నా వయసు 24 ఏళ్లు. నాకు చుండ్రు ఎక్కువగా వస్తోంది. అమ్మాయిని కావడంతో తలలో చేయిపెట్టి గీరుకోవడం చాలా ఎంబరాసింగ్‌గా అనిపిస్తోంది. దయచేసి నా సమస్య తీరడానికి ఏమైనా మార్గాలుంటే చెప్పండి.
– సుప్రియ, విశాఖపట్నం
నిజమే. అమ్మాయిలకు చుండ్రు ఉన్నప్పుడు వాళ్ల సెల్ఫ్–ఎస్టీమ్ కాస్తంత దెబ్బతిని, కొంత కుంగిపోతుంటారు. అయితే కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అవి...
►చుండ్రు ఉన్నవారు తలకు జిడ్డుగా ఉండే నూనెలు రాయకపోవడమే మంచిది. కొందరిలో నూనె రాయకపోతే తలనొప్పి వంటివి వస్తాయనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వారు తలకు నూనె రాయాల్సి వస్తే, కొద్దిసేపటి తర్వాత తప్పనిసరిగా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ నూనె రాసేటప్పుడు కూడా సువాసన నూనెలు కాకుండా శుభ్రమైన కొబ్బరినూనెకే పరిమితం కావడం మంచిది.
►మీరు తల స్నానం చేసేటప్పుడు మాడు అంతా పూర్తిగా శుభ్రపడేలా రుద్దుకుంటూ స్నానం చేయండి. మీకు సరిపడే మంచి షాంపూతో కనీసం వారంలో రెండుసార్లయినా తలస్నానం చేస్తుండాలి. ఇలా రోజు విడిచి రోజూ తలస్నానం చేయాల్సి వచ్చినప్పుడు మైల్డ్ షాంపూలు మాత్రమే ఉపయోగించాలి. ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడటమూ మంచి ప్రయోజనాలిస్తుంది.
►ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాక కూడా చుండ్రు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వారి సూచన మేరకు... యాంటీ ఫంగల్ ఏజెంట్స్, తార్ కాంపౌండ్స్ వంటివి ఉన్న మెడికేటెడ్ షాంపూలు వాడవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... ఈ తరహా షాంపూలు ఉపయోగించేటప్పుడు వీటిని నీళ్లలో పలుచబార్చకూడదు. ఒకసారి తలకు పట్టించాక కనీసం 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అప్పుడే అవి తమ ప్రభావం చూపగలవు. ఐదు నిమిషాల తర్వాత వాటిని శుభ్రంగా కడిగేయాలి. జుట్టురాలుతున్నా లేదా దురద ఎక్కువగా ఉన్నా ఒక్కోసారి స్టెరాయిడ్ బేస్‌డ్ లోషన్లు కూడా డాక్టర్లు సూచిస్తారు. అయితే వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి.
►చుండ్రుతో పాటు మొటిమలు కూడా ఉంటే... హార్మోన్లలో ఏవైనా మార్పులు వచ్చాయా అనే పరీక్షలు చేయించాలి. ఆ వచ్చే ఫలితాలను బట్టే తర్వాతి చికిత్స కొనసాగాలి.
►జుట్టు పొడవుగా ఉండే మహిళలు తలస్నానం చేశాక వెంటనే దాన్ని ముడుచుకోవడం తగదు. ఎందుకంటే అలాంటి సమయంలో జుట్టులో తేమ చాలాసేపు ఉండి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే వాతావరణానికి అనువుగా ఉంటుంది. పైగా జుట్టు తొందరగా చిక్కులు పడుతుంది. అందుకే జుట్టును ఆరేందుకు ఫ్రీగా వదిలేయాలి. పూర్తిగా తడి ఆరకముందే దువ్వడం సరికాదు. దాదాపు పొడిబారిపోయే సమయంలో దువ్వడం మంచిది.
►విటమిన్–ఏ, జింక్ పాళ్లు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి.
►చుండ్రు ఒక దీర్ఘకాలిక సమస్య. కేవలం కొద్దిరోజులు షాంపూ వంటివి వాడాక తగ్గిపోవడం అన్నది సాధారణంగా జరగదు. కాబట్టి సమస్య ఉన్నంతకాలం యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతుండటమే మంచిది. లేదా చుండ్రు మళ్లీ తిరగబెట్టినప్పుడు యాంటీడాండ్రఫ్ షాంపూల వాడకం మళ్లీ మొదలుపెట్టాలి. అవి చాలావరకు సురక్షితమే. అయితే దీర్ఘకాలం పాటు వాడుతున్నప్పుడు కొందరిలో అవి తలను పొడిబారేలా చేయవచ్చు. అలాంటప్పుడు కండిషనర్స్ కూడా వాడటం మంచిది. కొన్ని షాంపూల వల్ల జుట్టు రాలుతున్నట్లు గమనిస్తే వెంటనే షాంపూను మార్చి తమకు సరిపడేది వాడాలి. ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలతో చుండ్రును చాలావరకు తేలిగ్గానే అరికట్టవచ్చు.
డాక్టర్ స్వప్నప్రియ,
డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
షాంపూఎంపిక ఎలా?
నా వయసు 22 ఏళ్లు. చాలాకాలంగా షాంపూలు వాడుతున్నా దేనితోనూ సంతృప్తిపడలేకపోతున్నాను. మార్కెట్‌లో రకరకాల షాంపూలు అందుబాటులో ఉండటంతో పాటు, టీవీల్లో కనిపించే యాడ్స్‌తో ఇంకా అయోమయంలో పడిపోతున్నాను. నాలాంటి ఎంతోమంది అమ్మాయిలకు అది ఉపయుక్తంగా ఉంటుందనిపించేలా మంచి షాంపూను ఎంపికకు ఏమైనా సూచనలివ్వండి. ప్లీజ్!
– ఎమ్ లక్ష్మీ సుశ్మిత
కొందరివి పలుచటి వెంట్రుకలు, కొందరివి బిరుసుగా ఉంటాయి.. ఇలా సాధారణంగా అందరి వెంట్రుకలూ ఒక్కలా ఉండవు. కాబట్టి అందరి షాంపూ అవసరాలూ ఒకేలా ఉండవని మనం గుర్తుంచుకోడాలి. ఇక మన అవసరాలను బట్టి మార్కెట్లోకి రకరకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు కొంత అయోమయానికి గురికావడం సహజమే. అయితే మన అవసరాలను బట్టి మనం ఎలాంటి షాంపూలను ఎంచుకోవచ్చో తెలుసుకునేందుకు ఈ కింది సూచనలు పాటించడం చాలావరకు మేలు చేస్తుంది. అందరూ వాడదగ్గవి : ఇందులో శుభ్రపరిచే సామర్థ్యం (క్లెన్సింగ్ ఎబిలిటీ) నార్మల్‌గా ఉంటుంది. నార్మల్ హెయిర్ కోసం వాడాల్సిన ఈ షాంపూలు సాధారణంగా లారిల్ సల్ఫేట్ అనే నురగవచ్చే పదార్థంతో తయారవుతాయి. ఇందులో ఆ రసాయనంతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు ఉత్పత్తిదారులు రకరకాల సుగంధ ద్రవ్యాలను చేర్చి వాటిని మంచి సువాసన వచ్చేలా రూపొందిస్తారు.
ఇవి ఎవరైనా వాడవచ్చు. కాబట్టి మార్కెట్‌లో ఉన్న రకరకాల బ్రాండ్స్‌ను వాడుతూ... ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో... మీకు ఏది అనువైనదో, సౌకర్యమో అది వాడుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఛాయిస్ షాంపూను మీ సంతృప్తి మేరకు కొనసాగించవచ్చు. జుట్టులో మంచి సువాసనతో పాటు, ఆహ్లాదకరమైన ఫీలింగ్ కోరుకునే వారు ఇలాంటివి వాడుకోవచ్చు. అయితే షాంపూ ఏదైనప్పటిక అది మైల్డ్‌గా ఉండటం అన్నది జుట్టు విషయంలో దాదాపుగా అందరికీ ఆరోగ్యాన్నిచ్చేందుకు డాక్టర్లు ఇచ్చే ఒక మంచి సూచన. పొడి వెంట్రుకలు ఉండేవారికి : వెంట్రుకలు చాలా పొడిబారినట్లుగా ఉంటాయి. ఇలాంటి వారికోసం తయారయ్యే షాంపూల్లో రోమాన్ని శుభ్రపరిచే రసాయనాలు మరీ తీవ్రంగా లేకుండా చూస్తారు. అంటే మైల్డ్ క్లెనింగ్ ఏజెంట్స్‌ను ఉపయోగించి చేస్తారు. దాంతో పాటు వెంట్రుక కండిషనింగ్ కోసం అందులో సిలికోన్ వంటి ఏజెంట్స్, కెటాయినిక్ పాలిమర్స్‌ను కలుపుతారు.
వాటిని ఉపయోగించాక ఆ సిలికోన్ పొడి వెంట్రుకల మీద సమంగా విస్తరించి ఒక కోటింగ్‌లా ఏర్పడుతుంది. కాబట్టి పొడి వెంట్రుకలు ఉన్నవారికి సిలికోన్, కెటాయినిక్ పాలిమర్స్ ఇంటి ఇన్‌గ్రేడియెంట్స్ ఉన్నవి మంచి షాంపూలుగా పరిగణించవచ్చు. మీరు పొడి వెంట్రుకలు కలవారేతే... పైన పేర్కొన్న ఇన్‌గ్రేడియెంట్స్ షాంపూలో ఉన్నాయో లేవో చూసి, అలాంటి వాటినే ఎంపిక చేసుకోవచ్చు. జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి : తలలోని చర్మరంధ్రాల నుంచి సీబమ్ అనే స్రావం ఎక్కువగా వచ్చిన వారి వెంట్రుకలు సాధారణంగా జిడ్డుగా ఉంటుంటాయి. ఇలాంటి జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి అవసరమైన షాంపూలను మాడుపైన, వెంట్రుకపైన ఉన్న అదనపు సీబమ్‌ను తొలగించేలా రూపొందిస్తారు.
ఇందులో క్లెన్సింగ్ ఏజెంట్‌గా లారిల్ సల్ఫేట్‌తో పాటు అదనపు నూనెవంటి స్రావాలను తొలగించడానికి ఉపయోగపడే ‘సల్ఫోసక్సినేట్’ వంటి రసాయనాలతో వీటిని తయారు చేస్తారు. అయితే జిడ్డుజుట్టు ఉన్నవారికి రూపొందించే షాంపూలలో కండిషనింగ్ తక్కువగా ఉండేలా చూస్తారు. కాబట్టి పైన పేర్కొన్న కాంబినేషన్స్ ఉన్నవి జిడ్డు కురుల వారు ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే కురులు మరీ జీవం లేనట్టుగా మారిపోతాయి. అప్పుడది పీచులా కనిపించే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఎన్నిసార్లు తలస్నానం చేస్తే, అలా కనిపిస్తుందో ఎవరికివారు పరీక్షించి చూసుకొని, వారంలో అంతకంటే తక్కువసార్లు తలస్నానం చేయడం మంచిది.
వారంలో తలస్నానం ఎన్నిసార్లు?
జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయవచ్చు.
– ఆర్. రమణి, గుంటూరు
సాధారణంగా వారానికి ఇన్నిసార్లే తలస్నానం చేయాలంటూ నిర్దిష్టంగా లెక్కేమీ ఉండదు. కొందరికి రోజూ తలస్నానం చేస్తే తప్ప స్నానం చేసినట్టు ఉండదు. ఇలాంటివారికి తమ వ్యక్తిగత సంతృప్తే ప్రధానం కాబట్టి... తమ తమ వ్యక్తిగత అభిరుచి మేర తలస్నానం చేయవచ్చు. అయితే సాధారణంగా వారంలో రెండు సార్లు, మరీ తలలో దురద ఎక్కువగా వచ్చేవారు రోజు విడిచి రోజు... (అది కూడా మైల్డ్ షాంపూతో మాత్రమే) తలస్నానం చేస్తే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment