నా అంటే నాగ్ అశ్విన్ ప్రియ అంటే ప్రియాంకా దత్ సావిత్రి అంటే కీర్తీ.. అందుకే ఈ ఇంటర్వ్యూని ‘నా ప్రియ సావిత్రి’ అని మీకు పరిచయం చేయాలనిపించింది. ఇవాళ్టి జనరేషన్‌కి ఇలాంటి సినిమా ఏంటి? అని ఇండస్ట్రీలో ఎందరో అనుకున్నారు. కానీ ఈ యంగ్ డైరెక్టర్ విజన్... ఈ యంగ్ ప్రొడ్యూసర్స్ సాహసం... అప్పటి సావిత్రి మరిపించినట్లే ఇప్పటి కీర్తీ మైమరిపిస్తుందేమో చూడాలి.
కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు ‘మహానటి’ సావిత్రిగారి బయోపిక్ తీయటం కొంచెం ఎర్లీ ఏమో?
నాగీ (నాగ్ అశ్విన్): ‘ఎవడే సుబ్రమణ్యం’ తీశాక ఆ సనిమా చాలా ఎర్లీగా తీశానేమో అనిపించింది (నవ్వుతూ). జనరల్‌గా చాలా సినిమాలు తీసి తీసి విరక్తి పుట్టి అలాంటి సినిమా తీస్తారు. కానీ నేను మాత్రం ఇప్పుడే తీయాలనుకున్నాను. సావిత్రిగారి బయోపిక్ తీయడానికి ఇదే రైట్ టైమ్ అని నాకనిపించింది.
అంటే.. ఏజ్ పెరిగాక, దర్శకుడిగా ఇంకా అనుభవం సాధించాక ‘మహానటి’ లాంటి సినిమా చేయాలనేది కొందరి ఒపీనియన్..
నాగీ: నా ఒపీనియన్ ఏంటంటే.. ఇంకో రెండు మూడు సినిమాలు తీశాక ఫ్లాప్ లేదా హిట్ వచ్చిందనుకోండి.. ఎంత బ్యాలెన్డ్స్‌గా ఉందామనుకున్నా మైండ్ హిట్ వైపు అట్రాక్ట్ అవ్వొచ్చు లేదా ఫ్లాప్‌కి కుంగిపోవచ్చు. దానికి తోడు ‘ఇలాంటి సినిమా ఇప్పుడెందుకు’ అనేవాళ్లు ఎక్కువైపోతారు. పదేళ్ల తర్వాత ఇన్‌సెక్యూర్టీ రావొచ్చు. కమర్షియల్ అవుతానేమో. అప్పుడు లెక్కలు వేసుకోవడం మొదలవుతుంది. ఆ లెక్కలే ముఖ్యమై నేను అనుకున్నది తీయలేనేమో. అందుకే ఈ సినిమా తీయడానికి ఇదే బెస్ట్ టైమ్.
ఈ సినిమా నిర్మించింది మీ హజ్బెండ్ నాగీ మీద ఉన్న ప్రేమతోనా? సావిత్రిగారి మీద అభిమానంతోనా?
ప్రియాంకా: సావిత్రిగారి మీద ఉన్న ప్రేమతోనే. ‘ఎవడే సుబ్రమణ్యం’ జరుగుతున్నప్పుడే ‘సావిత్రిగారి బయోపిక్ చేయాలనే ఐడియా ఉంది’ అన్నాడు నాగీ. నాకు, స్వప్నాకీ (ప్రియాంక అక్క స్వప్నా దత్) సింక్ అవ్వడానికి రెండు రోజులు పట్టింది. ‘ఎవడే..’ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ‘నిజంగానే సినిమా తీయాలనుకుంటున్నావా’ అని నాగీని అడిగాం. అవునని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. మా అందరికీ కూడా సావిత్రిగారంటే ఇష్టం. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని వెంటనే మేమూ ఒప్పేసుకున్నాం.
సావిత్రిగారి లైఫ్ హిస్టరీ తీయాలని ఎందుకు అనుకున్నారు?
నాగీ: నా తరం మాత్రమే కాదు.. నా తర్వాత నా చెల్లెలు వయసున్న వాళ్లు ఈ మహానటిని మర్చిపోకూడదని తీశాను. చిన్నప్పుడు అమ్మమ్మతో కలసి సావిత్రిగారి సినిమాలు చూశాను. ఆ తర్వాత ఆమె జీవితం గురించి తెలుసుకున్నాను. నటిగా, వ్యక్తిగా ఆమె లైఫ్ యంగర్ జనరేషన్‌కి ఆదర్శం అవుతుంది. ఆవిడ ఎరాను యంగర్ జనరేషన్ కోసం పొందుపరచటానికి ఈ సినిమా తీశాను.
సినిమా బాగుంటే కాంప్లిమెంట్స్.. లేకపోతే క్రిటిసిజమ్...
నాగీ: ఇంకా అంత దూరం ఆలోచించలేదు. ప్రస్తుతం ప్రింట్స్ డెలివరీతో బిజీగా ఉన్నాం. అయితే ఒక మహా వ్యక్తి లైఫ్ హిస్టరీ కాబట్టి ఆషామాషీగా తీయలేదు. రిసెర్చ్ చేశాం.
సావిత్రిగారి పాత్రకి కీర్తీ సురేశ్ యాప్ట్ అని ఆమె యాక్ట్ చేసిన మూవీస్ చూసి ఫిక్సయ్యారా? ఫొటోలు చూశా?
నాగీ: తమిళ సినిమా ‘తొడరి’ (తెలుగులో ‘రైల్’)లో కీర్తీ సురేశ్ చేసిన సాంగ్ చూశా. అంతకుముందు ఆమె చేసిన సినిమాలు చూశాను కానీ, ఈ సినిమాలో మాత్రం యంగ్ సావిత్రిగారు విలేజ్ లుక్‌లో ఎలా ఉంటారో అలా అనిపించింది. కళ్లలో అమాయకత్వం, తుంటరితనం కనిపించాయి. అయితే అందర్నీ ఒప్పించటానికి చాలా టైమ్ పట్టింది (నవ్వుతూ). ఇంత పెద్ద సినిమా తీస్తున్నావు. ఆల్మోస్ట్ కొత్త హీరోయిన్‌ని తీసుకుంటానంటున్నావు, మార్కెట్ గురించి ఆలోచించావా? అన్నారు. అయినా నేను కీర్తీకే ఫిక్సయ్యాను.
కీర్తీ సురేశ్ పేరు చెప్పగానే మీకేమనిపించింది?
ప్రియాంకా: అర్థం కాలేదు. తను అప్పటికి జస్ట్ వన్ మూవీ ఓల్డ్. మేం తన తమిళ సినిమాలు ఏమీ చూడలేదు. అప్పటికి ‘నేను శైలజా’ ఒక్కటే రిలీజ్ అయింది. నాకు, స్వప్నాకి చాలా టైమ్ పట్టింది సింక్ చేసుకోవడానికి. నాగీ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.
నాగీ: ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాకు చాయిస్ కూడా లేకుండా పోయింది. వేరే ఎవర్నీ ఊహించలేకపోయాను. 16 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్ ప్లే చేసే యాక్టర్స్ ఎవ్వరూ లేరు. అన్ని ఏజ్ గ్రూప్స్‌కి కీర్తీ సెట్ అవుతుందనిపించింది. ముందు లుక్స్ పరంగా మ్యాచ్ అవ్వాలి. ఆ తర్వాత యాక్టింగ్ వైజ్‌గా బెస్ట్ అనిపించాలి. కీర్తీ బెస్ట్ అనుకున్నాను.
ఇంట్లో మీ అమ్మా, నాన్నగారు, మీ సిస్టర్... అందరూ డాక్టర్స్. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎందుకనిపించింది?
నాగీ: చిన్నప్పుడు ఇంగ్లీష్ కాంపోజిషన్‌లో మనంఅనుకున్నది సృష్టించి రాసుకోవచ్చు. కొత్తగా క్రియేట్ చేయగలుగుతాం కాబట్టి అది నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. పెద్దయ్యాక జర్నలిజం అనుకున్నా. తర్వాత అడ్వరై్టజింగ్ అనుకున్నా. ఫైనల్‌గా నా థాట్ సినిమాపై మళ్లింది. బేసిక్‌గా క్రియేషన్ అంటే ఇష్టం ఉండటంతో సినిమాకి అట్రాక్ట్ అయ్యాను. శేఖర్ కమ్ముల గారి లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి వర్క్ చేశా. చిన్న ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని కమర్షియల్ యాడ్స్ తీశాను. ‘ఎవడే సుబ్రమణ్యం’తో డైరెక్టర్‌గా మారాను.
సావిత్రి గారి నడక, మూతి విరుపు చూడచక్కగా ఉంటాయి. ఆమెలా నటించడానికి కీర్తీ హోమ్‌వర్క్ చేశారా?
నాగీ: కీర్తీ ఎక్కువగా హోమ్ వర్క్ చేసే హీరోయిన్‌లా కనిపించదు. కష్టపడి లైన్స్ గుర్తుపెట్టుకొని కెమెరా ముందు అప్పజెప్పే టైప్ హీరోయిన్ కాదు. సీన్ చెబితే చాలు. కెమెరా ముందు ఆ క్యారెక్టర్‌లానే మారిపోతుంది. కీర్తీ బ్లెస్డ్ యాక్టర్.
సావిత్రిగారి భర్త జెమినీ గణేశన్‌గారి మొదటి భార్యకు పుట్టిన రేఖ (సౌత్, నార్త్‌లో ఫేమస్ యాక్ట్రెస్) గారి పాత్ర సినిమాలో ఉందా?
నాగీ: లేదు. లైఫ్ స్టోరీ మొత్తం చెప్పాలని ఉన్నా టైమ్ లిమిట్ ఉంటుంది కదా. ఆమె జీవితంలో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని పెట్టాలనిపించి, చాలా రాశాను. ఫైనల్ స్క్రిప్ట్ చూస్తే.. ఇదంతా తీస్తే ఎడిటింగ్ లెవెల్‌లో కష్టమైపోతుందని స్క్రిప్ట్ లెవల్‌లోనే ఎడిట్ చేసుకున్నాను.
సావిత్రిగారి లైఫ్‌లోని బ్యాడ్ ఫేజ్ కూడా చూపించారా?
నాగీ: మన జనరేషన్ అంతా ఆమె గురించి సెలబ్రేట్ చేసుకోవాలనే ఈ సినిమా తీశాను. అలా అని ఏదీ స్కిప్ చేయలేదు. డౌన్ ఫాల్ అనేవి ఆమె లైఫ్‌లో భాగమే కదా. అవి కూడా చూపించాం. సినిమా తీసినప్పుడు అన్నీ చెప్పాలి. ఓన్లీ సక్సెస్ మాత్రమే చూపించడం కరెక్ట్ కాదు. అలా చేస్తే అసంపూర్ణంగా ఉంటుంది.
ఏయన్నార్‌గా చేసిన నాగచైతన్య గురించి?
నాగీ: చైతన్య రోల్ చిన్న సర్‌ప్రైజ్‌లా ఉంటుంది. అడగ్గానే ఒప్పుకున్నాడు. బాగా చేశాడు. సమంత, విజయ్ దేవరకొండ కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఈ ఏజ్ గ్రూప్ యాక్టర్స్ ఈ సినిమాలోకి రావడం బెస్ట్ థింగ్. వాళ్లు మెయిన్ లీడ్ కాకపోయినా సరే చేశారు. నీకెన్ని సీన్స్ ఉన్నాయి? నాకెన్ని ఉన్నాయి? అని లెక్కలు వేసుకోలేదు. ఇలాంటి ఆర్టిస్టులు ఉంటే నెక్ట్స్ జనరేషన్‌కి బోలెడు కథలు చెప్పొచ్చు.
నిర్మాతగా మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు?
ప్రియాంకా: ఎక్కువమంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి డేట్స్ విషయంలోనే కొంచెం ఇబ్బంది అనిపించింది. ‘ఎంత అదృష్టం ఉండి ఉంటే ఇలాంటి సినిమా చేస్తున్నాం’ అనే ఫీల్ కలగని రోజు లేదు. అంతా సజావుగా జరిగింది.
భర్త డైరెక్టర్.. భార్య ప్రొడ్యూసర్ అయితే ఆ ప్రాజెక్ట్ ఇలా సాఫీగానే సాగుతుందేమో కదా?
ప్రియాంకా: అలా ఏమీ లేదండి. మేం గొడవ పడని రోజు లేదు. కొన్ని సార్లు అభిప్రాయాలు కలిసేవి కావు. తను ఒకటి చెబితే మేం ఒకటి. ఆ ఆర్గ్యుమెంట్ లేకపోతే మంచి అవుట్‌పుట్ రాదు. అసలు ఒకరి మీద ఒకరు అరుచుకోవచ్చని, గొడవపడొచ్చనే పెళ్లి చేసుకున్నాం (నవ్వుతూ).
మీ లవ్ స్టోరీ గురించి. నాగీతో ఎప్పుడు లవ్‌లో పడ్డారు?
ప్రియాంకా: ఎప్పటి నుంచో తను తెలుసు. ‘ఎవడే సుబ్రమణ్యం’కి బాగా ట్రావెల్ చేశాం. నాగీలో గుడ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ టైమ్‌లో మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తే, ఎవర్నో ఎందుకు? బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంటే లైఫ్ కంఫర్టబుల్‌గా ఉంటుందనిపించింది.
నాగీ: డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా ఇద్దరం కలసి చేసిన ట్రావెల్‌లో ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం. ప్రియాంక నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇదేదో ‘ఐ లవ్ యు’ అని చెప్పుకుని, టిపికల్ లవ్ మ్యారేజ్‌లా చేసుకున్నది కాదు. తనతో లైఫ్ కంఫర్ట్‌గా ఉంటుందనిపించి, చేసుకున్నా.
గడ్డం, పొడువైన జుట్టుతో నాగీ చూడచక్కగానే ఉన్నా.. మీకెప్పుడైనా అనిపించిందా ఈ గెటప్ అంతా మార్చేయాలని?
ప్రియాంకా: మా పెళ్లి అవ్వకముందు ఓసారి ట్రై చేశా. హెయిర్ షార్ట్‌గా కట్ చేసుకుని, గడ్డం తీశాడు. నువ్వేనా అన్నాను? ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ కొంచెం లాంగ్ హెయిర్, గడ్డం.. ఇదే మెయిన్‌టైన్ చేస్తున్నాడు. ఇదే బాగుంది.
ఫస్ట్ ‘ఎవడే సుబ్రమణ్యం’, ఇప్పుడు ‘మహానటి’ తీశారు. మరి.. రెగ్యు లర్ ఫార్మాట్ సినిమాలు చేయాలని మీకు లేదా?
నాగీ: ఒక సినిమా తీయాలంటే కథ రాయడానికి ఒక ఆరు నెలలు పడుతుంది. మళ్లీ కాస్టింగ్‌కి ఒక ఆరు నెలలు. సినిమా పూర్తయ్యేసరికి సంవత్సరం. మొత్తం రెండేళ్లు. మనం 60 ఏళ్లు బ్రతుకుతాం అనుకుంటే అందులో ప్రతి సినిమాకి రెండేళ్లు కేటాయించినప్పుడు.. స్టాండర్డ్ సినిమా అయినా ఏదైనా.. డబ్బులు వచ్చినా రాకపోయినా ఆ రెండేళ్ల జీవితం వర్తీగా ఉండాలి.
100 మందిని కొట్టడం, ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాలు మీరు ఎంజాయ్ చేస్తారా?
నాగీ, ప్రియాంకా: యా.. పర్ఫెక్ట్‌గా చేసిన సినిమాలను కచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ‘రంగస్థలం’ వెల్ మేడ్ కమర్షియల్ మూవీ.
అవునూ.. ‘ఎవడే సుబ్రమణ్యం’కి స్వప్నా, ప్రియాంకా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారట. ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో లిమిటేషన్స్ ఏమైనా పెట్టారా?
నాగీ: ‘ఎవడే..’ లో–బడ్జెట్‌లో చేయాల్సిన సినిమా. అప్పటికి నాని కెరీర్ పెద్దగా హిట్‌లో లేదు. విజయ్ దేవరకొండ ఫేమస్ కాదు. నాకు ఫస్ట్ మూవీ. ఎవరికీ మార్కెట్ లేదు. పైగా స్టోరీయేమో వెరీ డిఫరెంట్. తెలుగులో చూస్తారా లేదా? అనే డౌట్ కూడా ఉంది. యాక్చువల్‌గా నేనే చేద్దామనుకున్నాను. అయితే స్వప్నా, ప్రియాంకా కథ విని, మేమే చేస్తామన్నారు. దాంతో ఓ మెయిన్ క్యారెక్టర్‌కి కృష్ణంరాజుగారిని తీసుకున్నాం.
అలా డీసెంట్ మీడియమ్ బడ్జెట్ సినిమా అయింది. వాళ్లు ఖర్చు పెడుతుంటే నాకు భయం అనిపించేది. ఏదైనా తేడా జరిగితే బ్లేమ్ చేస్తారేమో అనుకున్నా (నవ్వుతూ). ‘మహానటి’కి అయితే నేను వద్దన్నా ఖర్చు పెట్టారు. ఫలానా సీన్‌కి 100 మంది ఆర్టిస్టులు కావాలంటే.. 150 మందిని తీసుకుందామనేవారు. చిన్న సీన్‌లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు. అలా అని నీళ్లలా ఖర్చు పెట్టాం అని చెప్పడం లేదు.
ఫైనల్లీ... సావిత్రిగారి కూతురు విజయ చాముండేశ్వరిగారు ఈ సినిమా చూశారా?
ప్రియాంకా: చూశారు. సావిత్రిగారి అబ్బాయి సతీష్‌గారు కూడా చూశారు. చాలా బావుందని ఎమోషనల్ అయ్యారు. కాంట్రవర్శీ లేదని హ్యాపీ ఫీలయ్యారు.
మా అమ్మగారిని నీలో చూసుకుంటాను అన్నారు
అందరి మనసుల్లో మహానటిగా నిలిచిపోయిన సావిత్రిలాంటి అద్భుత నటి పాత్రను అంగీకరించడం అంటే ఎంతో ధైర్యం కావాలి. సావిత్రిగా చేయడానికి ముందు సంశయించినా కీర్తీ సురేశ్ ఆ తర్వాత ధైర్యంగా ఒప్పుకున్నారు. ‘మహానటి’ సినిమా గురించి తన మనోభావాలను ఇలా పంచుకున్నారు.
♦ నాగ్ అశ్విన్ ఫస్ట్ అప్రోచ్ అయి, ఐడియా చెప్పగానే భయం అనిపించింది. స్క్రిప్ట్ విన్నాక ఇంకా భయపడ్డాను. నా భయమేంటంటే సావిత్రిగారు లెజెండరీ యాక్ట్రెస్. సరిగ్గా చేయగలనా లేదా? కన్విన్స్ చేయ గలుగుతానా? లేదా.. ఇలా ఎన్నో డౌట్స్ ఉండేవి.
♦ లుక్ టెస్ట్ చేసేవరకూ అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. తన బొట్టు, వంకీల జుట్టు, కాస్ట్యూమ్స్.. ఇవన్నీ నా మీదకు వచ్చేసరికి నమ్మడం మొదలెట్టాను (నవ్వుతూ). నిజం చెప్పాలంటే అసలు నేను సావిత్రిగారిలా ఉంటానా? అనుకున్నాను. ట్రైలర్, ఫొటోలు చూసుకున్నాక నమ్మకం ఏర్పడింది.
♦ సావిత్రిగారిలో గొప్పతనం ‘సహాయ గుణం’. మన దగ్గర డబ్బుండి దానం చేయటం ఓకే. కానీ లేనప్పుడు కూడా సహాయం చేయాలని ఆరాటపడటం సావిత్రిగారి గొప్పతనం. ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్, విల్ పవర్ సూపర్. ‘మీరు చేయలేరు’ అని పొరపాటున ఆవిడ ముందు అంటే చేసి చూపించగల విల్‌పవర్ ఉన్న వ్యక్తి సావిత్రిగారు.
♦ ఫస్ట్ సావిత్రిగా కీర్తీ అనుకున్నప్పుడు చాలా మంది పెదవి విరిచారు. నాకేం తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే నాకే కాన్ఫిడెన్స్ లేనప్పుడు వాళ్లు అనుకోవడంలో తప్పులేదని వదిలేశాను.
♦ సావిత్రిగారి పాత్ర చేస్తున్నాను అని మా అమ్మ (నటి మేనక)గారికి చెప్పినప్పుడు సావిత్రి గారి బొట్టు, జాకెట్ స్లీవ్స్, తన ఎడమ చేతి వాటం గురించి చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు. నిజానికి అప్పట్లో బ్లౌజ్ ఫిటింగ్ చాలా టైట్‌గా ఉండేది. ఇప్పుడా ఫిటింగ్ అంటే కష్టం. షూటింగ్ పూర్తయి, కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకున్నాక చూసుకుంటే, నా చేతులు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక గ్రీన్‌గా మారిపోయి ఉండేవి.
♦ ప్రొస్థటిక్ మేకప్ వేసుకోవడానికి మూడు నాలుగు గంటలు పట్టేది. ఒక్కసారి మేకప్ వేసుకున్నాక బాత్‌రూమ్‌కి వెళ్లటం, ఫుడ్ తినడం కష్టం. అప్పుడు ఓన్లీ లిక్విడ్ ఫుడ్స్ తీసుకునేదాన్ని.
♦ డబ్బింగ్ చెప్పడానికి 11 రోజులు పట్టింది. సావిత్రిగారు చాలా బాగా మాట్లాడేవారు. ఆమె డిక్షన్ మ్యాచ్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నాను.
♦ నా చిన్నప్పుడు మోహన్‌బాబు గారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆయనతో నటించడం చాలా బాగా అనిపించింది. ఆ ఆటోగ్రాఫ్ చూపించగానే ‘ఏంటీ నేను ముసలివాడిని అయ్యానని గుర్తు చేస్తున్నావా?’ అన్నారు సరదాగా.
♦ సావిత్రిగారి కుమార్తె విజయ చాముండేశ్వరిగారు చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు. మా సినిమాలోని ‘మాయాబజార్’లో కొన్ని సీన్స్ చూపిస్తే, ‘సూపర్బ్’ అని చాలా సంతోషపడ్డారు. అప్పటినుంచి నన్ను ‘క్యూట్ లిటిల్ మామ్’ అంటున్నారు. ఎప్పుడైనా మా అమ్మగారు గుర్తొస్తే నీలో అమ్మగారిని చూసుకుంటాను, నువ్వు దగ్గర ఉంటే హగ్ చేసుకుంటాను అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment