం. ముందస్తుగా అనుమతి తీసుకోకపోవడంతో వైట్‌హౌస్‌లోకి వెళ్లే అవకాశం రాలేదు. వైట్‌హౌస్‌లోకి వెళ్లాలంటే ఆరు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లోపలికి వెళ్తే ఒబామా జాతినుద్దేశించి ప్రసంగించడం, మిషెల్‌తో కలిసి అందరికీ షేక్‌హ్యాండ్ ఇస్తూ కలివిడిగా తిరగడం వంటివన్నీ దగ్గర నుంచి చూడవచ్చు.

కాన్‌స్టిట్యూషన్ అవెన్యూ నుంచి కేపిటల్ భవనానికి వెళ్లాం. ఆ మహా నిర్మాణం రెండు శతాబ్దాలుగా ప్రపంచంలోని స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా వెలుగొందుతోంది. పాత సెనెట్ చాంబర్, నేషనల్ స్టాట్యూటరీ హాల్, రొటుండా ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ మ్యూజియాలు ఎంత ఎక్కువగా ఉంటాయో, వాటి నిర్వహణ ఎంత బాగుంటుందో, వాటిని చూడడానికి వచ్చే వారి సంఖ్య కూడా అదేస్థాయిలో ఉంటుంది. సాయంత్రానికి నేషనల్ మాల్‌లో కోలాహలం మరీ ఎక్కువైంది. స్మిత్‌సోనియన్ ఫోక్‌లైఫ్ ఫెస్టివల్ జోరుగా సాగుతోంది. కొంతమంది స్వచ్ఛంద సేవకులు పర్యాటకులకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. ఇస్కాన్ వారు తినుబండారాలు అందిస్తున్నారు. అమెరికన్ నేవీబ్యాండ్ వారి సంగీతకచేరి ఆకట్టుకుంటోంది.

  చీకటి పడే సమయానికి మేము వాషింగ్టన్ మాన్యుమెంట్ గ్రౌండ్స్‌కు చేరాం. అక్కడా జనసందోహమే. ఆరు నెలల పసిబిడ్డ నుంచి పండు ముదుసలి వరకు అన్ని వయసుల వాళ్లూ ఉన్నారు. అక్కడ వైభవంగా జరిగే బాణాసంచా చూడడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా రాత్రి 9.10 నిమిషాలకు బాణాసంచా వెలుగులు విరజిమ్మాయి. ఆకాశమంతా వెలుగులతో నిండిపోయింది. వెయ్యి ఇంద్రధనుస్సులు ఒక్కసారిగా విరిసిన అనుభూతి కలిగింది. దాదాపుగా ఇరవై నిమిషాల పాటు సాగిన బాణాసంచా వెలుగులు చూసి ఆనందంగా అందరం గమ్యస్థానాల వైపు పయనించాం.
 - కలగర వెంకట్రావు,
  హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement