బీమా.. కెరీర్‌కు ధీమా!! | Insurance Career said ..! | Sakshi
Sakshi News home page

బీమా.. కెరీర్‌కు ధీమా!!

Published Sun, Apr 27 2014 10:23 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

బీమా.. కెరీర్‌కు ధీమా!! - Sakshi

బీమా.. కెరీర్‌కు ధీమా!!

ఇన్సూరెన్స్
 
ఏ కోర్సు చూసినా.. ఏ రంగంలోనైనా పోటీ రోజురోజుకీ తీవ్రమవుతోంది. అగ్రికల్చర్ నుంచి ఆస్ట్రానమీ వరకూ.. ప్రతి రంగంలోనూ పోటీనే. ఇలాంటి పరిస్థితిలో ఇటీవల కాలంలో కెరీర్‌కు ధీమా ఇస్తోంది.. బీమా రంగం!!. దేశంలో బ్యాంకింగ్ రంగంతోపాటు శరవేగంగా వృద్ధి చెందుతూ.. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌లుగా విస్తరించింది. అటు కెరీర్ పరంగానూ ఉజ్వల భవితకు మార్గం వేస్తున్న బీమా కెరీర్‌పై విశ్లేషణ..
 
 ఇన్సూరెన్స్.. ఈ మాట తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మెట్రో సిటీ నుంచి మారుమూల పల్లె వరకు బీమా కార్యకలాపాలు విస్తరించాయి. గతంలో ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ వంటివే ప్రజలకు గుర్తుకు వచ్చేవి. కానీ ప్రైవేటీకరణ నేపథ్యంలో.. అనేక ప్రైవేటు కంపెనీలు ఇన్సూరెన్స్ రంగంలో అడుగుపెట్టాయి. అంతేకాకుండా వ్యాపార కోణం లో పోటీదారులను ఎదుర్కొనేందుకు నిపుణులైన మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. దాంతో అటు మార్కెట్ అవసరాలు.. ఇటు ఇన్సూరెన్స్ రంగ పురోగతిని పరిశీలిస్తే.. 2020 నాటికి బీమా రంగంలో వివిధ హోదాల్లో దాదాపు 50వేల మంది అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌లు ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్ కోర్సులను.. ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అందిస్తున్నాయి.
 
 అవకాశాల అంచనా:
 ప్రస్తుతం దేశంలో బీమా రంగం 20 శాతం వార్షిక సుస్థిరాభివృద్ధి సాధిస్తూ ముందుకెళుతోంది. పాలసీదారులకు, ఇతర క్లయింట్లకు సేవలందించేందుకు వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంటుంది. ఆ మేరకు యువతకు అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
 
 నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంచనాల ప్రకారం-బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో.. 2021 నాటికి 20 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఇందులో 30 నుంచి 40 శాతం అవకాశాలకు ఇన్సూరెన్స్ రంగం వేదిక కానుందని పేర్కొంది.
 
 కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) అంచనాల ప్రకారం-2025 నాటికి ఒక్క ఇన్సూరెన్స్ రంగంలోనే 21 లక్షల మంది నిపుణులు అవసరమవుతారు.
 
 అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా (అసోచామ్) నివేదిక ప్రకారం- 2030 నాటికి 30 లక్షల మందికి బీమా రంగం అవకాశాలు కల్పించనుంది.
 
 ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ.. ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలకు కూడా అనుమతులివ్వడంతో.. గత పదేళ్ల కాలంగా ఈ రంగం సుస్థిర ప్రగతి సాధిస్తోంది. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 52 ఇన్సూరెన్స్ సంస్థలు ఉండగా.. 29 థర్డ్ పార్టీ ఏజెన్సీలు. బ్యాంకులు, ఇతర ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్లు వందల సంఖ్యలో ఉన్నారు. వీరందరినీ వేధిస్తున్న సమస్య.. నిపుణులైన మానవ వనరుల కొరత. మిగతా రంగాలతో పోలిస్తే.. ఇన్సూరెన్స్ కార్యకలాపాల నిర్వహణ కొంత భిన్నమైంది. అందుకే ఈ రంగంలో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది.
 
 ఆకర్షణీయ హోదాలు.. వేతనాలు:
 ఇన్సూరెన్స్ రంగంలో సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌కు సంస్థలు ఆకర్షణీయమైన హోదాలు, వేతనాలు అందిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో ఎగ్జిక్యూటివ్ హోదాలో కనిష్టంగా రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్నాయి. మూడు లేదా నాలుగేళ్ల అనుభవంతో మేనేజర్, సీనియర్ మేనేజర్ వంటి హోదాలకు చేరుకోవచ్చు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం అందుకోవచ్చు. ఈ రంగంలో పదేళ్ల అనుభవం గడిస్తే హోదాలకు, వేతనాలకు ఆకాశమే హద్దు. అయితే, అది వారి పనితీరుపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
 
 విదేశాల్లోనూ విస్తృత అవకాశాలు:
 సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్‌కు విదేశాల్లోనూ విస్తృత అవకాశాలు  లభిస్తున్నాయి. బీమా నిపుణులకు ఉద్యోగాలు కల్పించడంలో బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాలు ముందుంటున్నాయి. అమెరికాకు చెందిన లైఫ్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అందించే సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి ఫెలో ఆఫ్ లైఫ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికెట్ పొందితే.. ఆ సంస్థకు గుర్తింపు ఉన్న 60 దేశాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అదేవిధంగా బ్రిటన్‌కు చెందిన చార్టర్డ్ ఇన్సూరెన్స్ అందించే అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ కోర్సు పూర్తి చేస్తే ప్రపంచవ్యాప్తంగా బీమా రంగంలో అవకాశాలు పొందొచ్చు.  
 
 ఇన్సూరెన్స్ రంగం.. కెరీర్ వేదికలు:
 లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు,  జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రస్తుతం దేశంలో ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్‌కు కెరీర్ వేదికలుగా నిలుస్తున్నాయి. వీటితోపాటు ఇన్సూరెన్స్ సంస్థలతో ఒప్పందం ద్వారా పరోక్షంగా ఆ సేవలందించే బ్యాంకులు, బీపీఓలు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లోనూ అవకాశాలు లభిస్తున్నాయి.
 
 ఇన్సూరెన్స్ కోర్సులు :
 ఇన్సూరెన్స్ నిర్వహణకు సంబంధించి ప్రధానంగా ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఇన్సూరెన్స్ విభాగంలో డిప్లొమా కోర్సులను, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను కూడా మరికొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఆఫర్ చేస్తున్నాయి.
 
 ఇన్సూరెన్స్ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 
 నేషనల్ ఇన్సూరెన్స్ అకాడెమీ-పుణె
 కోర్సు: ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
 అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
 ప్రవేశం:క్యాట్/ఎక్స్‌ఏటీ/సీమ్యాట్ స్కోర్లు, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ, అకడెమిక్ రికార్డ్, పని అనుభవం ఆధారంగా.
 వెబ్‌సైట్: www.niapune.com
 
 ఐఐఆర్‌ఎం ప్రకటన విడుదల:
 ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోర్సుల విషయంలో హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన ఈ ఇన్‌స్టిట్యూట్.. ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, యాక్చుయేరియల్ సైన్స్ కోర్సుల్లో ఏడాది వ్యవధి ఉన్న పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ప్రస్తుతం 2014-15 సంవత్సరానికి ప్రకటన విడుదల చేసింది.
 కోర్సు: ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా, ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా ప్లస్ ఇన్ ఇన్సూరెన్స్/రిస్క్ మేనేజ్‌మెంట్
 అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత.
 కోర్సు: ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా ఇన్ యాక్చుయేరియల్ సైన్స్
 అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో తప్పనిసరిగా మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్‌ను గ్రూప్ సబ్జెక్ట్‌గా చదివుండాలి.
 ప్రవేశం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
 దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2014
 వెబ్‌సైట్: www.iirmworld.org.in
 
  ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా- ముంబై.. బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ స్థాయిల్లో ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో లెసైన్సియేట్, అసోసియేట్, ఫెలోషిప్ తదితర ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.
 వెబ్‌సైట్: www.insuranceinstituteofindia.com
 
 బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ - గ్రేటర్ నోయిడా
 కోర్సు: పీజీడీఎం ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్
 అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
 ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/మ్యాట్/జీమ్యాట్/సీమ్యాట్ స్కోర్ ఆధారంగా నిర్వహించే పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్‌లో ప్రతిభ ఆధారంగా.
 వెబ్‌సైట్: www.bimtech.ac.in
 
 బీమా రంగం.. కావాల్సిన నైపుణ్యాలు

ఇన్సూరెన్స్ రంగంలో ప్రొడక్ట్ సెల్లింగ్, కస్టమర్ సర్వీస్ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు చక్కటి ఇంటర్ పర్సనల్ స్కిల్స్, నిర్వహణ నైపుణ్యాలు, కోఆర్డినేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. గతంలో ఇన్సూరెన్స్ సంస్థలు నియామకాలు చేపట్టి నైపుణ్యాలు పెంపొందేలా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఈ రంగంలో  ఇన్‌స్టిట్యూట్‌లు, స్పెషలైజ్డ్ కోర్సుల రాకతో.. ఆయా కోర్సుల డొమైన్ ఏరియాస్‌లో నిష్ణాతులైన అభ్యర్థులకు బీమా సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ రంగంలో ఔత్సాహికులు అకడెమిక్ స్థాయిలోనే ఆయా నైపుణ్యాలపై అవగాహ న పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 ఐఐఆర్‌ఎంకు అంతర్జాతీయ గుర్తింపు

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ అందించే కోర్సులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇక్కడ కోర్సులు పూర్తి చేసుకున్నవారికి యు.కె.లోని చార్టర్డ్ ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ అందించే అసోసియేట్‌షిప్ పేపర్స్‌లో భారీ క్రెడిట్స్ మినహాయింపు లభించడమే ఇందుకు నిదర్శనం. 290 క్రెడిట్స్‌కు ఉండే సీఐఐ అసోసియేట్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఐఐఆర్‌ఎం కోర్సుల ఉత్తీర్ణులకు 210 క్రెడిట్స్ మినహాయింపు లభిస్తాయి. కెరీర్ పరంగా చూసినా.. ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగం చక్కటి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇన్సూరెన్స్‌లో మూడు విభాగాల్లోనూ(లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్) భారీ సంఖ్యలో అవకాశాలు లభించనున్నాయి. ఐఐఆర్‌ఎం ప్రతి ఏటా నిర్వహించే ప్రాంగణ నియామకాల్లో సగటున ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వార్షిక వేతనం లభిస్తోంది. ఈ రంగంలో ఔత్సాహికులు ఇన్సూరెన్స్ అంటే ఇంటింటికీ తిరిగి పాలసీలు తీసుకునే ఏజెంట్ అనే ఆలోచనకు పరిమితం కాకూడదు. ఇప్పుడు బహుళజాతి సంస్థలెన్నో దేశంలో ఇన్సూరెన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తూ మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ఇన్సూరెన్స్ కెరీర్‌ను మేజర్ ఆప్షన్‌గా గుర్తిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
- పి. రాజేశ్వరరావు, సీఈఓ, ఐఐఆర్‌ఎం, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement