కార్తీక మహాపర్వం పున్నమి | Karthika Pournami Special Pooja At Shivalayam | Sakshi
Sakshi News home page

కార్తీక మహాపర్వం పున్నమి

Published Mon, Nov 11 2019 1:24 AM | Last Updated on Mon, Nov 11 2019 12:59 PM

Karthika Pournami Special Pooja At Shivalayam - Sakshi

కార్తీకమాసంలో ఉన్నవన్నీ పర్వదినాలే. అయితే ఈ పర్వదినాలన్నింటిలోకీ పర్వదినం కార్తీక పున్నమి అని చెప్పవలసి ఉంటుంది. మాసంలో మిగిలిన అన్ని రోజులూ చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసం వంటివన్నీ ఒక ఎత్తు. పున్నమినాడు చేసేవన్నీ ఒక ఎత్తు. అంతటి విశిష్టత ఉంది కార్తీక పున్నమికి. కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు.

ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.  దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు, సిక్కులకు కూడా విశిష్ట పర్వదినం. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

ఈ రోజున స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఇలా చేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష) అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే– ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు ఈ రోజు.

నేడు ప్రత్యేకంగా చేయవలసినవి: దైవ దర్శనం, దీపారాధన, దీపదానం , సాలగ్రామ దానం , దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణం పేర్కొంటోంది. అదేవిధంగా అరుణ గిరిపై వెలిగించే కార్తీక దీపం ఎంతో విశిష్టమైనది. కన్నుల పండుగైనదీ. వందల టన్నుల ఆవునెయ్యిలో వేల టన్నుల నూలు వస్త్రాన్ని ముంచి, అరుణగిరి కొండలపై వెలిగించే ఈ దీపం ముందు ఆనాటి పున్నమి వెన్నెల చిన్నబోతుంది. పదిరోజులపాటు వరుసగా పున్నమి వెన్నెలను వెదజల్లుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement