స్కిన్ కౌన్సెలింగ్
నా వయసు 22 ఏళ్లు. చాలారోజులుగా చుండ్రు సమస్యతో బాధపడుతున్నాను. ఈ సమస్య తగ్గడానికి మార్గాలు చెప్పండి. - రాజారాం, వరంగల్
మీరు తలమీద సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. మీ మాడు మీద ఉండే సీబమ్ అనే నూనెలాంటి స్రావాన్ని వెలువరించే గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. మీరు ఇక్తియోల్ పేల్, కెటాకోనజాల్ ఉండే షాంపూను వాడండి. మీరు ఈ షాంపూను రోజు విడిచి రోజు వాడవచ్చు. ఇక నోటి ద్వారా తీసుకోవాల్సిన ఇట్రాకొనజోల్ టాబ్లెట్లను ఉదయం రెండు, రాత్రికి రెండు మాత్రలు చొప్పున రెండు రోజుల పాటు వాడాలి. ఈ మోతాదును స్టాట్ డోసింగ్ అంటారు. అంటే ఇది మీ సమస్యకు తక్షణం పనిచేసే మోతాదు అన్నమాట. అప్పటికీ సమస్య తగ్గకపోతే నోటి ద్వారా తీసుకునే ఐసోట్రెటినాయిన్ 10 ఎంజీ అనే మందును రెండు నెలల పాటు వాడవచ్చు.
నా స్కిన్‌లో స్వాభావికంగా ఉండాల్సిన మెరుపు లేదు. చర్మం ఎండిపోయినట్లుగా ఉంటోంది. మందులు తీసుకోకుండా, క్రీమ్స్ వంటివి రాసుకోకుండా కేవలం మంచి ఆహారం ద్వారానే చర్మానికి మెరుపు రావాలంటే ఏం చేయాలి? - సుమ, నల్లగొండ
చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్ వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ఇవి శరీరంలోని విషాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్, అవకాడో వల్ల హార్మోన్లలోని అసమతౌల్యతలో వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తాయి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్
హెమటాలజీ కౌన్సెలింగ్
మాకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. వాడికి వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. ఎప్పుడూ తీవ్రమైన అలసటతో ఉంటున్నాడు. దాంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన కొన్ని పరీక్షలు చేసి బాబుకు తలసేమియా అనే వ్యాధి ఉందన్నారు. మాకు తీవ్రమైన ఆందోళనగా ఉంది. ఈ జబ్బు మా బాబుకు ఎందుకు వచ్చింది. దీనికి సరైన, శాశ్వతమైన చికిత్స ఉందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - రేణుక, విజయనగరం
తలసేమియా వ్యాధి జన్యుపరంగా వస్తుంది. ఇది రక్తానికి వచ్చే వ్యాధి. ‘హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోపోరోసిస్’ అనే వైద్యపరీక్ష నిర్వహించడం ద్వరా దీనిని మనం గుర్తించవచ్చు. సాధారణంగా ఈ జబ్బు బారిన పడ్డ చిన్నపిల్లల్లో ఎదుగుదల సరిగా ఉండదు. దీనికి కారణం ఎర్రరక్తకణాల లోపం. వీరిలో ఆరోగ్యవంతమైన ఎర్ర రక్తకణాల వృద్ధికి కారణమైన హిమోగ్లోబిన్ స్వతహాగా తయారు కాలేదు. దాంతో శరీరంలో ‘ఐరన్’ శాతం తగ్గి... వారిలో ఎదుగుదల మందగిస్తుంది. అయితే మీ అబ్బాయి విషయంలో ఈ వ్యాధి ఏ స్థాయిలో ఉందనే అంశాన్ని తగిన పరీక్షలు చేసి నిర్ధారణ చేయాలి. ఒకవేళ ‘తలసేమియా మైనర్’ స్టేజ్‌లో ఉంటే రక్తమార్పిడి అసలు అవసరం ఉండదు. మందులతోనే మీ అబ్బాయిని నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. అలాకాకుండా ‘తలసేమియా మేజర్’ స్టేజ్‌లో ఉంటే మాత్రం కచ్చితంగా 2 లేదా 4 వారాలకు ఒకసారి రక్తమార్పిడి చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కించిన రక్తంలో ఉండే ‘ఐరన్’ శాతాన్ని బట్టి ఈ రక్తమార్పిడి అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే రక్తంలోని ఐరన్ గుండె, లివర్‌లకు చేటు తెస్తుంది. ఈ అవయవాలు పూర్తిగా పాడైపోయి మనిషి మృత్యువాత పడే ప్రమాదం ఉంది.
కాబట్టి రక్తమార్పిడి తర్వాత శరీరంలోని ఐరన్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటూ, దానిని బ్యాలెన్స్ చేసుకోడానికి మందులు వాడుతూ ఉంటే, రోగి అందరిలాగే జీవితాన్ని ఆస్వాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఈ వ్యాధికి ‘బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్’ చికిత్స అత్యుత్తమమైందని చెప్పవచ్చు. ఈ విధానంలో రక్తమార్పిడి అవసరం ఉండదు. ఎందుకంటే రక్త కణాలు పుట్టేది ‘బోన్ మ్యారో’ (ఎముక మజ్జ)లోనే కాబట్టి అక్కడే శాశ్వత చికిత్స నిర్వహిస్తే సరిపోతుంది. వ్యాధిని సంపూర్ణంగా రూపుమాపవచ్చు. ఇందుకోసం మీ బాబు నెల రోజుల పాటు తప్పనిసరిగా ఆసుపత్రిలో ఉండాలి. అలాగే ఆపరేషన్ తర్వాత ఆర్నెల్ల పాటు డాక్టర్ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. చికిత్సను నిపుణులైన వైద్యులు, అధునాతమైన చికిత్సా సదుపాయాలు ఉన్న హాస్పిటల్‌లో చేయించుకోండి. చికిత్స తర్వాత మీ బాబు ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటాడు.
డాక్టర్ గణేశ్
జెషైట్వార్
హెమటాలజిస్ట్ అండ్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజగూడ, హైదరాబాద్
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
మా అమ్మాయికి ఇటీవల బాబు పుట్టాడు. పుట్టినప్పుడు బాబు బరువు చాలా తక్కువ. అయితే ఇలా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇది నిజమేనా? కొంచెం వివరంగా చెప్పండి. - సవిత, నిజామాబాద్
మీరు మీ అమ్మాయికి జన్మించిన శిశువు బరువు వివరాలు చెప్పలేదు. సాధారణంగా బరువు తక్కువతో పుట్టిన పిల్లలకు కిడ్నీల జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. వీళ్లలో మూత్రపిండాలలోని ఫిల్టర్‌ల సంఖ్య తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇవి పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉండాలి. కానీ ఇలాంటి పిల్లల్లో ఇవి ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షలు మాత్రమే ఉంటాయి. సాధారణంగా 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన వారిలో ఈ ముప్పు ఉండే అవకాశం ఎక్కువ. ఫిల్టర్స్ తక్కువ కావడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. షుగర్ రిస్కు కూడా ఎక్కువ. తొందరగా కిడ్నీలు పాడైపోతాయి. ఇక పిల్లలకు కిడ్నీ సమస్య ఉన్నట్లయితే వాళ్లు తీసుకునే ప్రొటీన్ తగ్గించాలి. అయితే శాకాహార ప్రొటీన్ల వల్ల సమస్య ఏమీ ఉండదు. కాబట్టి మాంసాహారాన్ని పూర్తిగా మానివేసి, ఇతర ప్రొటీన్‌లను తగ్గిస్తే సరిపోతుంది. ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించాలి. దాహంగా ఉంటేనే నీళ్లు తాగాలి. పండ్లు పండ్లరసాలు, పొటాషియం తగ్గించాలి. పొటాషియం ఎక్కువైతే గుండెకు కూడా సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆపిల్స్, బొప్పాయి తప్ప వేరే పండ్లు తినకూడదు. ఈ జాగ్రత్తలు పాటించి మీ అమ్మాయి వాళ్ల బాబు కిడ్నీలను కాపాడుకోవచ్చు.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్