- స్వామి నిశ్చలానంద సరస్వతి
జగద్విఖ్యాత శ్రీజగన్నాథుని రథయాత్రలో మూల విరాట్టును స్పర్శించి దర్శించుకునే వివాదాస్పద ఆచారం పట్ల శంకరాచార్య తుది నిర్ణయం ప్రకటించారు. మూల విరాట్టుని స్పర్శించడం శాస్త్ర సమ్మతం కాదని ఒరిస్సాలోని గోవర్ధన పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ప్రకటించారు. భగవంతుని దర్శనం పట్ల భక్తులు అధికారులతో హద్దు మీరి ప్రవర్తించడం తగదని హితవు పలికారు. స్కాందపురాణం, వామదేవ సంహిత, శ్రీమద్భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాల్లో దారు బ్రహ్మ స్పర్శకు పరిమితులు విధించినట్లు నిశ్చలానంద సరస్వతి వివరించారు. విశ్వవ్యాప్త అంతర్యామిని స్పర్శించడానికి, స్పర్శించకపోవడానికి నియమ నిబంధనలు లేవు.
అయితే కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలతో ప్రతిష్ఠించిన మూల విరాట్టు దర్శనం, స్పర్శలకు శాస్త్రపరంగా స్పష్టమైన నియమ నిబంధనలు ఖరారవుతాయి. ఈ నియమ నిబంధనల ఉల్లంఘనతో మూలవిరాట్టులో దైవశక్తి లోపిస్తుంది. శాస్త్రీయమైన నియమ నిబంధనల ఉల్లంఘన జరిగితే సకాలంలో తగిన ప్రాయశ్చిత్త పూజాదులు నిర్వహించాలి. అలా చేయనిపక్షంలో హిందూ ధర్మానికి ముప్పు వాటిల్లుతుందని శంకరాచార్య తెలియజేశారు.
నియమనిష్ఠలతో ధర్మాన్ని ఆచరించడం నిజమైన ధార్మిక తత్వంగా పరిగణించబడుతుంది. ధర్మపరమైన నియమనిష్ఠల్ని ఉల్లంఘించడం దోషంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు. తనను సందర్శించలేని భక్తులకోసం గర్భాలయం నుంచి మూలవిరాట్టు రథారూఢుడై భక్తుల మధ్యకు తరలి రావడం చాలా అరుదైన విషయం. అయితే మూల విరాట్టు ఉన్నంత కాలం రథాలు భగవంతుని ఆస్థానంగా వెలుగొందుతాయి. అగ్ని, విద్యుత్ వంటి శక్తులు విశ్వమంతటా వ్యాపించి ఉన్న వాస్తవం అందరికీ తెలిసిందే. ఈ శక్తులను యాంత్రిక, సాంకేతిక ప్రక్రియలతో తాకితే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ మర్మాన్ని గమనించి భక్తజనులు రథాలపైకి వెళ్లి మూలవిరాట్టుని స్పర్శించి, ఆలింగనం చేసుకుని దర్శించుకుంటేనే తరిస్తామనే అపోహ నుంచి బయటపడాలని శంకరాచార్య కోరారు.
శాస్త్రీయమైన మంత్ర, తంత్ర, యంత్ర శక్తులతో ప్రతిష్ఠించబడడంతో మూలవిరాట్టు కొన్ని పరిధులకు పరిమితమవుతుంది. నిత్యసేవలు, ఉత్సవాలు, పూజాదులకు సంబంధించి శాస్త్రీయమైన ధర్మాలు, ఆచారాలు, నియమనిబంధనలు ఆచరణలోకి వస్తాయి. వీటిని చిత్తశుద్ధితో ఆచరించడమే నిజమైన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి భావాలకు ప్రతీకగా భక్తులు గుర్తించాలి.
రథాలపై దేవుళ్లకు శాస్త్రోక్తంగా సేవలు, పూజాదికాలకు అనుమతి, అర్హత కలిగిన గజపతి మహారాజా, దైతపతులు, సేవాయత్‌లు రథాలపైకి వెళ్లడం అనివార్యం.
అయితే ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం కావాలని కోరుకోవడం తగదని గోవర్ధన పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి భక్తులకు సూచించారు.
వచ్చే సంవత్సరం జరగనున్న రథయాత్ర నుంచి శంకరాచార్య మార్గదర్శకాల్ని అమలుజేసేందుకు దేవస్థానం అధికార మండలి సన్నాహాలు చేస్తోంది.
- ఎస్వీ రమణమూర్తి,
న్యూస్‌లైన్, భువనేశ్వర్